– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయన తన విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వత్తాసు పలకని అధికారులపై వేధింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పై గతంలో సస్పెన్షన్ వేటు వేసి రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది. కోర్టు తీర్పు తదుపరి ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే మరోసారి సస్పెన్షన్ వేటు వేయటం దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి తనకు, తన అనుకూలురకు ఒక రూలు, ఇతరులకు మరో రూలు వర్తింప చేస్తున్నారు. అధికారులను మానసికంగా వేధిస్తూ, వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇటువంటి కక్షపూరిత చర్యలు దురదృష్టకరం. జగన్ సర్కార్ కోర్టు తీర్పులను కూడా లెక్క చేయక సీనియర్ అధికారులపై దుందుడుకు చర్యల చేపట్టడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో అభద్రతాభావం నెలకొనే పరిస్థితి దాపురించింది.
ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకాన్ని, నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతో ఉంది. తక్షణమే ఏపీ వెంకటేశ్వరరావు పై సస్పెన్షన్ను ఎత్తివేసి, ఆయనను విధుల్లో కొనసాగించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.