Suryaa.co.in

Editorial

‘ఎన్టీఆర్ సతీమణి’… అదనపు అర్హత కాదన్నమాట!

* లక్ష్మీపార్వతికి తత్వం బోధించిన సుప్రీంకోర్టు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇకపై నేను ఫలానా నాయకుడి భార్యను.. నేను ఫలానా ఆమె భర్తను అంటే కుదరదురా అబ్బాయ్.. ఆ ముసుగులు చెల్లవమ్మాయ్.. ఇది నేను చెబుతున్నది కాదండోయ్. సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల్లో చేసిన ఒక ప్రధానమైన వ్యాఖ్య.

ఇంతకూ విషయమేమిటంటే… మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆస్తులెంతో విచారించాలని, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ దివంగత ఎన్టీఆర్ ద్వితీయ కళత్రం.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ వీరాభిమాని అయిన లక్ష్మీపార్వతి, గతంలో ఏపీ హైకోర్టులో కేసు వేశారు. తన అల్లుడి ఆస్తుపాస్తులేమిటో తెలుసుకోవాలన్నది ఆమె ఆరాటం. సరే.. ఆమె ముచ్చటను అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వమయితే ఏదో ఒక రకంగా తీర్చేదేమోగానీ.. ఏపీ హైకోర్టు, ట్రయల్ కోర్టు మాత్రం కొట్టివేశాయి.

అయినా పట్టువదలని విక్రమార్కురాలయిన ఈ నాయకురాలు నాగమ్మ, ఆ సంగతి తేల్చుకునేందుకు సుప్రీంకోర్టు గడప ఎక్కింది. తాజాగా అక్కడా మేడమ్ గారికి చుక్కెదురయింది. తీర్పు సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికలిగించాయి. కేసు పూర్వాపరాలు చదివిన న్యాయమూర్తులు, నొసలు ముడివేసి..‘‘ ఒకరి ఆస్తులు తెలుసుకునేందుకు మీరెవరు? అసలు ఎవరి ఆస్తులు, ఎవరికి తెలియాలి? ఎన్టీఆర్ భార్య అనేది అదనపు అర్హత అవుతుందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చివరాఖరకు.. అసలు పార్వతి పిటిషన్‌లో పేర్కొన్న అంశాల్లో విలువేలేదు పొమ్మంటూ, దానిని డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పు చాలా చక్కగా ఉందంటూ అభినందించింది.

ఇక్కడ తెలుసుకోవలసిన తత్వమేమిటంటే.. ఒకరి విషయాల్లో మరొకరు వేలు పెట్టకూడదని! ఒకరి ఆస్తుల వివరాలేమిటో మరొకరు తెలుసుకునే అవసరం లేదని!! వీటికి మించి.. ఫలానా నాయకుడి భార్య అనేది అదనపు అర్హత కానేకాదని!!!

cbnచాలామంది తెలుగువారు ఇప్పటిదాకా లక్ష్మీపార్వతికి, దివంగత నేత ఎన్టీఆర్ పేరు అదనపు అర్హతగా భావిస్తూ వచ్చారు. తాజాగా పెద్ద కోర్టు వ్యాఖ్యల ప్రకారం.. ఇకపై ఎన్టీఆర్ భార్య అన్నది అదనపు అర్హత కాదని తేలిపోయింది. ఫీజులు పోయినా లా తెలిసిందన్నట్లు.. తీర్పు రావడం ఆలస్యమయినా.. లక్ష్మీపార్వతి కేసు పుణ్యాన, తెలుగుజాతికి ఈ ‘అదనపు అర్హత’ భావమేమిటో తెలిసిపోయింది. అన్నట్లు.. ఈ తీర్పు వచ్చిన రోజునే లక్ష్మీపార్వతి కూతురు-అల్లుడి మ్యారేజ్ డే. అదేనండీ.. చంద్రబాబునాయుడు-భువనేశ్వరి పెళ్లిరోజన్నమాట!

LEAVE A RESPONSE