– ఎంపీ విజయసాయి రెడ్డి
ప్రపంచంతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ విద్యార్దులను తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విధ్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలపై ఆయన స్పందించారు.
8 వ తరగతి చదివే విద్యార్థులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ట్యాబ్లు అందజేయనున్నారని అన్నారు. రూ.606.18 కోట్ల వ్యయంతో 4.72 లక్షల మంది విద్యార్థులకు, రూ.64.46 కోట్ల వ్యయంతో 50194 మంది టీచర్లకు ట్యాబ్లు అందించనున్నట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ. 36843 విలువైన ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఉచితంగా అందించనున్నారని అన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యనందించడంలో ప్రపంచ దేశాలకు అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సవాళ్లను అధిగమించడంలో విజయవంతమయ్యిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పథకం కింద కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నమోదు పెరగడంతో పాటు డ్రాప్ అవుట్ శాతం గణనీయంగా తగ్గింది. డిజిటల్ విద్యావిదానం, ఆన్ లైన్ తరగతులు, విద్యార్థులకు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయడం, ప్రసార మాధ్యమాల ద్వారా తరగతులు నిర్వహించడం ద్వారా లాక్ డౌన్ సమయంలో సైతం చదువులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమయ్యిందని అన్నారు.
విద్యార్థులకు సబ్జెక్టుల పరంగా తలెత్తిన అనుమానాలు నివృత్తి చేసేందుకు ఆన్ లైన్ లో అందుబాటులో నిపుణులు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుతో పాటు అనేక కార్యక్రమాలు రూపొందించిందని అన్నారు. ఈ మేరకు ఆయన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బోధన, అభ్యాసన పద్దతులపై గురువారం వ్యాసం రాసారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన విధానాలను వివరించారు. మార్పులకు అనుగుణంగా నూతన విధానాలు ఎలా అవసరమో వివరంగా రాశారు.
రాహుల్ జోడో యాత్ర 21వ శతాబ్దపు జోక్
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 21వ శతాబ్దపు అత్యుత్తమ జోక్ గా విజయసాయి రెడ్డి అభివర్ణించారు. భారతదేశం ఇప్పుడు సంఘటితంగా, బలీయమైన శక్తిగా ఉందని అన్నారు. 1947 లో మాత్రమే అది కూడా కేవలం రాహుల్ పార్టీ ఒప్పుకున్న కారణంగా దేశం విభజించబడిందని గుర్తుచేశారు.