Suryaa.co.in

Telangana

గణేష్ ఉత్సవ సమితి నేతలతో తలసాని భేటీ

ప్రజలు తమ పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం చూపిన చొరవతోనే గణేష్ నిమజ్జనం కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రభుత్వానికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాఘవ రెడ్డి, భగవంతరావు లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారి పండుగలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల బోనాల ఉత్సవాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. శోభాయాత్ర, నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

LEAVE A RESPONSE