ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి ఈసీ అనుమతించింది. అలాగే ఇంటింటి ప్రచారంలో ఇప్పటివరకు 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది. ఇక భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ, ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధాన అధికారులతో సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరా తీసింది. అనంతరం ఎన్నికల ప్రచారానికి పలు మినహాయింపులను ఇచ్చింది. ఇండోర్ లో జరిగే సమావేశాలకు 500మందికి అనుమతిచ్చింది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో ప్రచారానికి వినియోగిస్తున్న వీడియో వ్యాన్లకు అనుమతిచ్చింది.
అయితే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.