-ప్రియాంకా గాంధీ
న్యూ ఢిల్లీ : దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్ సుంకం కొంతమేర తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గించారు. ఈ తగ్గింపుతో ప్రధాని మోదీ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారని భాజపా నేతలు చెబుతుంటే ఉప ఎన్నికల్లో భంగపడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కూడా సుంకం తగ్గింపుపై ట్విటర్ వేదికగా స్పందించారు.
‘ప్రభుత్వం.. భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా కాదు. పండగకు ముందు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సింది పోయి నిత్యవసర ధరలను భారీగా పెంచింది. ఎన్నికల ముందు కంటితుడుపుగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన దోపిడిని తిరిగి రాబట్టాలంటే.. వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలి’’అని ప్రియాంకా ట్వీటర్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘2021లో లీటర్ పెట్రోల్ ధర రూ.28, డీజిల్ ధర రూ.26 పెరిగింది. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో 14 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో భాజపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5, రూ.10 తగ్గించి.. ఇది మోదీ దీపావళి కానుకగా ప్రచారం చేసుకుంటోంది’’అని ట్వీట్ చేశారు.