– పావలా వడ్డీకే విదేశీ విద్య రుణాలు
– త్వరలో స్డూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్
– మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ విద్యా విధానానికి దేశంలోనే గుర్తింపు దక్కాలి
– పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించాలి… మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి
– ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూళ్లల్లోని టీచర్లే బెస్ట్
– విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తోన్న మంత్రి లోకేష్‌కు అభినందనలు
– మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు
– వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారమే చేసుకోవాలని కూడా సూచించా
– భామిని ఏపీ మోడల్ స్కూలును పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు
పార్వతిపురం మన్యం జిల్లా, భామిని: విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో అంత మేర పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉన్నత, విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం, భామిని గ్రామంలో ఏపీ మోడల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం 3.O కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్, టీచర్, విద్యార్థులతో సీఎం మాట్లాడారు. మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్ టూల్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు.
ఈ సందర్భంగా భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి… దీనికి అందరూ సహకరించాలి. మూడేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ చేసేలా ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు. విద్యలో పిల్లల బలాబలాలు తెలుసుకునేందుకు… దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్, స్టీమ్ అనే మూడు రకాలుగా వర్గీకరించారు.
క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు. పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా… ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా క్లిక్కర్ బాగా పని చేస్తోంది. పిల్లలు మట్టిలో మాణిక్యాలు… సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరు. అంధ క్రికెట్ క్రీడాకారిణి కరుణ కుమారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించింది.
విద్యా విధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. అంతే కాకుండా… ఈ తరహా సమావేశాల్లో అందరూ పాల్గొంటున్నాం. పల్నాడులో మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అలాగే ప్రజా ప్రతినిధిలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.’అని ముఖ్యమంత్రి చెప్పారు. కష్టంగా కాదు… ఇష్టంగా చదవండి ‘ఒకప్పుడు పిల్లలు భారం అనుకునేవారు… కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి, పిల్లలే శ్రీరామ రక్ష, పిల్లలే భవిష్యత్. మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిట్స్ వరకు నాణ్యత పెంచాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం. స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా అందిస్తున్నాం.
విలువలతో కూడిన సమాజాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నాం. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం. చాగంటి ప్రవచనాల ద్వారా విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. గతంలో టీచర్లకు చాలా యాప్ లు ఉండేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం. శనివారం నో బ్యాగ్ డే… ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు. 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు. చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్ అప్రోచ్ ద్వారా ప్రయత్నిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న బెస్ట్ లెర్నింగ్ విధానాలు అధ్యయనం చేస్తున్నాం. విదేశాలకు వెళ్లి టీచర్లు అధ్యయనం చేస్తున్నారు.
టీచర్లను రిక్రూట్ చేయకుండా చదువు చెబితే అది బూటకమే అవుతుంది. ప్రభుత్వ టీచర్లను నియమించాం… చక్కటి చదువు చెప్పిస్తున్నాం. మెగా డీఎస్సీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం. ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం. పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం… దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సామాజిక బాధ్యతగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది.’ అని సీఎం సూచించారు. విద్యార్థులు… వినూత్న ఆలోచనలు ‘ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్లే బెటర్ అని అర్థమవుతుంది.
స్కూళ్లకు ఇంత మంది టీచర్లను రిక్రూట్ చేశాం… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అందరూ కోరుకునే పరిస్థితి రావాలి. గతంలో టీచర్లను అవమానించారు… మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. టీచర్లను గౌరవించే బాధ్యత మాది. పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లది. ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది… మేం సరి చేస్తున్నాం. విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం… పిల్లలు అదరగొట్టారు. వచ్చే ఏడాది జనవరిలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నాం. ఏడో తరగతి నుంచి వినూత్నంగా ఆలోచించాలి.
గ్రూప్ గా… వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ఆలోచన చేయాలి. ఇన్నోవేటివ్ గా ఆలోచించే వారిని జిల్లాల స్థాయిలో గుర్తిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగే ఇన్నోవేటర్స్ పార్టనర్ షిప్ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. ఆ సదస్సుకు వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాం. పిల్లల ఆలోచనలు బాగుంటే వారి ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలి.’అని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలోని విద్యార్థుల బాధ్యత విద్యా శాఖ మంత్రిదే ‘మంత్రి లోకేష్ చదువుకునే రోజుల్లో ఎలా చదువుతున్నారనే విషయమాన్ని తెలుసుకునేందుకు నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్ కు చదువు చెప్పే టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు.
అంతా లోకేష్ తల్లి భువనేశ్వరీనే చూసుకునేవారు. కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం.. ఆ తర్వాత చక్కగా చదువుకున్నారు… ఇప్పుడు మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు. వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారమే చేసుకోవాలని కూడా సూచించాను. కానీ లోకేష్ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారు. విద్యా శాఖ చాలా కష్టంగా ఉంటుందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా పని చేస్తానని లోకేష్ చెప్పారు.
దానికి అనుగుణంగానే విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నా. భువనేశ్వరి లోకేష్ ను స్టాన్ ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యా శాఖ మంత్రి లోకేష్ దే.’అని ముఖ్యమంత్రి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు అవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. సభ అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సహా విద్యా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.











