-శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్
అనతి కాలంలో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోబోతుందని సుమారు 11 సర్వేలు తెలిపాయని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలు వెలవెల బోతున్నాయి. ఓడిపోబోతున్నాం అన్న భయంతో వైసీపీ మళ్లీ కుట్రలు పన్నుతోంది. కుతంత్రాలు చేస్తోంది. అసత్య ప్రచారాలు చేసి మళ్లీ ఓట్లు గుంజుకోవాలని చూస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని మరోసారి పన్నాగాలు పన్ను తున్న విధానాన్ని మనమందరం చూస్తున్నాం. ముస్లింలు నిరుద్యోగం, అవిద్యతో బాధపడుతూ సతమతమవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అమలుపరచిన పథకాలు అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. వాటికి తిలోదకాలు ఇచ్చింది.
బడ్జెట్లో కేటాయించిన మైనారిటీ కార్పొరేషన్ నిధుల్ని నవరత్నాలకు దారిమళ్లించిన మోసపు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గద్దె దింపాలని ముస్లిం సమాజం కృతనిశ్చయంతో ఉంది. 4 శాతం రిజర్వేషన్ పై, లేని ఎన్నార్సీ చట్టం పై అపోహలు సృష్టిస్తున్నారు. వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు. ముస్లింలను అభద్రతా భావానికి గురిచేస్తున్నారు. ముస్లిం ఓట్లను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలను ఖండిస్తున్నాం. 4 శాతం రిజర్వేషన్ కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. 2014 నుండి 2018 మార్చి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంతో జత కట్టింది. కలిసి పనిచేసింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పటికి విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ను నూటికి నూరు శాతం అమలు చేసింది. ఈ 4 శాతం రిజర్వేషన్ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. కేసు విచారణకు వస్తే చట్టబద్దత కల్పించడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టపరంగా, రాజ్యాంగపరంగా నిష్ణాతులైన ఇద్దరు లాయర్లను పెట్టి వాదించిందన్న విషయం ముస్లిం సమాజం గుర్తుంచుకోవాలి.
కేవలం అమలు చేయటమేకాక దాన్ని చట్టబద్దత కల్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో ఉంది. ఇది కేవలం ముస్లింలలో అనుమానాలు రేకెత్తించడానికి నేడు వైసీపీ మసీదుల్లో కూడా ప్రచారం చేస్తోంది. మోసం చేస్తున్నారు. సుప్రీం కోర్టు లో నిష్ణాత లాయర్లను పెట్టి వాదించడానికి సిద్ధంగా ఉండగా వైసీపీ వాదించడానికి మీరు ఎందుకు లాయర్లను పెట్టలేదు? వైసీపీని ప్రశ్నిస్తున్నాను . ప్రభుత్వ ఉద్యోగాలకు తిలోదకాలిచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు. 4 శాతం రిజర్వేషన్ విషయంలో వైసీపీ టీడీపీపై బురద జల్లే కార్యక్రమం చేపట్టడం ఏమాత్రం సమంజసం కాదు. 25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ ఓడిపోబోతున్న విషయాన్ని 11 సర్వేలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఒక్క టీడీపీనే 144 స్థానాలకు పోటీ చేస్తోంది. 120 స్థానాలకు తక్కువ కాకుండా శాసనసభ స్థానాలు గెలుస్తాం.
మిత్రపక్షాలు కూడా సుమారుగా 20 నుండి 25 సీట్లు గెలుస్తాయి. 160 స్థానాలు గెలిచే పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలో ఉన్నాయి. టీడీపీ 4 శాతం రిజర్వేషన్ ల హామీకి కట్టుబడి ఉంటుంది. తూ.చా తప్పకుండా అమలు చేస్తాం. ఈ విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరూ అడ్డుకోలేరు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వాటిని తెలుగుదేశం పార్టీ కట్టడి చేస్తుంది. ముస్లింల దరిదాపుల్లోకి రానీయకుండా, దెబ్బతినకుండా చూస్తుంది. ముస్లిం ధార్మిక విషయాల్లో కులుగజేసుకునే వాటిని కూడా కట్టడి చేస్తుంది. వైసీపీ అసత్య ప్రచారాలకు, మోసపూరిత విధానాలకు పాల్పడి ముస్లింలను మోసం చేయడం తగదు. వైసీపీని గద్దె దించడంలో ముస్లింలు సహకరించాల్సిందిగా మాజీ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు.