Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కుట్రలో కళంకిత అధికారులూ భాగమయ్యారు

-ధనంజయ రెడ్డికి పార్టీ కార్యక్రమాల్లో ఏం పని.?
-చనిపోయిన వారికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలి
-ఈ హత్యలకు సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత
-ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ఎందుకివ్వడం లేదు?
-పెన్షన్ డబ్బులు అకౌంట్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పి ప్రాణాలు తీస్తారా.?
-మీ రాజకీయం కోసం మండుటెండల్లో వృద్ధుల ప్రాణాలు పణంగా పెడతారా.?
-ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
-33 మంది వృద్ధుల మరణాలకు సీఎం జగన్ దే బాధ్యత.. వారి ఉసురు ఊరికే పోదు
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

గూడూరు/కోడుమూరు : ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.26 లక్షల సచివాలయం సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నారని…వీళ్లందరితో పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45 మందికి మాత్రమే పెన్షన్ ఒక్కరోజులో ఇవ్వొచ్చన్నారు. కర్నూలు జిల్లా, గూడూరులో సోమవారం క్యాంప్ సైట్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘‘సీఎంగా జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతలను విస్మరించారు. జవాబుదారీ తనంతో ఉండాల్సిన సీఎం శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి..కానీ స్వార్థ ప్రయోజనాల ఇవ్వడం కుదరదని చెప్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పింది…కానీ వితండ వాదంతో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని రాజకీయం చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి డబ్బుల్లేక…3వ తేదీన పెన్షన్ ఇవ్వాలని మార్చి 28న సర్క్యలేషన్ విడుదల చేశారు. మార్చి 29న వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

డబ్బు విడుదల చేయకపోయినా పెన్షన్లు వాలంటీర్లతో పంపిణీ చేయనివ్వలేదు అని వృద్ధులను పదేపదే సచివాలయాల చుట్టూ తిప్పించారు. కావాలనే వృద్ధులను వైసీపీ నేతలు ఎండల్లో తిప్పించారు. ఈ రకంగా కుట్రలు, కుతంత్రాలు చేసి 33 మందిని బలితీసుకున్నారు…ఈ హత్యల వివరాలు కూడా వాళ్లే చెప్పారు. ఈ 33 మరణాలు ప్రభుత్వ హత్యలే…వారి ఉసురు ఊరికే పోదు. ఇంటి వద్దే పెన్షన్ అందించాలని సీఎస్ ను కోరితే పట్టించుకోలేదు.

జగన్ చేసే కుట్రలో అధికారులూ భాగమయ్యారు
జగన్ చేసే కుట్రలు, కుతంత్రాలను ఆయన మోచేతి నీళ్లు తాగే అధికారులు అమలు చేస్తున్నారు. 33 మంది మరణాల్లో అధికారులు కూడా భాగమయ్యారు. నెల క్రితం నాటి కుట్రలకు ఇప్పుడు మళ్లీ తెరలేపారు. ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ కింద పని చేయాలి. పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎస్, గవర్నర్, ఎన్నికల కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేశాం. గత ఘటనలు పునరావృతం కాకుండా పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది.

సచివాలయాల్లో ఇవ్వకుండా నేరుగా ఇంటి వద్దే ఇవ్వొచ్చు. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా…ఇవ్వడం కుదరదు…ఇళ్లు తెలీవు అని మొండికేస్తున్నారు. మొన్నటి దాకా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలు లేవు అని…ఇప్పుడు బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని చెప్తున్నారు. అప్పుడు లేని అకౌంట్లు…ఇప్పుడు ఎలా వచ్చాయి.? ఆధార్ లింక్ ఉన్న లబ్ధిదారులకు అకౌంట్లో…మిగతా వారికి ఇంటి వద్ద ఇస్తామన్నారు. 65,49,000 వేల మంది లబ్ధిదారుల్లో 45.92 లక్షల మంది అకౌంట్లు దొరియాయన్నారు. మిగిలిన వారికి ఇంటికి వెళ్లి ఇస్తామన్నారు…మరి వీళ్ల ఇంటి సమాచారం ఎలా దొరికింది.?

రాత్రికిరాత్రి కనుక్కొన్నారా.? 25 లక్షల మంది అనారోగ్యంతో ఉన్నారు…బ్యాంకుల వద్దకు రాలేరు అందుకే నేరుగా ఇస్తామని చెప్తున్నారు…అంతమంది అనారోగ్యంతో ఉన్నారని మీకు ఎలా తెలిసింది…ఎప్పుడు తెలుసుకున్నారు. 25 శాతం మందికి అకౌంట్లు లేవు అన్నారు…వీరికి అకౌంట్లు లేవు అన్న సంగతి మీకు ఎలా తెలుసు.? బోగస్ రిపోర్టులతో కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పని చేయాలి.

