Suryaa.co.in

Devotional

సూర్యారాధన వల్ల ఆరోగ్యం,శత్రునాశనం

ఇప్పుడు భారతదేశానికి ఈ రెండు ప్రయోజనాలూ కావాలి. ఎందుకంటే రోగాన్ని కూడా ఆయుధంలా వాడుకుంటూ సమూహ క్షేమాన్ని భంగం కలిగించే అసురశక్తులు భారతీయులకు, భారతదేశానికీ శత్రువులు. వారు అన్ని మతాలకీ శత్రువులు.
శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని భయంకరమైన శత్రుసంహార సమయంలోనే అనుష్ఠానం చేశారు. అగస్త్యుల వారు ఆ సమయంలోనే ఉపదేశించారు.ఆదిత్యోపాసనా విధానాలు చాలా చాలా శాస్త్రాలలో ఉన్నప్పటికీ కూడా ప్రతివారూ సులభంగా చేయగలిగేది ఆదిత్య హృదయం. ప్రతిరోజూ మూడుమార్లు పఠనం చేయడం చాలా విశేషం.
ఆదిత్యారాధన మన మనస్సుకి ధైర్యాన్ని, అభయాన్ని, శాంతినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది.
మనం చెప్పుకుంటున్న అభయవాక్యాలు వ్యక్తిగత అభయ వాక్యాలు, ఓదార్పు వాక్యాలు కాదు. మహర్షులు తపశ్శక్తితో, అనుభవంతో మనకు అందించినటువంటి అభయవాక్యాలు.ఇటు అటు కదలలేని స్థితిలో ఒంటరిగా చిక్కుకున్నప్పుడు ఆదిత్య హృదయ పారాయణ ఒక బంధువులా కాపాడుతుంది. ఆదిత్యుడు మనలను పదమూడు రకాల బంధుత్వాలతో కాపాడతాడు.
ఆదిత్య ఉపాసనలో పండిపోయిన మహానుభావుడు చెప్పినది –
ఉపాస్యమైన స్వయంప్రకాశ స్వరూపమైన పరమాత్మ;
బంధువు; ఆచార్యుడు, పూజ్యుడు, రక్షకుడు, కన్ను; దీపం వంటివాడు; గురువు (తల్లితండ్రీ వంటి వాడు); ప్రాణనిధి; సృష్టిలో అన్నింటికీ మూలమైన వాడు; ఓజశ్శక్తి; – ఇలా పదమూడు రకాలుగా ఆదిత్యుడు మనలను కాపాడుతున్నాడు.
(మయూరశతకం)
త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో!! (సాంబుడు)
వేదం, సూక్తాలు తెలిసిన మహాత్ములు స్వరసహితంగా జపించగలిగే అక్షరశుద్ధి, సంస్కారములు కలిగిన వారు వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రాలు సమస్త ప్రపంచ క్షేమం కోసం పఠించవలసిన అవసరం ఉంది. అలా చేసినట్లయితే వ్యక్తికీ, దేశానికీ, ప్రపంచానికీ క్షేమం కలుగుతుంది. అవి తెలియని వారు వాటి సారభూతమైన ఆదిత్య హృదయం వంటివి చదువుకోవచ్చు.
ఆదిత్యుని పన్నెండు నామాలు చదువుకోవచ్చు.
శ్రీ మిత్రాయ నమః
శ్రీ రవయే నమః
శ్రీ సూర్యాయ నమః
శ్రీ భానవే నమః
శ్రీ ఖగాయ నమః
శ్రీ పూష్ణే నమః
శ్రీ హిరణ్యగర్భాయ నమః
శ్రీ మరీచయే నమః
శ్రీ ఆదిత్యాయ నమః
శ్రీ సవిత్రే నమః
శ్రీ అర్కాయ నమః
శ్రీ భాస్కరాయ నమః
ఆదిత్యునికి రక్తచందనంతో కానీ కుంకుమ కలిపిన నీటితో కానీ, ఎర్ర అక్షతలు, దూర్వాంకురాలతో వీలైనంత అర్ఘ్యములు ఇవ్వడం మంచిది.
ఆదిత్యునికి అవతారపరంగా చూస్తే అధిదేవత శ్రీరామచంద్రమూర్తి.
గోక్షీరంతో చేసిన ప్రసాదం వండి సూర్యభగవానునికి నివేదించడం మంచిది.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE