Suryaa.co.in

Editorial

అడ్డం తిరిగిన ‘తారక’ తంత్రం!

– హైదరాబాద్‌లో ‘ఏపీ ర్యాలీలు’ వద్దన్న కేటీఆర్‌
– విజయవాడ, రాజమండ్రి లో చేసుకోమని సలహా
– శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందన్న వాదన
– కేటీఆర్‌ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో ఆగ్రహం
– మీరు విదేశాలకు వెళ్లినప్పుడు చేసిన స్వాగత ర్యాలీల సంగతేమిటి?
– స్టాలిన్‌, సిద్దిరామయ్య, కేజ్రీవాల్‌కు లేని అభ్యంతరం మీకేమిటి?
– అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఆఫ్రికా, దుబాయ్‌ ప్రధానులు ర్యాలీలు అడ్డుకోలేదే?
– హైదరాబాద్‌ ఇంకా ఉమ్మడి రాజధానేనని వ్యాఖ్యలు
– ఢిల్లీ, యుపి ఘటనలకు ఇక్కడెందుకు నిరసనలని ప్రశ్న
– పంజాబ్‌ రైతులకు తెలంగాణ ప్రజల డబ్బెందుకు ఇచ్చారు?
– కవిత విచారణ రోజు ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నా చేశారని ఫైర్‌
-ఏపీలో బీఆర్‌ఎస్‌ బ్రాంచి ఎలా తెరిచారంటూ ప్రశ్నల వర్షం
– ఎన్నికల ముందు మంత్రులు ఏపీకి వెళ్లి ఎందుకు మీటింగు పెట్టారని లాపాయింట్లు
– మరి ఎల్బీనగర్‌ టీడీపీ ర్యాలీలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై చర్యలు తీసుకోరా?
– ఎన్టీఆర్‌ఘాట్‌ వద్ద దీక్ష చేసిన మోత్కుపల్లిని సస్పెండ్‌ చేస్తారా?
– బాబు అరెస్టును ఖండించిన బీఆర్‌ఎస్‌ నేతలను ఏం చేస్తారు?
– రేపు కవితను అరెస్టు చేసినా ఇదే మాటకు కట్టుబడి ఉంటారా అన్న బహుజన ఐకాస
– ‘బాబు అరెస్టు నిరసన’లపై కేటీఆర్‌కు సోషల్‌మీడియాలో ప్రశ్నల పరంపర
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ మాజీ సీఎం-టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసన పర్వంపై సరికొత్త చర్చకు తెరలేచింది. తెలంగాణ మున్సిపల్‌ శాఖామంత్రి-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలే దానికి కారణం. హైదరాబాద్‌తోపాటు, తెలంగాణ ప్రాంతాల్లో ఐటి నిపుణులు- టీడీపీ కార్యకర్తలు- ఎన్టీఆర్‌ అభిమానులు చేస్తున్న ఆందోళనా కార్యక్రమాలను, కేటీఆర్‌ తప్పుపట్టారు. ఏపీ రాజకీయాలు తెలంగాణలో ఎందుకని ప్రశ్నించి, కొత్త చర్చకు తెరలేపారు. ఇదికూడా చదవండి: ఇక్కడ ర్యాలీలెందుకు? ఏపీలో చేస్కోండి

ఏపీవాళ్లు విజయవాడ-వైజాగ్‌-రాజమండ్రి-కర్నూలుకు వెళ్లి భూమిబద్దలయ్యేలా ర్యాలీలు చేసుకోవాలని కేటీఆర్‌ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. హైదరాబాద్‌లో అలాంటివాటిని తమ ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తే అంశాలపై, తాము కఠినంగానే ఉంటామన్నారు. ప్రధానంగా ఐటి సెక్టార్‌ దెబ్బతినే కార్యక్రమాలను తాము అనుమతించమని విస్పష్టంగా పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వంలో ఉన్నందున, పాలకులు శాంతిభద్రతలు సవ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు టీడీపీ ర్యాలీలకు అనుమతిస్తే, రేపు వైసీపీ ర్యాలీలనూ అనుమతించాలన్నది కేటీఆర్‌ భావనగా కనిపిస్తోంది. అసలు సమస్య తెలంగాణది కానప్పుడు.. తెలంగాణ భూగోళంలో జరగనప్పుడు ఇక్కడెందుకు పంచాయతీ అన్నది కేటీఆర్‌ కవి హృదయంగా అర్ధం చేసుకోవచ్చు. ఏపీలోని రెండు పార్టీల సమస్యను హైదరాబాద్‌ మీద రుద్దడం ఎందుకన్న కేటీఆర్‌ ప్రశ్న అసమంజసం ఏమీ కాదు. కాబట్టి కేటీఆర్‌ వాదనను కొట్టివేయలేం.

కాకపోతే.. ఈ అంశంలో కేటీఆర్‌కు, ప్రభుత్వాన్ని నడిపే మంత్రిగా ఎలాగైతే కొన్ని స్థిర అభిప్రాయాలున్నాయో.. మిగిలిన వారికీ మరికొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉండటం సహజం. ఇప్పుడు అటు సోషల్‌మీడియాలోగానీ. ఇటు హైదరాబాద్‌లోని టీడీపీ-ఎన్టీఆర్‌ అభిమానులు గానీ అలాంటి అభిప్రాయాలనే సొషల్‌మీడియా వేదిక, పత్రికాప్రకటనల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇచ్చిన జవాబులు, లాజికల్‌గా ఉండటంతో సహజంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అటు నెటిజన్లు-ఇటు ఎన్టీఆర్‌ అభిమానులు-టీడీపీ శ్రేణులు.. బీఆర్‌ఎస్‌ గతంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు లింకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఇదేమి రాజ్యం?.. పోలీసు భోజ్యం?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కవితను ఈడీ విచారించిన సమయంలో హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలు నేతలు వందల సంఖ్యలో ఢిల్లీకి వెళ్లారు. కవిత విచారణను నిరసిస్తూ ఢిల్లీతోపాటు, హైదరాబాద్‌లోనూ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మలు తగులపెట్టారు. మోదీకి వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు కూడా వేశారు. ఈ అంశాన్ని ప్రస్తావించిన నెటిజన్లు.. కేటీఆర్‌ వాదన ప్రకారమైతే బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఢిల్లీలో ఎందుకు ఆందోళన నిర్వహించారు? మరి హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ చేసిన ఆందోళన వల్ల లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతినదా? అని లా పాయింట్లు తీస్తున్నారు.