మీ రాజకీయం కోసం మండుటెండల్లో వృద్ధుల ప్రాణాలు పణంగా పెడతారా.?
వృద్ధులకు అకౌంట్లో వేస్తే డబ్బులు పడ్డాయని వారికి ఎలా తెలుస్తుంది…ఎవరు చెప్తారు..వారి వద్ద సెల్ ఫోన్లు ఉంటాయా.? మొన్న సచివాలయాల చుట్టూ తిప్పారు…ఇప్పుడు అకౌంట్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పుతారా.? బ్యాంకుకు వెళ్లాలంటే కనీసం 5 కి.మీ వెళ్లి తెచ్చుకోవాలి…బ్యాంకు సిబ్బంది లేకుంటే పడిగాపులు కాయాలి. 46 డిగ్రీల ఎండలు కాస్తున్నాయి…మంచినీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో పండుటాకులను మండుటెండల్లో బ్యాంకుల చుట్టు తిప్పడం సమంజసమా.?

స్లిప్పులు ఇచ్చేందుకు 41,230 మంది బీఎల్వోలుగా పని చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి బీఎల్వోలను వినియోగించుకుంటే… ఎన్నికల నాటికి స్లిప్పులు ఇవ్వడం కూడా సులభతరం అవుతుంది. 13వ తేదీ జరిగే ఎన్నికలకు 1వ తేదీ నుండే స్లిప్పులు ఇస్తారా.? జీతాల రూపంలో ప్రజల డబ్బులు తినే అధికారులు ఒక వ్యక్తి, పార్టీ ప్రయోజనం కోసం పనిచేయడం కూడదు. టెయింటెడ్ అధికారులు ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం.

ఇంత అసమర్థతతో ఉన్న మీరు ప్రశాంతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు.? ఓటర్లకు ఏం రక్షణ కల్పిస్తారు? పెన్షన్ల విషయంలో ఎవ్వరికి ఏది జరిగినా….చనిపోయినా ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది. పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చేయడం చేతకాకపోతే విధుల నుండి తప్పుకుంటే చేతనైన వాళ్లు పంపిణీ చేస్తారు. సీఎస్ కార్యాలయం ముందు ప్రతిపక్షాలు ఎప్పుడైనా ధర్నాలు చేసిన పరిస్థితి ఉందా.? ఎన్నిసార్లు డిమాండ్ చేయించుకుంటారు?

వృద్ధుల మరణాలకు జగనే బాధ్యత వహించాలి
పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శశిభూషన్ బాధ్యత వహించాలి. అధికార యంత్రాంగం కూడా కోడ్ తర్వాత సీఎం కింద పని చేయడానికి వీల్లేదు. మొన్న జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన రోజు కూడా ఓ అంశంలో కరెక్టేనా ధనుంజయ్ అని అడిగారు. ధనంజయ్ రెడ్డికి పార్టీ కార్యక్రమాల్లోఏం పని.? ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చాక సీఎస్, కలెక్టర్ సీఎం ఆదేశాలను పరిగణలోకి తీసుకోకూడదు…అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే.

గత నెల ఎంతమందికి పెన్షన్ ఇచ్చారో చెప్పకుండా… ఎంతమంది చనిపోయారో క్లారిటీగా చెప్పారు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వండని మేము అడిగాం…ఎన్నికల కమిషన్ అదే చెప్పింది. కుదరదు అని సీఎస్ ఎలా చెప్తాడు.? క్షేత్రస్థాయిలో ఊర్లో ఉండే వ్యక్తే…ఊర్లో వారికి పెన్షన్ ఇవ్వొచ్చు. తెల్లవారుజామున పోటీ పడి పెన్షన్ ఇచ్చామని చెప్పిన మీరు ఇప్పుడెందుకు ఇవ్వరు.? పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరిగి చనిపోయిన వారికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ హత్యల కిందే కేసు నమోదు చేయాలి.

ఈ హత్యలకు సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. డబ్బులు విడుదల చేయకుండా పెన్షన్ కోసం సచివాలయాల చుట్టూ తిప్పించడం వల్లే చనిపోయారు. చంపడానికి సచివాలయాల వద్దకు వాళ్లు తీసుకొస్తే..కాపాడటానికి మేము నీళ్లు, భోజనం, మజ్జిగ అందించాం. వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ అందిస్తాం. కానీ జగన్ మాత్రం పెంచిన రూ.500 కూడా 2025కు రూ.250, 2029కి రూ.250 పెంచుతానని చెప్పాడు. 2029 ఏప్రిల్ లో పెంచితే కేవలం 3 నెలలు మాత్రమే పెంచిన పెన్షన్ అమలు చేస్తామని జగన్ చెప్పాడు. పెన్షన్ డబ్బును బ్యాంక్ అకౌంట్లో వేస్తే…బకాయి ఉంటే అవి కోత పడే అవకాశం ఉంది.’’ అని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE