వైసీపీలో టెన్షన్!
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫైబర్‌నెట్ కేసులో జగన్ సర్కార్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం నాడు సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం ఈ విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
బాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని.. ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని మరికొంత మంది ప్రస్తావనే లేదని వాదించారు. అంతేకాదు.. కొందరికి ముందస్తు బెయిల్, మరికొందరికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పటికీ తమ క్లయింట్‌కు ఎందుకు ఇవ్వట్లేదనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు లూథ్రా..
ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఫైబర్ నెట్ కేసులో జగన్ సర్కార్‌కుసుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ప్రభుత్వం మంగళవారం నాటికి బదులివ్వాలని కీలక ఆదేశాలు జారీచేసింది. అనంతరం ఈ కేసు పూర్తి విచారణను మంగళవారం నాడు జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలతో జగన్ ప్రభుత్వానికి ఒకింత షాక్ తగిలినట్లయ్యింది.
అయితే.. ఈ కేసు విషయంలో సుప్రీం నోటీసులకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. నోటీసులకు సరైన రిప్లయ్ రాకపోతే ధర్మాసనం ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై ప్రభుత్వం, వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అయితే.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ-25గా ఉన్నారని, విచారణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు కొద్దిరోజుల క్రితం పీటీ వారెంటు దాఖలు చేసిన విషయం విదితమే.
కాగా.. ఈ విచారణ అనంతరం సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబుకి 17A వర్తిస్తే.. ఫైబర్‌నెట్ కేసులో కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. స్కిల్ కేసు పూర్తి అయిన తర్వాత.. ఫైబర్‌నెట్‌పై నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. మంగళవారం నాడు స్కిల్, ఫైబర్ కేసులపై న్యాయస్థానంలో విచారణ జరగనున్నది.
ఈ క్రమంలో.. ఫైబర్‌నెట్ కేసులో ధర్మాసనం ఎక్కడ ఆదేశాలు ఇస్తుందేమోనన్న.. ఆందోళనతో బుధవారం వరకు చంద్రబాబును.. అరెస్ట్ చేయబోమని ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాది ముకుల్ రోహత్గీ అండర్‌టేకింగ్ ఇచ్చారు. మరోవైపు.. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ కోర్టు సమ్మతించించి.. సోమవారం (అక్టోబర్- 16న) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.