ఇక హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని కాబట్టి, పదేళ్ల వరకూ హైదరాబాద్‌పై తమకూ హక్కు ఉంటుందని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. పైగా బీఆర్‌ఎస్‌ కంటే ముందే టీడీపీ జాతీయ పార్టీ కాబట్టి, ఒక జాతీయ పార్టీగా ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కు ఉందని, టీడీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు.

ఏపీలో బీఆర్‌ఎస్‌ పెట్టి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే లేనిది, హైదరాబాద్‌లో పుట్టిన టీడీపీని ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దనడం సమంజసమా? అని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర-ఏపీలో బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు చేసుకోవచ్చు. టీడీపీ హైదరాబాద్‌లో చేసుకోకూడదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘స్టాలిన్‌-సిద్దిరామయ్య-కేజ్రీవాల్‌కు లేని అభ్యంతరాలు కేటీఆర్‌కు ఎందుకు’ అని కామెంట్లు పెట్టడం చర్చనీయాంశమయింది.

ఏపీ రాజకీయాలకు తెలంగాణలో ఏం సంబంధమన్న కేటీఆర్‌ ప్రశ్నలకు నెటిజన్లు ఘాటు జవాబులివ్వడం ఆసక్తికలిగిస్తోంది. ‘ మరి ఆ లెక్కన మీకు ఏపీ-మహారాష్ట్ర-ఏపీ రాజకీయాలతో ఏం పని? అక్కడ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఏపీలో విశాఖ స్టీలు కోసం, మహారాష్ర్టలో రైతుల కోసం ఎందుకు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు? మరి అక్కడ అవి లా అండ్‌ ఆర్డర్‌కు సమస్య కలిగించవా?

గత ఎన్నికల్లో మీ మంత్రులను ఏపీకి పంపించి, కులసమావేశాలు ఎందుకు పెట్టించారు? తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్‌ రైతులకు ఎలా ఇచ్చారు? ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, కర్నాటక, మహారాష్ర్టా, జార్ఖండ్‌కు వెళ్లి అక్కడ మోదీ వ్యతిరేక సమావేశాలు ఎలా పెడుతున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మీరు విదేశాలకు వెళుతున్నప్పుడు అక్కడున్న తెలుగువాళ్లు మీకు స్వాగత ర్యాలీలు ఎలా చేస్తున్నారు? అందుకు ఆ దేశ ప్రభుత్వాలు అంగీ రిస్తున్నాయి కదా? అని గుర్తు చేస్తున్నారు.

అయినా టీడీపీ నిరనన కార్యక్రమాలను అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఆఫ్రికా, స్విడ్జర్‌లాండ్‌, నెదర్లాండ్స్‌ ప్రధానులే అడ్డుకోలేదు. మరి పదేళ్ల ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ర్యాలీలు చేస్తే, మీరెందుకు అడ్డుకుంటున్నారు? ర్యాలీలన్నీ ప్రశాంతంగానే జరుగుతున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడం ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయినా.. ఒకవైపు మాది జాతీయ పార్టీ అని ప్రకటించుకుని, ఇంకా ఒక రాష్ట్రం గురించే మాట్లాడటం వింతగా ఉందని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ‘ ఒక జాతీయ పార్టీగా మీకు ఎలాగైతే ఇతర రాష్ర్టాల్లో రాజకీయాలు చేసే హక్కు ఎంత ఉందో, మిగిలిన వారికీ తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు అంతే ఉంటుందని గ్రహించండి’ అని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయినా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వలేదని, ఐటి ప్రొఫెషనల్స్‌, ఎన్టీఆర్‌ అభిమానులే వారంతట వారు ర్యాలీలు, ధర్నాలు, చలో రాజమండ్రి పేరిట తరలివస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న ర్యాలీలకు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు కూడా హాజరవుతున్న విషయాన్ని కేటీఆర్‌కు గుర్తుచేస్తున్నారు.

బాబు అరెస్టుకు నిరసనగా ఎల్బీనగర్‌లో టీడీపీ నిర్వంహించిన ర్యాలీలో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలతోపాటు, స్పీకర్‌ పోచారం కూడా బాబు అరెస్టును ఖండించారు. మంత్రి అజయ్‌ కూడా ఖండించారు. చివరకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్శింహులు, ఏకంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద దీక్ష నిర్వహించారు. మరి వారందరిపైనా చర్యలు తీసుకుంటారా? అని మరికొందరు ప్రశాస్ర్తాలు సంధిస్తున్నారు.

ఇదిలాఉండగా కేటీఆర్‌ వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ‘మద్యం కేసులో చెల్లెలు కవిత అరెస్టయ్యాక కూడా కేటీఆర్‌ ఇలాంటి ప్రకటనలకు కట్టుబడి ఉంటారా’ అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

LEAVE A RESPONSE