Suryaa.co.in

Editorial

ఏపీ బీజేపీ దళపతిగా సుజనా?

– సోము వీర్రాజుకు మంగళం?
– సుజనాకు నద్దా గ్రీన్‌సిగ్నల్‌?
– ఇటీవలే బీఎల్‌ సంతోష్‌జీతో సుజనా భేటీ
– ఏపీలో కమలవికాసానికి బీజేపీ కసరత్తు
– సుజనాతోనే అది సాధ్యమన్న భావన
– ఎన్నికల కోణంలో సుజనాకే పగ్గాలివ్వాలని నిర్ణయం
– సమన్వయం-సమర కోణంలోనే సుజనా పేరు
– అధ్యక్ష పదవికి సత్యకుమార్‌ విముఖత
– మరికొంత కాలం జాతీయ రాజకీయాల్లోనే సత్యకుమార్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు దాదాపు ఖరారయింది. ఆ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే పార్టీ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీని కేంద్ర మాజీ మంత్రి సుజనా భేటీ కావడం గమనార్హం.

ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి రానున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీని వేగంగా నడిపించడం, కార్తకర్తలకు దిశానిర్దేశం చేయడం, వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై పోరాటాల్లో ఘోరంగా విఫలమైన సోము వీర్రాజు పనితీరుపై జాతీయ నాయకత్వం చాలాకాలం నుంచి తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆయన ప్రభుత్వంపో పోరాటానికి మొహమాటపడుతున్నారని, రాష్ట్ర పార్టీలో ఒక ప్రత్యేకమైన వర్గాన్ని తయారుచేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

దానికితోడు సోమువీర్రాజు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత, ఆయన వైఖరి కారణంగా మీడియాలో పార్టీకి చోటు లేకుండా పోయిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మీడియాపై కులముద్ర వేయడం, కొన్ని మీడియా సంస్థలను నిషేధించడం, వాటిని పార్టీ నేతలెవరూ వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించడంతో బీజేపీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయన్న భావన అటు నాయకత్వంలోనూ లేకపోలేదంటున్నారు.

అయితే సోము వీర్రాజు స్థానంలో బలమైన నేత ఎవరన్న అన్వేషణలో ఉన్న నాయకత్వానికి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ప్రత్యామ్నాయంగా కనిపించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇద్దరూ వైసీపీ సర్కారుకు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విమర్శనాస్ర్తాలు సంధించేవారే. వ్యూహకర్తగా పేరున్న సత్యకుమార్‌ అయితే, వైసీపీ పాలనలపై మరీ దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఆయనకు పార్టీలో ఫాలోయింగ్‌ ఉంది.

సుజనా చౌదరి మరీ అంత దూకుడు కాకపోయినా మంచి వ్యూహకర్త, సమన్వయకర్త. కార్యదక్షుడిగా పేరున్న సుజనా కమలదళాలను సమర్ధవంత ంగా నడిపించగమ సమర్ధుడన్న భావన నాయకత్వంలో లేకపోలేదు. కీలకమైన ఎన్నికల సమయంలో సమన్వయమే ప్రధానం కాబట్టి, సుజనాకే బీజేపీ పగ్గాలు ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నాయకత్వం విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి పార్టీ జాతీయ నాయకత్వం.. సత్యకుమార్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న యోచన చేసినప్పటికీ, ఆయన అందుకు నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ కో ఇన్చార్జిగా, అండమాన్‌ ఇన్చార్జిగా ఉన్న సత్యకుమార్‌.. గుజరాత్‌, కర్నాటక, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ర్టాలకు సమన్వయకర్త, పరిశీలకుడు, ప్రచారకర్తగా వెళుతున్నారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆయనకు అప్పగించిన జిల్లాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.

దేశంలో ఎక్కడ ఎన్నికలున్నా, జాతీయ నాయకత్వం ఆయన సేవలు వాడుకుంటోంది. పైగా ఆయన వయసు కూడా చిన్నదే కాబట్టి, మరికొన్నాళ్లు జాతీయ రాజకీయాల్లోనే కొనసాగాలని సత్యకుమార్‌ భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లనే సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్ష పదవి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దానితో సమన్వయం చేయడంలో అనుభవం ఉన్న సుజనా చౌదరికే, ఏపీ బీజేపీ పగ్గాలివ్వాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి విజయవాడలోని సుజనా ఫంక్షన్‌హాల్‌లో, చాలాకాలం నుంచి పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా ఆయన కొన్నేళ్ల నుంచి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో తన ఫంక్షన్‌హాల్‌ను, కరోనా క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చారు. ఇత ర ప్రాంతాలకు బెడ్లు సరఫరా చేశారు.

వివాదరహితుడిగా పేరున్న సుజనాకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల, పార్టీలో స్తబద్దతగా ఉంటున్న వారంతా తిరిగి క్రియాశీలమయ్యే అవకాశం ఉందన్న అంచనా, నాయకత్వంలో లేకపోలేదు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తెలిసిన సుజనాను, వ్యతిరేకించేవారెవరూ లేకపోవడం విశేషం.

కాగా దానికంటే ముందు.. పార్టీ సంఘటనామంత్రిగా ఉన్న మధుకర్‌రెడ్డిని, బదిలీ చేయాలన్న డిమాండ్‌ చాలకాలం నుంచి వినిపిస్తోంది. ఆయన వల్ల పార్టీ విస్తరించకపోగా అంతకంతకూ బలహీనమవుతోందన్నది పార్టీ వర్గాల ఫిర్యాదు. ఆయన స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, జిల్లాల్లో నేతల సమస్యలకు తగిన పరిష్కారం చెప్పడం లేదన్నది ఆయనపై ఉన్న ఫిర్యాదు. ఈ విషయంలో… దాదాపు 7 ఏళ్లు తెలంగాణ సంఘటనా మంత్రిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్‌ పనితనంలో, మధుకర్‌రెడ్డి కనీసం పదోవంతు ప్రతిభ కూడా కనబరచలేదని స్పష్టం చేస్తున్నారు.

వీటికిమించి రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేసి, బీజేపీని బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా మార్చడంలో, మధుకర్‌రెడ్డి విఫలమయ్యారన్నది మెజారిటీ నేతల విమర్శ. ఒకవేళ సుజనాచౌదరికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తే, దానికంటే ముందు మధుకర్‌రెడ్డి స్ధానంలో.. మరొకరిని నియమిస్తేనే ఫలితం ఉంటుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A RESPONSE