-సీఎం జగన్‌కు సోదరి సునీత సవాల్
-తప్పు చేసింది నా భర్త అయితే అరెస్ట్ చేయండి
-కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా?
-జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిది
-వైఎస్ వివేకా కుమార్తె సునీత
వివేకా హత్య తదనంతర పరిణామాలు, హంతకులెవరు? వారికి కొమ్ముకాస్తుంది ఎవరు? జగన్ కోసం వివేక ఎంత కృషి చేశారు? ఈ కేసు ఎందుకు ముందుకు పోవడం లేదన్న అంశాలపై దమ్ముంటే నాతో చర్చకు రావాలి. మీ సాక్షి చానెల్‌లో డిబేట్‌కు వచ్చేందుకు నేను సిద్ధం. వచ్చేందుకు మీరు సిద్ధమేనా’’ అని సీఎం జగన్‌కు ఆయన సోదరి డాక్టర్ సునీత సవాల్ విసిరారు.
డాక్టర్ సునీత తన సోదరుడు సీఎం జగన్‌నుద్దేశించి ఏం మాట్లాడారంటే… గాలి తగిలితే దెబ్బ త్వరగా మానిపోయే అవకాశం ఉంది. ఓ వైద్యురాలిగా జగన్‍రెడ్డికి సలహా ఇస్తున్నా. జగన్ కోసం వివేకా పదవిని త్యాగం చేశారు. ఇన్నీ చేశాక కూడా మీకు ఎందుకింత ద్వేషం? వివేకాను చంపేంత ద్వేషం ఎందుకొచ్చింది? వివేకా మీకు ఏం పాపం చేశారు?
ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి. జగన్ ప్రసంగంలో వివేకాను ప్రస్తావించారు. వివేకా గురుంచి జగన్ నెగెటివ్‍గా మాట్లాడారు. చనిపోయేదాకా జగన్ కోసమే వివేకా పనిచేశారు. వివేకా గురించి మాట్లాడటానికి ఒక్క మంచి మాట కూడా గుర్తుకు రాలేదా? కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా? నిందితులు ఎవరో సీబీఐ చెప్పింది.. కానీ సీబీఐపై నమ్మకం లేదని జగన్ అంటున్నారు.
అసలు జగన్‍కు ఏ వ్యవస్థపై నమ్మకముంది? గతంలో నా భర్తపై జగన్ అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్షించాల్సిందేనని మా అమ్మ అన్నారు. ఎవరు చేశారో దేవుడికి, కడప ప్రజలకు తెలుసని జగన్ అంటున్నారు. ఎవరు చేశారో సీఎంగా ఉన్న జగన్‍కు తెలియదా? తప్పు చేసింది నా భర్త అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయండి. నేను అయినా .. నా భర్త అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.
అవినాష్ పిల్లాడు అని జగన్ అంటున్నారు. పిల్లాడు అయితే స్కూల్‍కు పోవాలి. పిల్లాడికి ఎంపీ టికెట్ ఇవ్వరు. నిందితుల్ని జగన్ ప్రోత్సహించవద్దు. మా నాన్న హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నా. ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయా?. ఈ ఐదేళ్లు వివేకా గురించి మీరు మర్చిపోయారు. ఈ పోరాటంలో నాకు అండగా నిలబడండి. నిందితులకు ఓట్లు వేయొద్దని వేడుకుంటున్నా.
ఈ పోరాటంలో షర్మిల నాకు సహకరించారు. ఎన్నికల్లో షర్మిల గెలిస్తే వివేకా కోరిక తీరుతుంది. మీ చెల్లి షర్మిలకు సపోర్ట్ చేయాలని జగన్‍ను కోరుతున్నా. జగన్ ఛానెల్‍లో లైవ్ డిబేట్ ఏర్పాటు చేయండి. ఈ విషయంపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్దమా?