మాయమౌతున్న మనిషిని
చేయితో పట్టుకొచ్చిన మనీషి
తల్లడిల్లుతున్న పల్లెసీమలను
ఊరడించిన కరుణామయుడు
ప్రకృతిలో అంతర్లీనమవుతూ
సుకృత కవితలల్లిన మహాకవి
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ!
ఉన్నత విద్యలు చదువనూ లేదు
ఉన్న ఊరిలోనే పశువుల కాపరి
కారణ జన్ముడేమో అందె ఎల్లయ్య
శారదాంబ వరియించ అందె శ్రీ గా మారే
అశువుగా కవితలను లలితంగా రాసి
అందెవేసిన కవిగా అవనిలో వెలుగొందే!
మానవత్వం గురించి రాసిన విరించి
దోపిడి తనాన్ని ఖండించె పళ్లు బిగించి
పేదల పక్షాన గట్టిగా నిలబడిన అక్షరం
బాధితుల తరపున వాదించిన సుకవి!
అందెశ్రీ పాటలు మాటలు అజరామరం
అందె శ్రీ గాత్రం ఝంఝా మారుతం
తెలంగాణ తల్లికి అందెశ్రీ అలంకరించే
అక్షర సుమములతో రాష్ట్రీయ గీతం!
– జి.సూర్యనారాయణ,6281725659.