Suryaa.co.in

Andhra Pradesh

సెప్టెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా

• ఫోర్టిఫైడ్ రైస్ ను ప్లాస్టిక్ బియ్యంగా అపోహపడవద్దు
• ఫోర్టిఫైడ్ రైస్ లో పోషకాలు అధికం
• అవగాహన కోసం ప్రభుత్వం విస్తృత ప్రచారం
• రాగులు, జొన్నలు రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పంపిణీ
• వచ్చే సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
– రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి ఫోర్టిఫైడ్ బియ్యంను అన్ని జిల్లాల్లో పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ల ద్వారా పంపిణీ చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ బియ్యం లో ఐరన్, పోలిక్ ఆమ్లం, బి12 ఉంటాయని, వీటి వలన ఐరన్ రక్తహీనతను నిరోధిస్తుందని, ఫోలిక్ ఆమ్లం రక్తం ఏర్పడటానికి సహయపడుతుందని, బి12 విటమిన్ తో నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ను సాధారణ బియ్యంలో 1:100 నిష్పత్తిలో కలపటం వల్లన పోషక బియ్యం తయారవుతుందన్నారు.

ఈ బియ్యం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఫోర్టిఫైడ్ బియ్యంతో శరీరానికి పోషకాలు అందటమే కాకుండ విటమిన్స్ అందుతాయని తెలిపారు. ఫోర్టిఫైడ్ బియ్యం వండటానికి నీళ్లలో కలిపినప్పుడు అవి నీటిపై తేలటంతో ప్లాస్టిక్ అని అవగాహన లేని కొందరు అపోహపడుతున్నారని మంత్రి అన్నారు. మరికొంత మంది కావాలని ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తుందని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహోన్నత ఆశయంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం చేకూర్చటానికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఫైలట్ ప్రాజెక్ట్ గా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేశంలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ నెల నుంచి ఐసీడీఎస్ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 3 కేజీల పోషక బియ్యం ప్యాకెట్లను ఇంటికే రేషన్ పథకం కింద పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన పెంచటానికి ప్రభుత్వం ఇప్పటికే పోస్టర్లు తయారు చేయటం జరిగిందని, అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు తో విడియో కూడా రూపొందించి ప్రచారం నిర్వహించనున్నామని చెప్పారు. విస్తృత ప్రచారం వలన ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన గోదుమపిండి కూడా అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు కూడా పిలవనున్నట్లు తెలిపారు. బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యం ప్రతి ఒక్కరూ తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనే అనుమానాలు తీరాలంటే మెడికల్ షాపుల్లో దొరికే అయోడిన్ ను తెచ్చి ఫోర్టిఫైడ్ బియ్యంపై వేస్తే నీలం రంగులోకి మారతాయని వివరించారు. ప్లాస్టిక్ అయితే రంగు మారవు అని అన్నారు. అలాగే నీళ్లలో నానబెట్టినప్పడు ఫోర్టిఫైడ్ బియ్యం త్వరగా మెత్తబడతాయని, ప్లాస్టిక్ మెత్తబడదన్నారు. ఈ విషయాన్ని పాత్రికేయుల సమావేశంలో ప్రయోగాత్మకంగా మంత్రి చేసి చూపించారు. ఫోర్టిఫైడ్ బియ్యంను పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోనూ తయారు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

రాయలసీమ జిల్లాల్లో రేషన్ పంపిణీలో బియ్యంతో పాటు రాగులు, జొన్నలు అందిస్తున్నామని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కోన్నారు. వచ్చే సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ధాన్యం రైతులకు 5లేదా6 రోజుల్లో నగదు జమచేస్తామని హామి ఇచ్చారు. దళారీలకు అస్కారం లేకుండా కొనుగోళ్లు ఉంటాయన్నారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE