-ఫిరాయింపులు-విలీనం వేర్వేరా?
-సారు ఫిరాయింపులు ప్రోత్సహించ లేదట
-విలీనం మాత్రమే చేసుకున్నారట
-ఫిరాయింపుల తర్వాతనే కదా విలీనం నాయకా?
-అనైతిక రాజకీయాలపై తారకరత్నం ఆవేదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
నది ఆవలి ఒడ్డున కాళ్లకు బంగారు కంకణంతో ఉన్న ఒక ముసలిపులి, నది అవతల ఉన్న పేద బ్రాహ్మణుడితో.. ‘విప్రోత్తమా? నేను నడవలేను. యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో జంతువులు వేటాడి చంపా. ఇప్పుడు వేటాడేశక్తి నశించింది. వృద్ధాప్యం వచ్చింది. నువ్వు కష్టాల్లో ఉన్న పేదవాడిలా ఉన్నావు. ఇలా వచ్చి నా బంగారు కంకణం తీసుకుని నీ పేదరికాన్ని తొలగించుకో. నాకు నది దాటే శక్తి లేదు. లేకపోతే నేనే వచ్చి ఇచ్చేదాన్ని’ అని కరుణరసాత్మకంగా.. కొంగర జగ్గయ్య, గుండెపోటు గుమ్మడి, కత్తియుద్ధం కాంతారావు, చిత్తూరు నాగయ్య, రక్తకన్నీరు నాగభూషణం లె వల్లో నవరసాలూ పండించింది. దానితో ముసలిపులి మాటలు నిజమే కామోసనుకుని, నది దాటి పులి వద్దకు వెళ్లిన పేద బ్రాహ్మణుడిపై పులి పంజా విసిరి, ఆరోజు బ్రేక్‌ఫాస్టు కమ్ లంచ్ కానిచ్చేసింది.
ఇది చిన్నప్పుడెప్పుడో చదివిన పులి-పేద బ్రాహ్మణుడి కథ.
ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కల్వకంట్ల తారకరామారావు మీడియాతో పిచ్చాపాటీగా చేసిన వ్యాఖ్యలు చూస్తే, పులి-బ్రాహ్మణుడి కథ గుర్తుకురాక తప్పదు. దేశంలో డెమోక్రసీ ఢమాల్మందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ రోజుకు పదహారుసార్లు మటన్‌కత్తితో హత్యచేస్తోందని వాపోవడం వింతన్నర. పదేళ్లు తెలంగాణను కంటిచూపుతో శాసించి, సకల వైభోగాలు అనుభవించిన యువరాజు.. నేటి ‘ప్రజాస్వామ్యపాతకం’ గురించి వేదనతో వాదించడం వింతన్నరేకదా? కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? తప్పదు భరించాలి.
‘నవ్వుతూ అనడం-ఏడుస్తూ బాధపడటం ఎందుకన్న’ది మన చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాట. బహుశా వేల పుస్తకాలు చదివిన పెద్దసారు, మహాజ్ఞాని అయిన చిన్నసారుకు ఈ విషయం చెప్పి ఉండకపోవచ్చు. ఇలాంటి అనుభవేక సత్యాలు, అమెరికన్లకు తెలియదు కాబట్టి.. అక్కడ చిన్నసారుకు ఎవరూ చెప్పే చాన్సు ఉండదు. లీవిట్!
తాజాగా ఫిరాయింపులు-పార్టీ విలీనంపై తారరాముడి తర్కం-ఇచ్చిన భాష్యం వింటే.. రాజ్యాంగం రాసిన అంబేద్కరు కూడా నోరెళ్లబెట్టి తీరాల్సిందే. తాము ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, శాసనసభలో పార్టీలను ‘మాత్రమే’ విలీనం చేయించామన్నది తారకరాముడు సెలవిచ్చిన ఫిరాయింపు సూత్రం. ‘మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించలేదు. కాకపోతే పార్టీలను విలీనం చేయించా’మన్నది ఫిరాయింపులపై తారకరాముడి నయా సూత్రీరణ.
మీ నాన్న.. మీ అయ్య.. నీ బాబు..నీ అమ్మ మొగుడు అని రకరకాలుగా పిలిచినప్పటికీ, దాని అర్ధం తండ్రి అనే కదా?! తారకరాముడి ఫిరాయింపు తత్వం కూడా ఇలాగే ఉందన్నది, తెలుగుభాషా పండితుల ఉవాచ. ముందు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తర్వాతనే కదా.. ఆ సంఖ్యాబలంతో సరిపడే ఎమ్మెల్యేలు, తమకు టికెట్లు ఇచ్చిన పార్టీని శాసనసభలో మరోపార్టీలో విలీనం చేసేది?
తారకరాముడి పదేళ్ల పాలనలో కాంగ్రెస్-టీడీపీ శాసనసభాపక్షాలను, ఆ లెక్కనే విలీనం చేసిన విషయం మర్చిపోతే ఎలా? సరే వయోభారం.. పైగా వేల పుస్తకాలు చదివిన పెద్దసారుకు జ్ఞాపకశక్తి లేదనుకుంటే అనుకోవచ్చు. పదేళ్లు పార్టీని తెరవెనుక ఉండి నడిపించిన చిన్న సారుకు, అప్పుడే మతిమరుపు వస్తే ఎలా? ఎవరి జ్ఞాపకశక్తి ఎంతున్నా, ప్రజల జ్ఞాపశక్తిని ఏమార్చలేరన్నది మేధావుల ఉవాచ.
