Suryaa.co.in

Editorial

తారక రాముడి ‘జగన్బాధ’!

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘తా దూర సందులేదుగాని మెడకో డోలు’.. బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్, తాజాగా జగన్ ఓటమిపై చేసిన వ్యాఖ్య విన్నవారికి ఈ వ్యాఖ్య గుర్తుకురాక మానదు. తన గడీలో చేపల పులుసు-రాగి సంకటి నాటు కోడి పులుసు తిన్న ఖాసు దోస్తు, జగన్‌రెడ్డి ఓటమి కేటీఆర్‌కు ఆశ్చర్యం కలిగించిందట. అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడో తారక తమ్ముడికి ఇప్పటికీ అర్ధం కావడం లేదట. 40 శాతం మంది ఓటర్లు, జగనన్నకు ఓట్లు వేయడం మామూలు విషయం కాదట. పవన్ విడిగా పోటీ చేస్తే కథ వేరే లెక్కట. షర్మిలను పావుగా వాడుకున్నారట. ప్రతిరోజూ జనంలో ఉండే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యంగా ఉందట. ఎన్నో మంచిపనులు చేసిన జగన్ ఓడిపోవడమేమిటి చెప్మా అని తారకరాముడు తన్లాడుతున్నరు.

ఇంతకూ ఇవన్నీ చెప్పింది ఎక్కడంటే.. ఢిల్లీల. అక్కడికెందుకు వెళ్లారంటే..బతుకమ్మను ప్రమోట్ చేసిన తెలంగాణ చెల్లి కవితమ్మను, తీహార్ బందిఖానాలో చూసేందుకు! ‘నువ్వు లేకుండానే బతుకమ్మ నిర్వహిస్తరంట. ఏం ఫికర్ చేయకు. బే ఫికరుగుండు. బయటకొస్తవులె. నాయన చూసుకుంటుండులె. వచ్చినంక భారీ ఎత్తున మనమే బతుకమ్మ చేద్దంలె’ అని చెల్లెమ్మకు ధైర్ణం చెప్పి వచ్చిన తారకరామన్న.. మీడియా ముచ్చటిలో ఆంధ్రా పాలిటిక్స్ గురించి మాట్లాడిండు. అదీ అసలు పాయింటు.

అందులో తార కరాముడి తలపులనిండా జగన్నాధుడుడే ఉన్నట్లు తేలింది. అక్కడ అధికార వియోగం అనుభవిస్తున్న జగనన్ననేమో, పులివెందులలో ఎంచక్కా చక్కర్లు కొడుతున్నారు. నెల్లూరు జైలుకెళ్లి ఈవీఎంను నేలకేసికొట్టిన స్వాతంత్య్ర సమరయోధుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చారు. భార్య భారతమ్మ కూడా భర్త ఓటమి లెక్కతో పనిలేకుండా, తన వ్యాపారాల లెక్కలు తాను చూసుకుంటున్నారు.

కానీ తన ఉప్పు తిన్న జగనన్న ఓటమినే తారకరాముడు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఎలాగూ ఓడిపోయాం. కనీసం ఆంధ్రాలో తనకు దేవుడిచ్చిన బ్రదర్ గెలిచి ఉంటే, క థను అటుంచి నరుక్కువద్దామన్నది ‘కారు’ ఓనర్ల కల. అందుకే జగనన్న ఎందుకు ఓడిపోయారో ఇప్పటికీ అర్ధం కానంతగా, ఆయన అంతర్మథనం రగిలిపోతోందని తారకరాముడి మాటలే చెబుతున్నారు. మరి ‘డాడీ చెప్పులో కాలు పెట్టి పాలిస్తే’ అంతకుమించిన ఫలితాలు, ఎలా వస్తాయన్న దిశగా తారకరాముడు ఆలోచించి ఉంటే, జగనన్న ఓటమికి కారణాలు తెలిసేవి. పోనీ ఆంధ్రాలో తన వ్యాపార మిత్రులకు ఫోన్ చేసి అడిగినా వాళ్లే చె ప్పేవారు.

ప్రజలు..ప్రజాప్రతినిధులను కలవకుండా.. మంత్రులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా.. సహచరులతో సంప్రదించకుండా..మీడియాతో మాట్లాడకుండా, గడీలలో కూర్చుని సొంత నిర్ణయాలు తీసుకుంటే, కేసీఆర్ కే కాదు.. ఆయన పాలనను జిరాక్సు తీసుకుని పరిపాలించిన జగన్‌కూ భంగపాటు తప్పదని, అమెరికాలో చదివొచ్చిన తారకరాముడు తెలుసుకోకపోవడమే హాశ్చర్యం.

