అరాచకత్వానికి ప్రతీక..సీఎం జగనే కారణం: నిమ్మల

అమరావతి: ఏపీ అసెంబ్లీ అరాచకత్వానికి ప్రతీకగా నిలిచిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను అవహేళన చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన నిమ్మల మాట్లాడుతూ ఎంతో రాజకీయ అనుభవం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనంతటికి కారణం సీఎం జగన్ అని అన్నారు.
చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురావాలని నిన్ననే అన్నారని, ఆయనను చూడాలనిపిస్తోందని, రెచ్చగొట్టే దోరణితో మాట్లాడారని అన్నారు. శుక్రవారం సభలో వైసీపీ సభ్యులు దిగజారి మాట్లాడారని నిమ్మల అన్నారు. ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసినా చంద్రబాబు ప్రజల కోసం భరించారన్నారు. కానీ ఇవాళ చంద్రబాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారన్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే స్పీకర్ కూడా మైకులు ఇచ్చారని ఆరోపించారు.
వాళ్ల మాటలు వింటుంటే చంద్రబాబుతోపాటు మాకు కూడా కళ్లల్లో నీళ్లు వచ్చాయన్నారు. చంద్రబాబును ఇలా చూడడం ఇదే మొదటిసారని నిమ్మల అన్నారు. ఇది కౌరవ సభని.. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెడతామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.