మా భూములను పల్లా తన కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు
మా భూములు తనఖా పెట్టి 4 కోట్ల రుణం తీసుకున్నారు
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదు
ఇక మాకు సీఎం కేసీఆరే దిక్కు
రోడ్డెక్కిన పల్లా బాధితులు
-ముఖ్యమంత్రికి బాధితుల విజ్ఞప్తి
పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న పల్ల తనయుడు అనురాగ్ పై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం శ్రీ సాయిబాబా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు, జంపని శివయ్య, సయ్యద్ బడే సాబ్, కే. నరసింహ, శ్రీనివాస్, చిరంజీవి తమ గోడును మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. బీబీనగర్ మండలం నెమరు గోముల గ్రామం లోని సర్వేనెంబర్లు 154,155, 157లలోని 16 ఎకరాల భూమిని ఆనాటి జీపీఏ హోల్డర్ మహమ్మద్ కాజా పాషా లేఅవుట్ చేసి విక్రయించారని తెలిపారు.
200 గజాల చొప్పున తాము కొనుగోలు చేసిన తమ స్థలాలు పలువురు చేతులు మారిన అనంతరం, అధికార బలంతో రాజేశ్వర్ రెడ్డి తన తనయుడి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సదరు స్థలాన్ని తనకా పెట్టి సుమారు నాలుగు కోట్ల రూపాయల ను రుణంగా పొందినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు.
ఇలా పేదల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకున్న వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.