తానొక దొరనని, తన బాధ ప్రపంచం బాధగా.. తాను నవ్వితే ప్రపంచం నవ్వాలి. తానేడిస్తే ప్రపంచం ఏడవాలన్న ‘దొర’హంకార పోకడలు పుట్టిముంచుతాయన్న గుణపాఠం.. తెలంగాణకే కాదు, ఆంధ్రాకూ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రజలను కట్టు బానిసల లెక్క.. పథకాలు విసిరేస్తే పడి ఉంటారన్న నియంత ఎత్తులు, ప్రజాగ్రహానికి చిత్తవుతాయని రాకుమారుడు ఇంకా తెలుసుకోకపోవడమే వింత..

ప్రజలకు మంచి చేసినా ఓడించారనడమంటే, ప్రజల నిర్ణయాన్ని తప్పు పట్టడమే లెక్క. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమికి, తమ వైఫల్యాలే కారణమన్న కేటీఆర్ నిజాయితీ వ్యాఖ్యలు మెచ్చదగ్గవే. కానీ బ్రదర్ జగన్ మాత్రం.. తప్పును ఈవీఎంలపై నెట్టేస్తున్న వైచిత్రి. ఇక్కడ కేటీఆర్.. బ్రదర్ జగన్ ఓటమిపై ఆశ్చర్యపోతుంటే, అక్కడ మంత్రులు- ఎమ్మెల్యేలుగా చేసిన వారేమో.. జగన్‌ను ఎవరూ కలవకుండా ఒక ధనంజయరెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి శిఖండుల మాదిరి అడ్డుకున్నారని, ఓపెన్‌గా చెబుతున్నారు. తాము సంక్షేమాన్ని ఇచ్చామే తప్ప, అభివృద్ధి చేయలేదని వారే ఒప్పుకుంటున్న పరిస్థితి.

అంటే.. సేమ్ టు సేమ్ ఇక్కడ తెలంగాణలో డాడీ పదేళ్లు ఎలా పాలించారో, అక్కడ బ్రదర్ జగన్‌రెడ్డి కూడా అదే దొరతనం ప్రదర్శించారని అర్ధం చేసుకోవాలి కదా?! తెలంగాణలో డాడీ కూడా ఆయనకు ఎవరైనా కలపడితే తప్ప, ఎవరినీ కలవరు. సరే.. ఇప్పుడంటే ఎమ్మెల్సీలు-ఎమ్మెల్సీలు జారిపోతుంటే విధి లేక పిలిచి ముచ్చట్లాడుతున్నారు. లేకపోతే వారికి ఏపీలో సజ్జల, ధనంజయరెడ్డి ఎలా దిక్కో,.. ఇక్కడ ఒక కేటీఆర్, ఒక సంతోషే దిక్కయ్యేవాళ్లు. అది వేరే కథ.

మీడియా విషయంలో తెలంగాణ జాతిపిత, బ్రదర్ జగన్‌రెడ్డి కంటే కొంత మేలు. కనీసం తనకు తోచినప్పుడయినా మీడియాతో భేటీ అవుతారు. అఫ్‌కోర్స్.. త నకు నచ్చని ప్రశ్నలు వేస్తే గయ్యిమంటారనుకోండి. అది వేరే విషయ. కానీ ఆంధ్రాలో తన బ్రదర్ జగన్‌రెడ్డి, కనీసం మీడియా మొఖం కూడా చూడరు. ఆయన మాట్లాడితే వారికి అదే మహద్భాగ్యం. లీకులూ గట్రాలూ.. సేమ్ టు సేమ్ బీఆర్‌ఎస్ స్కూలే. టీచర్లు వేరయినా అదే సిలబసు. ఇన్ని మాటలేల?.. ఆంధ్రాలో బ్రదర్ జగన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయారో .. ఓసారి ఓ కూకట్‌పల్లికో, ఏ మియాపూర్‌కో, లేకపోతే ఏ అమీర్‌పేటకో వె ళ్లి ఓ చెవి పడేస్తే.. తారకరాముడికి వీజీగా అర్ధమవుతుంది.

 

LEAVE A RESPONSE