– రాలుతున్న సిట్టింగు వికెట్లు
– టికెట్లు ఇస్తామన్నా వద్దంటున్న వైచిత్రి
– గతంలో వారికి తాడేపల్లి పిలుపే మహద్భాగ్యం
– ఇప్పుడు పిలిచినా రాని ధిక్కారం
– ప్యాలెస్‌లోనే సలహాదార్లను ఘెరావ్ చే స్తున్న వైనం
– వైసీపీకి దొరకని ఎంపీ అభ్యర్ధులు
– జగన్ కులసమీకరణతో నేతలకు జంజాటం
– సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మాట బేఖాతర్
– బదిలీ అయిన వారి బాధలు వేరయా
– అక్కడ సహకరించని స్థానిక నేతలు
– మంత్రి రజనీ, సురేష్, నాగార్జున, ఉషాశ్రీలకు చుక్కలు
– తాజాలతో తలపడాల్సిన దుస్థితి
– బ్రతిమిలాడుకుంటున్న సమన్వయకర్తలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిన్నటి వరకూ ఆ వీర విధేయులకు అధినేత పిలుపే అపురూపం. ఆయన దర్శనమే మహద్భాగ్యం. అసలు ఆ కొలువు నుంచి కబురే కొండంత సంబరం. దానికోసం రోజులు-వారాలు-నెలల పడిగాపులు.. పైరవీలు.. వేడికోలు. రెడ్డి గారి కోసం ఎంతలావు మంత్రులయినా బయట సోఫాల్లో వెయిట్ చేయాల్సిందే. ఆయన ఓ ఐదు నిమిషాలు మాట్లాడితే, నేరుగా అధినేతనే తమతో మాట్లాడారన్న ఫీలింగ్. ఇవన్నీ ఒకప్పటిమాట.
ఇప్పుడు సీన్ రివర్సయింది. అక్కడినుంచి ఫోన్ చేసినా ఎవరూ తీయడం లేదు. ఇంకొందరు స్విచ్చాఫ్ చేసి కూర్చున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న ధిక్కారం. టికెట్ ఇస్తామన్నా మాకేమీ వద్దని దణ్ణం పెట్టిపోతున్న దయనీయం. అసలు ఆ కొలువులోకే వెళ్లి, తాడేపల్లి రెడ్డిగార్లను నిర్భీతిగా ఘెరావ్ చేసే దుస్సాహసం. యస్.. మీరు ఊహిస్తున్నది, వందకు రెండొదల శాతం కరక్టే. ఇవన్నీ తిరుగుబాట్లతో తల్లడిల్లుతున్న తాడేపల్లి దృశ్యాలే.
వైసీపీలో విధేయత తిరుగుబాటు దిశగా పయనిస్తోంది. వందల కిలోమీటర్ల వాయువేగంతో వీస్తోంది. ఆ పెనుగాలులకు తాడేపల్లి తల్లడిల్లుతోంది. ఒకరు కాదు. ఇద్దరు కాదు. డజన్ల సంఖ్యలో తాడేపల్లికి తలాక్ చెబుతున్న తుపాను తాకిడికి, తాడేపల్లి తత్తరపడుతోంది. మొన్నటివరకూ బెదిరించిన తాడేపల్లి పెద్దారెడ్లు.. ఇప్పుడు ఫోన్లు చేసి మీరీ బుజ్జగించాల్సిన దుస్థితి. నేరుగా అలకరాయుళ్ల ఇళ్లకే వెళ్లి బ్రతిమిలాడుతున్న వైచిత్రి. అసలు తాడేపల్లిలో ఎంట్రీనే కష్టమనుకుంటే.. ఏకంగా అక్కడే పెద్దారె డ్లను ఘెరావ్ చేస్తున్న ధిక్కార దృశ్యాలు. ఈవిధంగా విధేయత కాస్తా తిరుగుబాటుగా మారుతుందని, తాడేపల్లి పెద్దారెడ్లు కలలో కూడా ఊహించి ఉండరు.
సహజంగా అధికార పార్టీలో సీటు కోసం పెనుగులాట ఉంటుంది. అదే అధినేతకు అక్కాచెల్లెమ్మలు.. అవ్వాతాతలు.. బీసీ-ఎస్టీ-మైనారిటీల దన్ను ఉంటే, ఆ పెనుగులాట తీవ్రంగా ఉంటుంది. పోటీలు-పైరవీలుంటాయి. కానీ వైసీపీలో ఇప్పుడు రొటీన్‌కు భిన్నమైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. సీటు ఇస్తామన్నా వద్దనే వైచిత్రి. వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్‌ఫర్లు చేస్తామంటే, మాకక్కర్లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్న ధిక్కార స్వరాలు.