అసలు రాజీనామా చేయకుండానే, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చిన ప్రజాస్వామ్యపార్టీ.. దానం నాగేందర్ అనే ఫిరాయింపుదారుడికి, రాజీనామా చేయకుండానే ఎంపీ సీటు ఎలా ఇచ్చారన్న తారకరాముడి ప్రశ్న..‘నవ్విపోదురుగాక..’ అన్నట్లుంది. నవ్వుతూ అనడం ఏడుస్తూ అనుభవించం అంటే ఇదే మరి.
ఇప్పుడు తన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు, నిర్దయగా కళ్లెదుటే కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతుంటే, పెద్ద-చిన్న సార్ల గుండెతరుక్కుపోవడం సహజాతిసహజం! ఇది సానుభూతి-ఓదార్పు యాత్రకు అర్హమైనదేమీ కాదు. తమ డబ్బులతో గెలిచి-అధికారం అండతో అడ్డగోలుగా సంపాదించిన తన ప్రతినిధులు, ఆవిధంగా కర్కశంగా-నిర్మొహమాటంగా- నిర్దయగా-కనీస కృతజ్ఞత లేకుండా అధికారపార్టీలోకి జంపయిపోవడం, గుండెల్లో ముల్లు గుచ్చుకోవడం లాంటిదే. అందుకే తారకరాముడి అంతరంగం అగ్నిగుండం లెక్క భగ్గుమంది. అది ఆయన వరకూ రైటే కావచ్చు.
నిజమే.. మరి తారకరత్నం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బావ-బావమర్దులు దగ్గరుండి ప్రోత్సహించిన ఫిరాయింపులకు.. అప్పటి పార్టీ అధినేతల హృదయాలు, పీర్ల పండగ మాదిరి ఇంకెంత అగ్నిగుండమవ్వాలి? ఏకంగా తమ పార్టీ శాసనసభాపక్షానే విలీనం చేయిస్తే, వారు ఎంత గోస అనుభవించి ఉండాలి? గోస అందరికీ గోసనే కదా? రాంగోపాల్‌వర్మ సినిమాలో ‘శవం తమ్ముడిదయినా కంపు కామనే’ అన్నా అన్నట్లు..బాధ ఎవరికయినా బాధనేకదా?
అయినా ఎవరు ఎంతమంది పార్టీ వీడినా నష్టమేమీలేదని పెద్దసారు, ఆరడుగుల బుల్లెట్ హరీష్ చెబుతున్నప్పుడు.. ఆరు నెలల్లోనే రేవంత్ సర్కారుపై తెలంగాణ ప్రజలకు మోజు తీరి, సారు మళ్లీ సీఎం ఎప్పుడవుతారా అని కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నప్పుడు.. ఇక ఫిరాయింపులపై తారకరాముడి తన్లాట ఎందుకు? బీఆర్‌ఎస్ విలీనమైతే ఆగమెందుకు? ఓ వైపు బావ హరీషేమో ఎమ్మెల్యేలు పార్టీ మారినా బే ఫికర్ అంటుంటే, బావమరిది రామ్ మాత్రం అప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడితే.. పింకీలు ఎవరి మాటలు నమ్మాలి?
అయినా.. పెద్దసారు చెప్పినట్లు అభివృద్ధి-నవ తెలంగాణ పునర్మిర్మాణం గురించే, టీడీపీ-కాగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే సూత్రం ప్రకారమే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. రెండింటి మధ్య పెద్ద ఫరక్ ఏంది? అయినా ఇప్పుడు పార్టీ మారిన-మారుతున్న ఎమ్మెల్యేలంతా, ‘పుట్టు గుడ్డి’ మాదిరిగా.. ‘పుట్టు కారు పార్టీ’వాళ్లు కదా? సగం మంది కాంగ్రెస్-సగం మంది టీడీపీ వాళ్లే కదా? దానికి గాయి పెట్టడం ఎందుకు? లెక్క రాబర్ అయింది కదా? ఎట్లొచ్చారో గట్లనే వెళ్లిన్రరన్నది తర్కం తెలిసిన పండితుల ఉవాచ.
ఇక ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే.. ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ ఎత్తేశామని, మళ్లీ తామే దానిని కొనసాగించామన్న ‘రామన్న’ మాటలు చిత్రాతిచిత్రం. నిజానికి నాటి యువరాజు సర్కారు ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే, కోర్టు ఆదేశాల ప్రకారమే తిరిగి కొనసాగించారే తప్ప, ప్రజాస్వామ్యంపై ప్రేమతో సారు సర్కారు పెటలేదని, తారకరాముడికి మర్చిపోవడమే వింత. ఇంకో గమ్మతేమింటే.. ప్రజల గొంతును నిషేధించేందుకు ఏ ధర్నాచౌక్‌ను అయితే సారు వాడు ఎత్తేశారో.. సరిగ్గా అక్కడే తారకరాముడి పార్టీ, టెంట్లు వేసుకుని మరీ తనివితీరా గొంతెత్తడం మరో విషాదం.