అయోధ్య రాముడి పేరు ఇక ‘బాలక్ రామ్’

అత్యద్భుతంగా రాములోరి విగ్రహం

అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఉత్తర్ప్రదేశ్ అయోధ్య ధామ్లో ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తిని ఇక నుంచి ‘బాలక్ రామ్’గా పిలవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు నిర్ణయించినట్లు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు.

వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ ఇప్పటివరకు 50-60 ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలలో భాగమయ్యారు. అయితే, అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమమే తన దృష్టిలో దైవికమైనది, ఉత్తమమైనదని చెప్పుకొచ్చారు. విగ్రహాన్ని తొలిసారి జనవరి 18న వీక్షించినట్లు చెప్పారు. అప్పుడు కళ్ల నుంచి ఆనందబాష్పాలు వచ్చాయని తెలిపారు. ఆ అనుభవాన్ని వర్ణించడం సాధ్యం కాదని భావోద్వేగానికి గురయ్యారు.

వివిధ రంగాలకు చెందిన దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో సోమవారం అంగరంగ వైభవంగా రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అప్పటివరకు చిన్న టెంట్లో, ఆ తర్వాత తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి ప్రాణప్రతిష్ఠ వేడుకతో శాశ్వత ఆశ్రయం లభించినట్లైంది. ఇదివరకు పూజలు అందుకున్న పాత విగ్రహాన్ని కొత్త ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన పెద్ద విగ్రహం ముందు ఏర్పాటు చేశారు.

రామాలయంలోని కొత్త విగ్రహం మంత్రముగ్ధులను చేసేలా ఉంది. ప్రాణప్రతిష్ఠ రోజున పసుపు రంగు ధోతి; శంఖ, చక్ర, పద్మాలతో, బంగారు జరీతో నేసిన ఎర్రటి అంగవస్త్రంతో బాల రాముడు దర్శనమిచ్చాడు. దిల్లీకి చెందిన టెక్స్టైల్ డిజైనర్ మనీశ్ త్రిపాఠి ఈ వస్త్రాలను రూపొందించారు. లఖ్నవూకు చెందిన హర్సహాయ్మాల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ రాముడు ధరించిన ఆభరణాలను రూపొందించింది.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఆరు నెలల పాటు అకుంఠిత దీక్షతో విగ్రహాన్ని మలిచారు. తాను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు యోగిరాజ్. ‘రాముడు నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడని ఎప్పటి నుంచో భావించే వాడిని. రాముడే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు. విగ్రహాన్ని చెక్కేందుకు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది’ అని చెప్పుకొచ్చారు.

వ్యవసాయ భూమిలో దొరికిన రాయి మైసూరు, హెచ్డీ కోటె తాలుకాలోని గుజ్జెగౌడనపురలో ఈ కృష్ణ శిల లభ్యమైంది. రామ్దాస్ అనే స్థానిక కాంట్రాక్టర్(78) వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ రాయి బయటపడింది. రాయి నాణ్యతను పరిశీలించి అయోధ్య ఆలయం ట్రస్టీలకు సమాచారం ఇచ్చారు రామ్దాస్.

Leave a Reply