Suryaa.co.in

Andhra Pradesh

మున్సిపోల్స్’లో టీడీపీ పోటీ

– వ్యూహకమిటీ నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికను బహిష్కరించిన టీడీపీ.. త్వరలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. పోటీలో ఉన్న అభ్యర్ధులను గెలిపించుకునే వ్యూహంపై తాజాగా చర్చించారు. ఆ మేరకు సోమవారం జరిగిన పార్టీ వ్యూహకమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించారు. .
వ్యూహకమిటీ తీర్మానాల ప్రకారం.. 13 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూడ్ విడుదలైంది. వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు బెదరకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుంది. ధరల పెరుగుదల మరియు పన్నుల పెరుగుదల భారం తగ్గుతుంది. ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు శ్రేణులు, ఇప్పటి నుండే రంగంలోకి దిగాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
న్యాయస్థానం నుండి దేవస్థానానికి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్ట సంపూర్ణ మద్దతిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి నిధులు సమకూర్చే, యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే కేంద్రం ప్రజారాజధాని అమరావతి. రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి అయిన అమరావతిని జగన్ రెడ్డి నిరుపయోగం చేశారు. ఈ ఆస్తినే సద్వినియోగం చేసుకుని ఉంటే 13 జిల్లాలకు నిధుల కొరత ఉండేది కాదు. ప్రజలపై భారాలేస్తూ.. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్తితి కల్పించారు. సమంజసమైన కోర్కెలతో, రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. పాదయాత్ర కొనసాగే మార్గంలోని గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు రైతులతో చేతులు కలపాలి. ఇప్పటికైనా జగన్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలు మార్చుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి.
నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పక్కన పెట్టి.. అచీవ్ మెంట్ అవార్డుల పేరుతో హడావుడి చేస్తూ కుసంస్కారాన్ని జగన్ రెడ్డి బయటపెట్టుకున్నాడు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కనీసం గుర్తు చేసుకోకపోవడం దుర్మార్గమని నేతలు అభిప్రాయపడ్డారు. పొట్ట శ్రీరాములు త్యాగంతోనే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం జరిగిందని సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
డ్రగ్స్, గంజాయి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎదురుదాడి చేసినా.. చివరికి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పిన అబద్దాలు బట్టబయలయ్యాయి. గంజాయి ఉందని ఆరోజు చెప్పిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారు, దాడులు చేశారు, నోటీసులిచ్చారు. 3 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సాగు జరుగుతోందని, ఈ స్థాయిలో గంజాయి రాష్ట్రంలో ఎన్నడూ పట్టుబడిన దాఖాల్లేవని బీబీసీ (అంతర్జాతీయ స్థాయి వార్తా సంస్థ) పేర్కొంది. మద్యనిషేధం అంటూ అధికారంలోకి వచ్చి నాసిరకం, సొంత మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దుతూ ప్రాణాలు తీస్తున్నారు. మహిళల పుస్తెలు కాపాడుతానని ప్రకటించి.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. హెరాయిన్ పై చర్యలు తీసుకుంటామంటూ కంటితుడుపు చర్యలకు పాల్పడుతున్నారు. వైసీపీ డ్రగ్స్ మాఫియాపై పోరాడాలి. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం.
విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆరోజు ఎంతో మంది ఆస్తులు, భూములు దానం చేసి ఎయిడెడ్ స్కూల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ రోజు జగన్ రెడ్డి ఆ ఎయిడెడ్ స్కూళ్ల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం బడిలో ఉండాల్సిన విద్యార్ధుల్ని బజారుకీడ్చారు. ఎయిడెడ్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అధికారంలోకి వస్తే.. ఎప్పటిలాగానే ఎయిడెడ్ స్కూల్స్ కొనసాగిస్తాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూ.. ఢిల్లీలో ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ.. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైనపుడే డిమాండ్ చేసింది. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదు. పంట చేతికొచ్చినా కొనుగోలుకు ప్రభుత్వం, మిల్లర్లు ముందుకు రాకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులు ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. మరోవైపు రైతుల పేరుతో కొంత మంది మిల్లర్లు మాఫియాగా ఏర్పడి రైతుల్ని ముంచేస్తున్నారు. దొంగ బ్యాంకు గ్యారంటీల పేరుతో జరుగుతున్న మోసంపై విచారణ జరిపించాలి. ఈ కుంభకోణంలో భాగస్వామి అయిన మంత్రిపై విచారణ జరిపించాలి.
రాష్ట్రంలో రూ.4వేల కోట్ల విలువైన బియ్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దానిపై విచారణ జరిపించి అసలు దోషులపై చర్యలు తీసుకోవాలి. వెంటనే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. బకాయిలు బెంటనే చెల్లించాలి.
రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం నిలవడం రైతు దగా ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోంది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగపోతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. గతంలో ధరలు అందుబాటులో ఉంటేనే ననా యాగీ చేసిన వైసీపీ.. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రజలు మోయలేకపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించకుంటే ప్రజలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల హామీ మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ప్రభుత్వ సంస్థల్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అధిక ధరలకు కొనుగోలు చేయరాదు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్, సెస్ తగ్గించి.. దక్షిణాధి రాష్ట్రాల స్థాయికి తీసుకొచ్చే వరకు పోరాడుతామని నిర్ణయించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ కు సార్వభౌమాధికారాలు. అలాంటి వ్యక్తిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదుకు ఆస్కారం లేదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సార్వభౌమాధికారాలను వదులుకుంటామని, బ్యాంకులకు ఇచ్చే గ్యారంటీ అగ్రిమెంటులో గవర్నర్ పేరు చేర్చారు. గవర్నర్ అధికారాలను తొలగించడం అంటే.. రాజద్రోహమే. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నేతలు పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రస్ అల్ ఖైమాతో కలిసి చేసిన బాక్సైట్ కుంభకోణంతో.. నేడు రాష్ట్రం అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదని చెప్పడంతో రస్ అల్ ఖైమాకు బాక్సైట్ గనులు కేటాయించడం 1/70 గిరిజన చట్టానికి విరుద్ధం అవుతుంది. రస్ అల్ ఖైమా బాధ్యత జగన్ రెడ్డి సొంత వ్యవహారం. గిరిజన ప్రయోజనాలను బలిపెట్టరాదన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులెవరో కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. వారిని మొదటి ఛార్జిషీటులో చేర్చకపోవడం హత్యారాజకీయాలను నిరోధించడానికి ఎంత మాత్రమూ దోహదపడదు. సీబీఐ వెంటనే అసలు దోషుల్ని చట్టం ముందుకు తేవాలి.
దళిత మంత్రి నారాయణ స్వామి నుండి వాణిజ్య పన్నుల శాఖను తొలగించి.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కట్టబెట్టడమంటే దళిత వర్గాన్ని అవమానించడమే. వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యిలా తయారైందని దీంతో మరోసారి రుజువైంది.
ఉపాధి కూలీల వేతనాలు నెలల తరబడి పెండింగులో ఉంచారు. వాటిని వెంటనే చెల్లించాలి. నీరు-చెట్టు బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని నేతలు సమావేశంలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు .కె అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య, నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, కేఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి, టీడీ జనార్థన్, బీద రవిచంద్ర యాదవ్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE