* వైసీపీ మంత్రులు మద్యం మాఫియా కిక్కులో మతి తప్పి మాట్లాడుతున్నారు
* ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నేత పవన్ కళ్యాణ్
* మీడియాతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్
‘ఎవరికైనా మద్యం తాగితే కిక్కు ఎక్కుతుంది… వైసీపీ మంత్రులకు మాత్రం మద్యం తయారు చేసి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి, ఆ రక్తపు సొమ్ము జేబులో వేసుకుంటే కిక్కు ఎక్కుతుంది. ఆ మాఫియా కిక్కుతోనే మతి తప్పింది. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై లేనిపోని వ్యాఖ్యలు చేసి మంత్రులు పబ్బం గడుపుకుంటున్నార’ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ “ఎన్నికల్లో ఓడిపోవడం అంటే అదేమీ నేరం కాదు. ప్రజల అభిప్రాయం ఎన్నికల్లో ఓటు ద్వారా తెలపడం మాత్రమే. వారి తీర్పును గౌరవించి ప్రజల్లోనే ఉండడం అనేది నాయకుడి లక్షణం. పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. ప్రజల తీర్పును శిరసా వహించి వెనక్కు వెళ్లిపోకుండా వారితోనే మమేకమై, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అవి చూసి భయం పట్టుకునే రాష్ట్ర మంత్రులు రకరకాల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ కూడా విశాఖపట్నంలో ఓడిపోయారు. దానిని గుర్తు పెట్టుకొని మంత్రులు మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుంటే మేము కూడా ముఖ్యమంత్రి తల్లి ని అనాల్సి వస్తుంది.
పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే స్థాయి లేని నాయకులు సైతం ఇష్టానుసారం నోరు పారేసుకుని ఆనంద పడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ లకు కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి మాత్రమే వైసీపీ మంత్రి పదవులు ఇచ్చింది. ఒక్కసారి అధికారం కోల్పోతే మళ్లీ వారికి రాజకీయ పుట్టగతులు ఉండవు అన్నది గుర్తుంచుకోవాలి. మీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జనసేన పార్టీ కచ్చితంగా ఉంది అన్నది గుర్తు ఉంచుకోండి. మీరు వేర్వేరు పార్టీలతో మమ్మల్ని కలిపేసి, ప్రజల్ని అయోమయం చేయాలని చూస్తున్నారు. జనసేన పార్టీని ఎదుర్కొనలేక పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. దీనిని వెంటనే ఆపకపోతే ప్రజలే మిమ్మల్ని రోడ్లమీద తిరగనియ్యని పరిస్థితి వస్తుంది జాగ్రత్త.
మేము ఎవరితో కలిస్తే మీకెందుకు?
జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతున్న తీరు వైసీపీ నాయకులకు నిద్ర పట్టనీయడం లేదు. రకరకాల వింత సమీకరణాలతో కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నారు. జనసేన పార్టీకి సొంత రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మేం ఎవరితో కలుస్తాం.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అనే వృధా మాటలు మాని ముందు ప్రజల పాలన మీద దృష్టి పెట్టండి. మీకు పాలన చేతకాక, పవన్ కళ్యాణ్ ని మాటలు అని ఆనందపడుతున్నారు. మీ ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారు. రైతులకు మంచి చేయాలని, ప్రజలకు మేలు చేయాలని తలిచే పవన్ కళ్యాణ్ ని అనరాని మాటలు అంటున్న వైసీపీ వాళ్ళ దుర్బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు ఘోర ఓటమి తప్పదు” అని సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పి.వి.ఎస్.ఎన్.రాజు, పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు.