Suryaa.co.in

Editorial

తాజ్‌మహల్‌కు తాళం?

– కోట్ల రూపాయల బకాయిలు కక్కాలంటున్న యోగీ సర్కార్
– వాటర్, ప్రాపర్టీ, సర్వీసు టాక్స్ కట్టాల్సిందేనట
– 15 రోజుల గడువిచ్చిన యుపీ సర్కార్, కంటోన్మెంట్ బోర్డు
– పురావస్తు శాఖకు యోగీ సర్కారు నోటీసు
– కట్టకపోతే తాజ్‌మహల్‌కు తాళం తప్పదా?
– షాజహాన్ స్మృతికి యోగీ సర్కార్ షాక్
( మార్తి సుబ్రహ్మణ్యం)

షాజహాన్ తన ప్రేయసి కోసం ముచ్చటపడి నిర్మించుకున్న పేరు గొప్ప తాజ్‌మహల్‌కు ఇప్పుడు పెద్ద గత్తరొచ్చిపడింది. ఏళ్ల తరబడి ఆస్తి, నీరు, సర్వీసు పన్ను చెల్లించనందున, వాటిని 15 రోజుల్లో చెల్లించాలంటూ యుపీ సర్కారు తాఖీదు ఇచ్చింది. ఎవరినీ వదలని యోగీ సర్కారు.. చివరాఖరకు షాజహాను ముచ్చటపడి కట్టించిన, తాజ్‌మహల్‌ను కూడా విడిచిపెట్టకపోవడమే ఇక్కడ విశేషం.

సహజంగా ఎవరైనా ఆస్తిపన్ను, నీటి పన్ను కట్టకపోతే మునిసిపల్ అధికారులేం చేస్తారు? ‘ఒరేయ్ అబ్బాయ్.. నీకింత పన్ను బకాయి ఉంది. కాబట్టి ఫలానా తేదీలోగా కట్టేయ్ నాన్నా’ అని ముందు నోటీసులిస్తారు. అప్పటికీ సదరు ఆసామి కట్టలేదనుకోండి. ఇంకో నోటీసు ఇస్తారు. అప్పటికీ ఆ ఆసామి మొండికేశారనుకోండి. ‘నీ పద్ధతేమీ బాగోలేదురా అబ్బాయ్. నీకు రెండుసార్లు చెప్పినా కట్టలేదు. కాబట్టి ఫలానా రోజు వరకూ నీకు చివరాఖరి చాన్సు ఇస్తున్నాం. అప్పటికీ కట్టలేద ంటే నీ ఇంటికి తాళమేస్తాం. నీ సామాన్లు బయటకేసి, వేలం వేస్తాం’ అని మర్యాదగా చెబుతారు. ఇది అందరికీ తెలిసిన యవ్వారమే. కానీ వాటిలో పాలకులు, లక్షాతొంభై మొహమాటాలతో కొందరికి మినహాయింపులిచ్చేస్తుంటారు.

image-1కానీ ‘బుల్డోజర్ బాబా’ యోగి ఆదిత్యనాథ్‌ది, రొటీన్‌కు భిన్నమైన వ్యవహారం కదా? అందుకే ప్రపంచంలో అపురూపకట్టడమైన, ఆగ్రా లోని తాజ్‌మహల్ బకాయిలపై దృష్టి పెట్టారు. సదరు తాజ్‌మహల్ మంచిచెడ్డలు చూసే పురావస్తుశాఖ.. 2021-21, 2022-23 సంవత్సరానికి గాను 2 కోట్ల రూపాయల నీటి పన్ను, 1.5 లక్షల ఆస్తిపన్ను, 5 కోట్ల సర్వీసు టాక్స్‌ను తమకు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు జమిలిగా తాఖీదులు జారీ చేయడంతో, తాజ్‌మహల్‌కు గత్తరొచ్చిపడింది.

దీనితో పురావస్తు అధికారులు అగ్గిరాముళ్లయ్యారట. ‘నాన్సెన్స్.. మేమిమిటి? టాక్సులు కట్టడమేమిటి? అసలు ఓల్డెస్ట్ అది కూడా హిస్టారికల్ బిల్డింగులకు టాక్సులు పే చేయడం మా ఇంటా వంటా ఉందా? సో.. మేం కట్టేదిలేదుపొమ్మని’ పురావస్తు సార్లు జవాబిచ్చారట.

పురావస్తు శాఖ అధికారుల ఆన్సరు చదివిన కంటోన్మెంట్-ఆగ్రా కార్పొరేషన్ అధికారులు, అంతే నింపాదిగా.. తిరుగుటపాలో ఇంకో నోటీసు పంపించారట. ‘మీరు చెప్పింది కరెస్టే. కాకపోతే ఈ టైపు నోటీసులను కార్పొరేషన్‌లో చాలామందికి పంపించాం. అర్హత కలిగిన భవనాలకు మినహాయింపు ఉంటుంద’ని చావు కబురు చల్లగా చెప్పారట. అంతేగానీ.. ఆ అర్హత గల భవనాల్లో తాజ్‌మహల్ ఉందని గానీ, మీరేమీ టాక్సులు కట్టనక్కర్లేదని చెప్పలేదు.

సో.. తాజ్‌మహల్‌కు వచ్చిన గత్తర తొలగిపోలేదన్నమాట. మిగిలిన సీఎంలయితే.. మైనారిటీలతో మనకెందుకొచ్చిన పంచాయితీ అని, గమ్మునుంటారు. తాజ్‌మహల్ అంటే మైనారిటీల సొత్తు కాబట్టి, దానితో మనకెందుకు నెత్తినొప్పని పట్టించుకునేవారు కాదు.
కానీ యుపీలో ‘బుల్డోజర్ బాబా’ యోగిసాబ్‌తో యవ్వారం కదా? అందుకే కొంచెం ఆయనతో యవ్వారం డిఫరెంటుగానే ఉంటుంది మరి! అందుకే వాటిని షాజహాను కట్టించినా, నూర్జహాను కట్టించినా.. రూల్ రూలేనంటున్నారు. యోగి స్పీడు చూస్తే.. పన్ను కట్టకపోతే, తాజ్‌మహల్‌కు తాళం వేసినా ఆశ్చర్యం లేదేమో? అట్లుంటది యోగి తోని!

LEAVE A RESPONSE