Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఇంటిలో టీడీపీ ప్రభుత్వం చిరునవ్వులు పూయిస్తుంది

  • పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది టీడీపీ ప్రభుత్వమే
  • అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క ఇంటిలో చిరునవ్వులు పూయిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది తమ ప్రభుత్వమేనని వారు చెప్పారు.

శుక్రవారం ఉదయం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్ను ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే అన్న క్యాంటీన్లను కొనసాగించాల్సిందిగా చంద్రబాబు నాయుడు జగన్ ను బ్రతిమాలాడి చెప్పారన్నారు. పేరు మార్చుకుని అయినా పేదలకు ఉపయోగపడే ఈ క్యాంటీన్లను కొనసాగించాలని కోరారన్నారు. నిజంగా జగన్కు పేదలపై చిత్తశుద్ధి ఉంటే ఈ క్యాంటీన్లను కొనసాగించేవారన్నారు. కేవలం రోజులో పూటకు రూ.5లతో టిఫిన్, భోజనం, టిన్నర్ అంటే రోజుకు రూ.15లు, నెలకు రూ.450లు అవుతుందన్నారు. అంటే ఒక వ్యక్తి ఆకలి రూ.450లతో తీరుతుందని చెప్పారు.

పేదలకు మంచి చేసే ఇలాంటి క్యాంటీన్లను ఉంచాలని తాము జగన్ను కోరామన్నారు. చాలా మంది టీడీపీ నాయకులు అధికారంలో లేకపోయినా అన్నా క్యాంటీన్లను సొంత నిధులతో నిర్వహించారని చెప్పారు. రోజు వారి కూలీలు, ఇంట్లో వంట చేసుకోలేని వృద్ధులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతగానో సహాయ పడుతున్నాయన్నారు. రోజు వారి కూలీలు రోజుకు రూ.15లతో వారి ఆకలిని తీర్చుకుని మిగిలిన సంపాధనతో వారి కుటుంబ ఖర్చులు లేదా పిల్లల విద్యకు వారి సంపాదనను ఖర్చు చేసుకుంటారని అన్నారు. దీని వల్ల వారు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చునని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన నాలుగు అన్నా క్యాంటీన్లల్లో ప్రతి రోజూ ఉన్నతాధికారులు పర్యవేక్షణతో అందరికి టిఫిన్, భోజనం అందచేసేలా ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.

పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటిలో నవ్వులు పూయిస్తామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్న క్యాంటీన్లను తెరుస్తామని ఆనాడు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, కాని అధికారంలోకి వచ్చిన కేవలం అరవై రోజుల వ్యవధిలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూసివేపి పేదలను పస్తులుంచారన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 13 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా సరే ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఫించను దారుల సొమ్మును పెంచడమే కాకుండా ప్రతి నెలా వారికి వితంతు, వధ్యాప్య పించను రూ.4 వేలు ఇస్తున్నామన్నారు. వెయ్యి రూపాయాలు పెంచడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. అంతే కాకుండా ఒకటో తేది జీతాలు అందుకోవడం అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు వారికి ఒకటో తేది జీతాలు ఇవ్వలేదని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు ప్రతి నెల ఒకటో తేది ప్రతిప్రభుత్వ ఉద్యోగికి జీతాలు అందుతున్నాయని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరి ముఖంతో చిరునవ్వులు పూయించడమే చంద్రబాబునాయుడు లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, వేముపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, కొవ్వూరి కిరణ్కుమార్, వెన్నా శంకర్, మహ్మద్ హాజీ, కేశనం భావన్నారాయణ, వాసా పల్లపురాజు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE