– కో ఆర్డినేషన్ కమిటీ, క్యాంపైన్ కమిటీ ప్రకటన
– వర్కింగ్ గ్రూపుల పేరిట మూడు కమిటీల ఏర్పాటు
– సిపిఎం, సిపిఐ సహా కాంగ్రెస్ మిత్రపక్షాలకు చోటు
– మరి ఇండియాకు కన్వీనర్ ఎవరు?
– కన్వీనర్ లేకుండానే జాబితా విడుదలపై విస్మయం
– గతంలో అన్ని కూటములకు న్వీనర్లు
– రాహుల్ ప్రధానిగా ఒప్పుకోని మమత, కేజ్రీ?
– రాహుల్‌ను ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించని ఆ ఇద్దరు
– ‘ఇండియా’ కన్వీనరే ప్రధాని అభ్యర్ధి అన్న భావన
– అందుకే కన్వీనర్ ప్రకటన ఆగిందా?
– ఎవరివారే కన్వీనర్లు పెట్టుకుంటే సరి
– సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పైలెట్ లేకుండా విమానం నడుస్తుందా? డ్రైవర్ లేకుండానే బస్సు వెళుతుందా? రౌతు లేకుండానే గుర్రం పరిగెడుతుందా? అసంభవం. కానీ కొత్తగా కాంగ్రెస్ పుట్టించిన ‘ఇండియా’ కూటమి బండిమాత్రం.. సారథి లేకుండానే పరిగెత్తానంటోంది. ఈ విచిత్రం విన్నారా? అయితే వినండి.
వెనకటి కి ఒక ఆసామి, ఆర్టీసీ బస్సెక్కి మా ఊరికి టికెటిట్టవ్వమన్నాడట. బీజేపీపై సమరశంఖం పూరించి, ఆ పార్టీని గద్దె దించేందుకు కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ‘ఇండియా’ కూటమి.. కన్వీనర్ లేకుండానే ఏర్పాటయింది. వివిధ కమిటీలను ప్రకటించిన ఇండియా కూటమి.. చివరాఖరకు కన్వీనర్ ఎవర న్న ప్రశ్నను, ప్రజలకే వదిలేయడంపై విస్మయం, విసుర్లు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు-తమిళ దిగ్దర్శకుడు కె.బాలచందర్ సినిమాలలో సహజంగా ముగింపు ఉండదు. దానిని ప్రేక్షకులకే వ దిలేస్తుంటారు. బహుశా ఇండియా కూటమి పెద్దలపై బాలచందర్ ప్రభావం పడి ఉంటుంది.
ఈ పెద్దతలకాయలంతా బాలచందర్ సినిమాలు బాగా చూసి ఉంటారన్నది ఇప్పుడు సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు. లేకపోతే.. యుద్ధానికి వెళ్లే సైన్యం సైన్యాధ్యక్షుడు లేకుండానే యుద్ధం చేసినట్టుందని, ఇండియా కూటమిపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
బీజేపీని గిట్టించడానికి కాంగ్రెస్ పుట్టించిన ‘ఇండియా’ కూటమి కన్వీనర్ లేకుండానే ఏర్పాటుకావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముంబయిలో భేటీ అయిన ఇండియా కూటమి తన రెండో అడుగుతో కార్యాచరణ ప్రారంభించింది. ఆ మేరకు కొన్ని కమిటీలు ఏర్పాటుచేసి, దానిని మీడియాకు విడుదల చేసింది.
అందులో ఎన్నికల సమన్వయ- వ్యూహ కమిటీ, క్యాంపెయినింగ్ కమిటీ, సోషల్‌మీడియా వర్కింగ్ గ్రూప్, మీడియా వర్కింగ్ గ్రూప్, రీసెర్చి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుచేసింది.
ప్రధానమైన ఎన్నికల సమన్వయ- వ్యూహ కమిటీలో కాంగ్రెస్-వామపక్షాలతోపాటు, ఎన్‌సీపీ, డీఎంకె, జెఎంఎం, శివసేన, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, ఎస్పీ, జెడియు, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి పార్టీలకు చెందిన 14మంది ప్రతినిధులను నియమించారు.
ఇక క్యాంపెయినింగ్ కమిటీగ్రూప్‌లో 19 మంది, సోషల్‌మీడియా వర్కింగ్ గ్రూప్‌లో 12 మంది, మీడియా వర్కింగ్ గ్రూప్‌లో 19 మంది, రీసెర్చి వర్కింగ్‌లో 11మందిని నియమిస్తూ ప్రకటన వెలువడింది.
అంతా బాగానే ఉన్నప్పటికీ, అసలు ఈ కమిటీకి ఎవరు సారథ్యం వహిస్తారు? సారథి ఎవరన్నదని మాత్రం ఇండియా కూటమి స్పష్టం చేయలేదు. దీన్నిబట్టి కన్వీనర్ పదవిపై ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం లేనట్లు అర్ధమవుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్-టీఎంసీ-ఆప్-జెడియు మధ్య విబేధాలున్నట్లు స్పష్టమవుతోందని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే.. ఇండియా కూటమికి ఎవరైతే కన్వీనర్‌గా ఉంటారో, వారే ప్రధాని అభ్యర్ధి అవుతారన్నది సుస్పష్టం. అయితే ప్రధాని పదవిపై మొదటి నుంచి మోజు పడుతున్న.. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, జెడియు అధినేత నితీష్‌కుమార్ కాంగ్రెస్‌కు ప్రధాని పదవి ఇచ్చేందుకు మొదటి నుంచీ సిద్ధంగా లేరు. వారు కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్ధించేందుకు సిద్ధంగా లేరు. ఆ మేరకు వారు చాలాసార్లు ఆ అంశంపై, స్పష్టమైన ప్రకటనలు చేయడాన్ని విస్మరించకూడదు.
అసలు ఆప్ అధినేత కేజ్రీవాల్ అనేక షరుతులు, ప్రతిపాదనల తర్వాతనే, ఇండియా కూటమిలో చేరారు. తాను ప్రధాని పదవి తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నానని, నితీష్‌కుమార్ కూడా ప్రకటించారు. దీన్నిబట్టి.. ఇండియా కూటమికి కన్వనర్ ఎంపిక, భావి ప్రధాని అభ్యర్ధి ప్రకటనతో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది.
అసలు నాయకుడు లేకుండా ఇప్పటివరకూ, ఏ కూటమి ఆవిర్భవించిన దాఖలాలు భారత రాజకీయ చరిత్రలో కనిపించదు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యుపిఏ కూటములకు కన్వీనర్లు ఉన్నారు. కానీ కొత్తగా ఆవిర్భవించిన ఇండియా కూటమికి మాత్రం, కన్వీనర్ లేకపోవడమే వింత.
అయితే.. దీనిపై సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమన్వయ- వ్యూహ కమిటీ, క్యాంపెయినింగ్ కమిటీ, సోషల్‌మీడియా వర్కింగ్ గ్రూప్, మీడియా వర్కింగ్ గ్రూప్, రీసెర్చి వర్కింగ్ గ్రూప్ మాదిరిగానే… న్వీనర్ గ్రూప్ ఒకటి ఏర్పాటుచేసుకుని, ఎవరికివారు కన్వీనర్లుగా ప్రకటించుకుంటే సరిపోతుందంటూ, వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.