– మాజీ మంత్రి హరీశ్ రావును భోజన కార్మికుల విజ్ఞప్తి
వరంగల్: ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తోందని వరంగల్లోని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గోడు విని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు మాజీ మంత్రి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆవేదన ఆందోళన చెందవద్దని, డిమాండ్లు నెరవేరే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంతు సర్కారు కర్కషంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి, ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుంది.
ఉన్నఫలంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏండ్లుగా పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏం కావాలి? ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి? ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.