Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేలపై వేగుల నిఘా?

– అటు ఐప్యాక్, ఇటు ఇంటలిజన్స్ ఆరా
– గడప గడపకూ ప్రభుత్వం పాత్రపై పరిశీలన
– ఎమ్మెల్యేలకు ఇక నిత్యం గండమే
– అక్టోబర్ 15 నుంచి మరింత నిఘా

తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నిఘా సారించారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించినా పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేల అడుగులపై, జగన్ నిఘా మంత్రం వేశారు. అటు ప్రశాంత్‌కిశోర్, ఇటు ఇంటలిజన్స్ ఇద్దరూ ఎమ్మెల్యేల అడుగులపై నిఘా పెడుతున్నారు. అక్టోబర్ 15 నుంచి నిఘా మరింత తీవ్రతరం చేయనున్నారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 15వ తేదీ నుంచే ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి జాతకాల లెక్క తేల్చే పనికి రెడీ అవుతున్నారు. దీంట్లో భాగంగానే అక్టోబర్ 15 నుంచి ప్రతి ఎమ్మెల్యే వెంట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిర్వహణలోని ఐప్యాక్ ప్రతినిధిని పంపబోతున్నట్లు ప్రకటించారు. అలా ఎమ్మెల్యే/మంత్రి వెంట వెళ్లే ఐప్యాక్ ప్రతినిధి వారి పని తీరును అత్యంత సమీపం నుంచి పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తారు. అంటే ఎమ్మెల్యేలపై జగన్ లైవ్ లో నిఘా పెడుతున్నారని అర్ధం.

వైసీపీ ఎమ్మెల్యేల వెంట ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వచ్చే ఐప్యాక్ ప్రతినిధులు చేసే పని ఎలా ఉంటుందంటే రోజువారీ నివేదికలు ఇస్తారు. తాను అనుసరిస్తున్న ఎమ్మెల్యే పనితీరు నియోజకవర్గంలో ఎలా ఉంది? ప్రజల దగ్గరకు ఆ ఎమ్మెల్యే నిజంగా వెళ్తున్నారా? లేక కాకమ్మ కబుర్లు చెబుతున్నారా? ఒకవేళ గడప గడపకు వెళ్తే నియోజకవర్గం ప్రజలు ఆ ఎమ్మెల్యేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారా? లేదా? ఇలా ప్రతి విషయాన్ని ఐప్యాక్ ప్రతినిధి గమనిస్తారు. ఎలా ఆ ఎమ్మెల్యే రోజువారీ కార్యక్రమాలపై ఐప్యాక్ ప్రతినిధి ఒక నివేదిక తయారుచేసి తమ ప్రధాన కార్యాలయానికి పంపిస్తారు.

అలా ఐప్యాక్ ప్రతినిధి పంపించిన రోజువారీ నివేదికలను ప్రధాన కార్యాలయంలో విశ్లేషించి, వాటి ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరుపై వారానికి ఒకసారి నివేదిక రూపొందించి వైసీపీ చీఫ్ జగన్ కు అందజేస్తారని సమాచారం. ఇలా ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జగన్ కు ఐప్యాక్ నుంచి నివేదికలు వస్తాయి. వాటి ఆధారంగా తమ తమ నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎవరు వెనకబడుతున్నారు? ఎవరు సమర్థంగా పనిచేస్తున్నారు? లాంటి విషయాలపై జగన్ రిపోర్టులు తెప్పించుకుంటారని సమాచారం.

ఇప్పటికే జగన్ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ బాధ్యులతో నిర్వహించిన వర్క్ షాపులో పలువురి పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నేరుగా కొందరి పేర్లు వెల్లడించడం సంచలనంగా మారింది. ఇప్పడు లైవ్ లో తమ మీద నిఘా పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు వచ్చే పరిస్థితి ఉండదనే ఆందోళన ఆయా ఎమ్మెల్యేల్లో పెరిగిపోతోందంటున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలు తమకు బదులుగా తమ వారసులను బరిలో దింపుతామన్నా జగన్ ససేమిరా అన్నారని, ఈ సారి కూడా వారే పోటీ చేయాలని కరాఖండిగా చెప్పేసిన సంగతి విదితమే.

ఇప్పటి దాకా జగన్ కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ బాధ్యులపై పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు తీసుకుంటూ వచ్చారు. అయితే.. అక్టోబర్ 15 నుంచి ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేస్తానని జగన్ స్వయంగా చెప్పడంతో వచ్చేలో ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం తనమీద పడకుండా ఎమ్మెల్యేలను, మంత్రులను బలిపశువులను చేయాలని నిర్ణయించుకున్నారన్నది స్పష్టమౌతోందని ఎమ్మెల్యలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.

పార్టీ నేతల పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తానని జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం గమనార్హం. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు తన ఆదేశాలను లైట్ తీసుకుని, గడప గడపకు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్లు జగన్ దృష్టికి రావడంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కోసమే వర్క్ షాపు అంటూ సమావేశ పరిచారని అంటున్నారు.

గతంలో 75 మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని, వారు తమ తీరు మెరుగుపర్చుకోడానికి ఆరు నెలలు సమయం ఇచ్చారు. అయినా.. కొందరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో జగన్ మరో అడుగు ముందుకేసి.. ఏకంగా ఐప్యాక్ ప్రతినిధులతో లైవ్ లో నిఘా పెడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి జగన్ ఇన్ని చేసినా ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పనితీరు మెరుగుపరుచుకుంటారో?  లేక.. ఏమైతే అదే అవుతుందని తెగించి భీష్మిస్తారో?

LEAVE A RESPONSE