Suryaa.co.in

Editorial

సురేఖ సరే.. రఘునందన్ సంగతేమిటి?

  • మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున

  • వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా పట్టువదలని నాగ్

  • కొండాకు లీగల్ నోటీసు పంపిన మాజీ మంత్రి కేటీఆర్

  • సమంతకు చేనేత బ్రాండ్ అంబాసిడర్‌పై ఎంపీ రఘునందన్ వ్యాఖ్యల కలకలం

  • చేనేత గురించి తెలియని సమంతకు ఆ హోదా ఇవ్వడంపై మతలబు ఉందని వ్యాఖ్య

  • అప్పుడున్న వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలంటూ కామెంట్

  • సురేఖ తరహాలోనే రఘునందన్‌రావు వ్యాఖ్యలు

  • ఇప్పుడు రఘునందన్‌పైనా నాగార్జున పరువునష్టం దావా వేస్తారా?

  • సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

( మార్తి సుబ్రహ్మణ్యం)

కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతోంది. సమంతను తన వద్దకు పంపాలంటూ కేటీఆర్ హీరో నాగార్జునను కోరాడని, లేకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తామని కేటీఆర్ బెదిరించారన్నది మంత్రి సురేఖ చేసిన మీడియా సమక్షంలో వ్యాఖ్య. ఆ ప్రకారంగా సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని, లేకపోతే మా ఇంట్లో ఉండవద్దని నాగ్-ఆయన తనయుడు.. సమంతను ఒత్తిడి చేసిన తర్వాతనే , సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నారన్నది సురేఖ చేసిన వ్యాఖ్య.

ఆ తర్వాత దానిపై దుమారం రేగడం, అందుకు స్పందించిన సురేఖ.. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నానని ప్రకటించడం జరిగిపోయింది. అయినా ఈ అంశంలో తగ్గని నాగార్జున.. మంత్రి సురేఖకు వందకోట్ల రూపాయల పరువునష్టం దావా నోటీసు పంపించారు. అందుకు స్పందించిన నాంపల్లి కోర్టు.. నాగార్జున, మరికొందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది.

ఈ ఎపిసోడ్‌పై సోషల్‌మీడియాలో ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే.. బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపి రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మార్గం పట్టించాయి. సమంతకు సంబంధించి, న్యాయవాది అయిన రఘునందన్‌రావు తెరపైకి తెచ్చిన లా పాయింట్లు.. మర్చిపోయిన బంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చినట్టయింది. అంటే ఈ అంశంలో కొండా సురేఖ మర్చిపోయిన లా పాయింటును గుర్తు చేసి, ఆమె మద్దతుదారులకు మరో అస్త్రం అందించారన్న మాట.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి అక్కినేని నాగార్జున కోడలయిన సమంతను, తెలంగాణ ప్రభుత్వం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తెలంగాణలో సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాలు చేనేతలకు ప్రసిద్ధి. అప్పట్లో తెలంగాణ చేనేతకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కోసం, నాగార్జున కోడలయిన సమంతను దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సరిగ్గా అదే పాయింటును, సురేఖ-కేటీఆర్-నాగార్జున ఎపిసోడ్‌లో మళ్లీ వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ ఎపిసోడ్‌లో ఇది, మీడియా కూడా మర్చిపోయిన అంశమే.

సురేఖపై వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి, నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో.. బీజేపీ ఎంపి ర ఘనందన్‌రావు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేనేత తెలియని, చీర తెలియని సమంతకు, కేసీఆర్ సర్కారు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ హోదా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఫలితంగా కొండాసురేఖ-నాగార్జున-కేటీఆర్ ఎపిసోడ్ సహజంగానే చర్చనీయాంశమయింది.

‘‘ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడమని కోర్టు ఎప్పుడో చెప్పింది. ఎఫ్టీఎల్ బఫర్‌జోన్‌లో మూడున్నర ఎకరాలు ఆక్రమించి, దానిని నిర్మించారని హెచ్‌ఎండీఏ 2016లోనే నివే దిక ఇచ్చింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చలేదు. అప్పుడే అక్కినేని వారి కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆమెకు చేనేత తెలవదు. చీర తెలవదు. ఆమెను తెచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారు. ఆ సంబంధాలేమిటో వాళ్లకే తెలియాలి. అప్పుడున్న వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధమేమిటో వాళ్లు చెప్పాలి. అవన్నీ చెప్పి నా నోరు పాడుచేసుకోను’ అని రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో కొత్తగా వైరల్ అవుతోంది.

ఇది ఒకరకంగా కొండా సురేఖ వ్యాఖ్యలకు, కొనసాగింపేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఈ సమయంలో, వివాదానికి కేంద్రబిందువుగా మారిన సమంతను.. కేసీఆర్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందని, రఘునందన్‌రావు గుర్తుచేయడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. సో.. కేటీఆర్‌నుద్దేశించి సురేఖ చేసిన వ్యాఖ్యలు, సమంతను కేసీఆర్ సర్కారు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారన్న రఘునందన్‌రావు చేసిన తాజా వ్యాఖ్యలు జోడించి, సోషల్‌మీడియాలో కొత్త కథనాలకు కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హీరో నాగార్జున మరి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుపైనా పరువునష్టం దావా వేస్తారా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఒకరకంగా రఘునందన్‌రావు వ్యాఖ్యలు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలంటే తీవ్రంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఎలాగూ మంత్రిగా ఉన్న సురేఖపైనే పరువునష్టం దావా వేసిన నాగార్జున, ఎంపి అయిన రఘునందన్‌రావుపై దావా వేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.

అయితే వృత్తిరీత్యా బాగా ప్రాక్టీసు ఉన్న న్యాయవాది.. పైగా బీజేపీ ఎంపీ కూడా అయిన రఘునందన్ రావుతో పెట్టుకుంటే కష్టమైనందున, బహుశా ఆయనతో నాగార్జున లడాయి పెట్టుకోకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
https://telugu.samayam.com/telangana/hyderabad/medak-bjp-mp-raghunandan-rao-comments-on-samantha-ruth-prabhu-about-appointed-as-chenetha-brand-ambassador-in-brs-govt/articleshow/114014721.cms

LEAVE A RESPONSE