Suryaa.co.in

Editorial

ఎన్డీఏలోకి టీడీపీ ?

– 5న ముహుర్తం?
– 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు
– అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు?
– గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒకొక్కటి?
– ఫలించని వైసీపీ మిత్రపక్ష మీడియా కథనాలు
– ‘సూర్య’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ-టీడీపీ పొత్తు పొడిచే వేళకు ముహుర్తం దాదాపు ఖరారయింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఈనెల 5న టీడీపీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. అదేరోజు బీజేపీకి ఇచ్చే స్థానాల సంఖ్యను కూడా అధికారికంగా ఖరారు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆమేరకు ఇరు పార్టీల మధ్య చర్చల ప్రక్రియ పూర్తి అయినట్లు బీజేపీ వర్గాల సమాచారం.

రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఇప్పటికే ఖరారయింది. ఆ మేరకు జనసేనకు 24 సీట్లు ఇస్తున్నట్లు, ఉమ్మడి వేదికపై ప్రకటించారు. ఇక మిగిలింది టీడీపీ-బీజేపీ పొత్తు ఒక్కటే. ఇప్పుడు అది కూడా ఖరారయింది. ఆ మేరకు బీజేపీకి 5 ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకు, బీజేపీతో ఒప్పందం కుదిరినట్లు పార్టీ వ ర్గాలు వెల్లడించాయి. ఈనెల 5న ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని ఓ సీనియర్ నేత వెల్లడించారు.

అదేరోజు టీడీపీ ఎన్డీఏలో అధికారికంగా చేరవచ్చని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఆ ప్రకారం.. అరకు, నర్సాపురం, తిరుపతి, రాజమండ్రి లేదా విజయవాడ, హిందూపురం లేదా రాజంపేట ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక విశాఖ నార్త్, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కైకలూరు, ధర్మవరంతోపాటు.. కర్నూలు, తిరుపతి, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో అసెంబ్లీ సీటు, బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ-టీడీపీ పొత్తుకు సంబంధించి, బీజేపీ సీనియర్లకు ఈపాటికే స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు సమాచారం.

దీనితో గత రెండురోజుల నుంచి ప్రధానంగా శనివారం నుంచి… వైసీపీ మిత్రపక్షాలకు చెందిన కొన్ని టీవీ చానెళ్లలో, అప్రతిహతంగా ప్రసారమవుతున్న పొత్తు వ్యతిరేక కథనాలకు తెరపడినట్లే. టీడీపీ-బీజేపీ పొత్తును బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయని కొన్ని చానెళ్లు, పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయని మరికొన్ని చానెళ్లూ.. ఉదయం నుంచి అప్రతిహత కథనాలు వండివార్చాయి.

పొత్తును ఢిల్లీ నాయకత్వం కూడా తిరస్కరించిందని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాను కలిసినా, ఆయన ఖాతరు చేయలేదని ప్రచారం చేశాయి. అందుకే బీజేపీ ఇప్పటిదాకా స్పందించలేదని, ఆమేరకు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. దీనితో కింది స్థాయిలోని ఇరుపార్టీల శ్రేణుల్లో గందరగోళం మొదలయింది.

అయితే వైసీపీకి అనుకూలంగా ఉండే ఆ చానెళ్లలో పొత్తు పుటుక్కమన్నట్లేనని కథనాలు వచ్చాయంటే, కచ్చితంగా పొత్తు కుదిరినట్లేనన్న విషయం జిల్లా-నియోజకవర్గ స్థాయి బీజేపీ నేతలకు స్పష్టమయిపోయింది.

‘ఆ చానెళ్లు బ్లూమీడియా అన్నది బహిరంగ రహస్యం.ై అవి వైసీపీకి అద్దె మైకులు. పొత్తు కుదిరితే నష్టపోయేది వైసీపీనే. అందువల్ల వీలైనంతవరకూ పొత్తు చెడగొట్టడమే వారి లక్ష్యం. అందుకే కూలి మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. వాళ్లు పొత్తు ఉండదని ప్రసారం చేయకపోతే ఆశ్చర్యం గానీ, చేస్తే ఆశ్చర్యం ఏముంది? వాళ్లకు అదో ఆనందం’’ అని గుంటూరు జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర నేత వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE