– సీఎంకు బహుజన జేఏసీ బాలకోటయ్య లేఖ
1986లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వై.యస్. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన ప్రభుత్వ నిర్ణయం సహేతుకం కాదని, క్షమార్హం కాదని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు రాష్ట్రంతోనూ, తెలుగు ప్రజలతోనూ, తెలుగు ఆత్మగౌరవంతోనూ అనుబంధమై ఉన్న బంధం అని తెలిపారు. ఆయన చరిత్ర అసమానమైనదని, అపురూపమైనదని చెప్పారు. ఎన్టీఆర్ చరిత్రను చదివిన తర్వాతే తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పలకా, బలపం పడతారని అభివర్ణించారు.ఆయన పేరు తీసేసినంత మాత్రాన మీకు కలిగే ప్రయోజనం శూన్యమని చెప్పారు. సూర్యుని మీద ఉమ్మేసినట్లు, సూర్యుని ఎదుట కూర్చుని దివిటీలు వెలిగించినట్లు మీరు తీసుకున్న ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం ప్రభుత్వ సంకుచిత, అల్ప బుద్ధికి నిదర్శనంగా ఉందని చెప్పారు.
ఇప్పటికే దాదాపు 43 పథకాలకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారని, మరో 40 పథకాలకు తమ పేరు కూడా పెట్టుకున్నారని గుర్తు చేశారు.తెలుగుదేశం మీద కోపంతోను, చంద్రబాబు మీద కక్షతోను ఎన్టీఆర్ పేరు తొలగించటం 10 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న 26 మంది మంత్రులు, వైకాపాకు చెందిన 150 మంది ఎమ్మెల్యేలు,43 మంది ప్రభుత్వ సలహాదారులు అందరూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా సీఎంపై వత్తిడి తేవాలని, పొరపాటును సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు.
ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తాం, పూర్వ ముఖ్యమంత్రుల పేర్లు మారుస్తాం అనే విధానం ప్రజాస్వామ్యానికి చెల్లుబాటు కాదని, రాబోవు కొత్త ప్రభుత్వాలు కూడా నీవు నేర్పిన విద్య యే నీరజాక్షి అంటూ ఇదే తీరుగా వ్యవహరిస్తాయని బాలకోటయ్య హెచ్చరించారు.