సురవరం..
తెలంగాణ కవులకు వరం..
అక్కడ కవులే లేరన్న
ఒక్క మాట..
ప్రతాపరెడ్డి శివాలై..
ఒక సవాలై..
354 మంది
తెలంగాణ కవుల
జీవిత చరిత్రగా వచ్చింది
గోల్కొండ కవుల సంచిక..
ఒక మరీచిక..!
తెలుగు..హిందీ..
ఉర్దూ..సంస్కృతం..
పార్సీ..ఆంగ్లం..
ఎన్ని భాషలు వచ్చినా
తెలుగు ఆయన గుండె ఘోష
తెలుగు వారి సమైక్యతే
ఆయన మనసు భాష!
పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ
గౌతమీ గంభీర గమనమునకు
ఆలంపురీ
నందనారామ విభ్రాజి
మల్గోబ ఫలరాజి
మధుర రుచికి
ఆంధ్రీకుమారీ
సమాయుక్త పరిపూత
తుంగా పయస్సు మాధుర్యమునకు
ఖండ శర్కర
జాతి ఖర్జూర
గోక్షీరద్రాక్షాదియుత
రామ రసమునకును
అమృత నిష్యంది వల్లకీహ్లాదమునకు
రాగిణీ దివ్య సమ్మోహరాగమునకు
తేనెతేటల నవకంపు సోనలకును
సాయగును మా తెనుగు భాషామతల్లి..
ఇది పద్యమా..
తెలుగు భాషామతల్లికి
అక్షర నైవేద్యమా..
సురవరం మనసు పలికిన
మధుర వాక్కా..
ఆయన దృక్కా..
ఏది ఏమైనా తెలుగు గురించి
చెప్పారు ఎంచక్కా..!
నీకు తెలిసిన తెలుగు..
నువ్వు మాటాడే బాష..
నువ్వు చదువుకున్న బాస..
దాన్ని నీకే ఇంత అందంగా
పరిచయం చేసిన సురవరం..
తెలుగుకే వెలుగు..
గురజాడ..గిడుగు..
కందుకూరి..
ఆ కోవలో
తెలుగు భాషోద్యమ
వైతాళికుడు..
సురవరం అనే మాతృభాషా ప్రవచకుడు..!
నచ్చని పదం నైజాం..
నప్పని విధం నిరంకుశం..
సహించని విధానం
అణచివేత..
వీటికి వ్యతిరేకంగానే
సురవరం పోరాటం..
ప్రజాచైతన్యం కోసమే
ఆరాటం..
సురవరం సంపాదకీయాలు
నైజాం గుండెల్లో
పేలిన గుళ్ళు..
నిబంధనల సంకెళ్ళలో
బిగించినా ఆగేనా
భావాల పరవళ్ళు..
ఆయన రచనలు
నిజాము నాటి
ప్రజాజీవితానికి ఆనవాళ్ళు..
నాటి వాస్తవాలకు
సిసలైన నకళ్లు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286