– తెలుగుమహిళ నేత తలశిల స్వర్ణలత
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వక్ర బుద్ది ఇకనైనా మార్చుకుని రాష్ట్రాన్ని ఇంకా పాతాళంలోకి తొక్కకుండా రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా నిర్మాణం పూర్తి చేయాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత డిమాండ్ చేశారు.
అమరావతి రాజధాని విజయోత్సవ వేడుకలు కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించారు. మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదుట టీడీపీ మహిళా నాయకులు కొబ్బరికాయలు కొట్టి స్వామి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా స్వర్ణలత మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపుతో రాజధాని నిర్మాణం చేపడితే అమరావతి ప్రాంత రైతులు 33 వేల ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారని, రాజధాని నిర్మాణం జరుగుతున్న క్రమంలో వచ్చిన ఎన్నికల్లో తాను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రజలను నమ్మబలికి అధికారం చేజిక్కిన వెంటనే మూడు రాజధానులన్నారని తెలిపారు. మూడు ప్రాంతాల్లో తనకు భూములున్న ప్రాంతాల్లో రాజధానుల పేరు చెప్పి అక్కడి తమ భూముల ధరలు పెంచుకున్నారని తెలిపారు. వైసీపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, చట్ట విరుద్ధ నిర్ణయాలు తీసుకోవటం, వాటికి కోర్టు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోకుండా మూర్ఖుపు పాలన సాగిస్తున్నరన్నారు.
అమరావతి ఉద్యమం చేపట్టిన రైతులను అవహేళన చేసి, న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమం చేపట్టిన అమరావతి ప్రాంత మహిళా రైతులను అడుగడుగునా ఆటంకాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. రాజధాని విషయంలో ఇప్పటికైనా కోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకుని సీఎం జగన్ తన వక్ర బుద్ది మార్చుకుని రాష్ట్రాన్ని మరింత పాతాళంలోకి తొక్కవద్దని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో మచిలీపట్టణం పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, నియోజకవర్గ అధ్యక్షురాలు బండే కనకదుర్గ, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.