అటు చూస్తే చంద్రబాబు-పవన్ ద్వయ జనప్రభంజనం. ఇటు చూస్తే సొంత పార్టీలలోనే అసంతృప్తి స్వరాలు. ఫలితంగా.. అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీ-ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు, గోడదూకి జంపయిపోతున్న ఉనికి పోరాట దృశ్యాలు. వైసీపీపై విధేయులే ఇలాంటి తిరుగుబాటుబావుటా ఎగురవేస్తారని, జగన్మోహన్‌రెడ్డి కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ జరుగుతోంది అదే.
నా మాటే శాసనం. నేను చెప్పిందే వేదం. నేను పిలిస్తేనే వచ్చి కలవాలనుకునే జగన్‌కు, సొంత పార్టీలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలుగు టీవీ సీరియళ్ల జీడిపాకం మాదిరిగా, రోజుకొకరు తాడేపల్లికి తలాక్ చెబుతుంటే.. తాడేపల్లి తల్లడిల్లుతున్న పరిస్థితి. మంత్రి జయరాం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతం లోకి వెళ్లారు. మాజీ మంత్రి సిద్దారాఘవరావును మార్కాపురం, ఒంగోలు, గిద్దలూరు వెళ్లమన్నా వద్దనే ధిక్కారం. మాగుంట శ్రీనివాసరెడ్డికి తప్ప, ఎవరికి ఒంగోలు ఎంపీ సీటిచ్చినా తాను పోటీ చేయనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బెదిరింపు. ఆయనకు విజయసాయి బుజ్జగింపులు.
నియోజకవర్గం మారిన మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు, సహకరించేది లేదని అక్కడి సిట్టింగ్ వార్నింగ్. మంత్రులు నాగార్జున, సురేష్‌ల పరిస్థితీ సేమ్ టు సేమ్. అక్కడ వారిద్దరినీ బాలినేని వచ్చి కార్యకర్తలకు పరిచయం చేస్తే తప్ప, వాళ్లెవరూ పనిచేసే దిక్కులేదు. రేపల్లెలో మోపిదేవికి సీటివ్వకపోతే పనిచేసేది లేదని, కార్యకర్తలు నిర్మొహమాటంగా ప్రకటించిన వైనం. ఇలా అన్ని చోట్లా ఇలాంటి ధిక్కార దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై సీనియర్లు, సిట్టింగులు అగ్గిరాముళ్లలవుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య తాడేపల్లికి తలాక్ చెప్పేశారు. తాజా తలాక్ జాబితాలో నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు చేరారు. నేడో రేపో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లికార్జునరావు, కమ్మ సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్సీ, ఇంకో మాజీ ఎమ్మెల్సీ కూడా, కృష్ణదేవరాయలు బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే జగన్‌కు అత్యంత ఆత్మీయుడు, ఢిల్లీలో ఆయన వ్యవహారాలు చక్కబెట్టే బందరు ఎంపి బాలశౌరి తాడేపల్లికి తలాక్ చెప్పి, జనసేన గూటికి చేరారు. కర్నూలు ఎంపి సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాధ్‌రెడ్డి.. వీరు కాకుండా నియోజకవర్గ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఒక్కొక్కరూ.. తాడేపల్లికి వరసబెట్టి తలాక్ చెబుతుండటంతో, తాడేపల్లి తల్లడిల్లుతోంది. వారిని పిలిచి మాట్లాడినా పలకనంత విషాదం నెలకొంది.
అయితే ఎవరు వెళ్లినా పార్టీకొచ్చిన నష్టమేమీ లేదని జగన్మోహన్‌రెడ్డి నుంచి… సజ్జల, సుబ్బారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వంటి పెద్దారెడ్ల ధీమా. ఎందుకంటే అక్కా చెల్లెమ్మలు-అవ్వాతాత లు-ఓటున్న మేనల్లుళ్లలో బోలెడంత ‘ఫ్యాను’ ఫాలోయింగ్.. జగనంటే మోజుక్రేజు ఉందన్న నమ్మకం. అదికాక, తన వద్దకు వచ్చే నేతలకు.. జగన్ చెప్పే 58 శాతం ఓటు బ్యాంకు, 86 శాతం మంది నా బీసీ-ఎస్సీ-మైనారిటీల దన్ను ఉందన్న చెవిరెడ్డి సర్వే భరోసా. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి అంచనా వారిది! అయినా సరే.. తలాక్‌లతో తాడేపల్లి తల్లడిల్లుతోంది మరి!