Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థుల తరపున పోరాడటానికి.. జగన్ ను ఇంటికి పంపడానికి టీడీపీ సిద్ధం

– టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చాం
– నేడు కేవలం తొమ్మిదిన్నర లక్షల మందికి మాత్రమే ఫీజురీయంబర్స్ మెంట్ ఇస్తున్నారు
– ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో జగన్ సమాధానం చెప్పాలి
– జగన్ తన అక్రమార్జన కోసం విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చారు
– ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీనైనా పెట్టారా ?
– వైసీపీ నాయకుల్ని బందిపోటు దొంగల్లా మార్చారు
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

విద్యార్థుల తరపున పోరాడటానికి, జగన్ ను ఇంటికి పంపడానికి టీడీపీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడిన మాటలు ..

బటన్ ల ముఖ్యమంత్రి మళ్లీ బటన్ నొక్కడానికి సిద్ధమయ్యాడు. వసతి దీవెన పేరుతో మళ్లీ బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టి ప్రజల్ని మోసం చేశారు. జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును సర్వ నాశనం చేశారు. టీడీపీ హయాంలో విద్యార్థులకు ఇచ్చిన డైట్ ఛార్జెస్, కాస్మోటిక్ ఛార్జెస్ లను తీసేసి వసతి దీవెన పేరుతో కొత్తగా ఇస్తున్నట్లు పేరు మార్చి ప్రచారం చేసుకుటున్నారు. మభ్యపెడితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు.

హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జస్ పెంచలేదు. తెలుగుదేశం హయాంలో హాస్టల్ విద్యార్థులకు 19,500 రూపాయలు ఇస్తే.. నేడు జగన్ రూ.15 వేలు ఇస్తున్నారు. ఐటీ అయితే పది వేలు. ఇంజనీరింగ్ అయితే 15 వేలు. డిగ్రీ, మెడిసన్ చదివే వారికి రూ.20 వేలు ఇవ్వడం అన్యాయం. టీడీపీ హయాంలో నిత్యవసర ధరలెంత ఉన్నాయి? నేడు ఎంతున్నాయి? విద్యార్థులకు న్యాయబద్ధంగా ఇంతిస్తే సరిపోతుందో జగన్ చెప్పగలరా? ఈ ముఖ్యమంత్రి విద్యార్థుల పొట్ట గొడుతున్నారు.

టీడీపీ హయాంలో పేద విద్యార్థులకు పీజీ, డిగ్రీలు చదివించాం. పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ లేకుండా చేసింది ఈ జగన్ మోహన్ రెడ్డి కాదా? పేద విద్యార్థులు కేవలం డిగ్రీకే పరిమితమవ్వాలా? మీ బతుకులింతే, మీరు డిగ్రీ వరకు మాత్రమే చదవండని జగన్ పేద విద్యార్థులకు ఆంక్షలు విధించినట్లుంది. ఎన్నికలకు ముందు పేద విద్యార్థులకు ఎంతవరకైనా చదివిస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి నేడు పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలి.

టీడీపీ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చాం. నేడు కేవలం తొమ్మిదిన్నర లక్షల మందికి మాత్రమే ఫీజురీయంబర్స్ మెంట్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులు జగన్ దృష్టిలో కోటీశ్వరులైపోయారా? లేక రాష్ట్రం వదలి వెళ్లిపోయారా? ఈ ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారో జగన్ సమాధానం చెప్పాలి. జగన్ విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేశారు. ఎయిడెడ్ స్కూళ్లను మూత వేయించారు. మెర్జింగ్ పేరుతో దాదాపు 11 వేల స్కూళ్లు ఈ రాష్ట్రంలో మూతపడ్డాయి.

బీసీ, ఎస్సీ కాలనీలలోని పిల్లలకు స్కూళ్లు దూరమవడంతో అంత దూరం వెళ్లి చదువుకోలేక డ్రాపవుట్ అవుతున్నారు. మళ్లీ పాత తరానికి తీసుకెళ్లే కార్యక్రమాలు జగన్ చేపట్టారు. చంద్రబాబు హయాంలో 7 మెగా డీఎస్సీలు నిర్వహించాం. ఒక లక్షా 50 వేల మంది టీచర్లకు పోస్టింగ్ లు ఇచ్చాం. ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీనైనా పెట్టారా? రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్య ఎంత? రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? అనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు విదేశాల్లో చదువుకోవడానికి ఎంతమంది పెట్టుకున్నా అందరికీ పంపాం.

జగన్ నాలుగేళ్లపాటు విదేశీ విద్య గురించి పట్టించుకోలేదు. విదేశీ చదువు కోసం వెళ్లిన వారి బకాయిలను చెల్లించలేదు. తల్లిదండ్రులు విద్యార్థుల చదువు కోసం చేసిన అప్పులను తీర్చలేక చాలామంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశీ విద్య అందని ద్రాక్షలా మార్చాడు. చివరలో 200 మందికి మాత్రమే పంపారు. నాలుగు సంవత్సరాల్లో 2వందల మందిని మాత్రమే విదేశాలకు పంపడం సిగ్గుచేటు. విదేశాల్లో చదువుకునే అర్హత ఎస్సీ ఎస్టీ, బీసీలకు లేదా? విద్యార్థులను సత్యానాదెళ్లను చేస్తానన్నావు, సత్యానాదెళ్ల కాదు గంజాయికి బానిసలు చేస్తున్నావు. ఏ సందులో, ఏ కాలేజీ పక్కన చూసినా గంజాయి అమ్ముతున్నారు. విద్యార్థుల బతుకులు బుగ్గిపాలు చేశారు.

జగన్ తన అక్రమార్జన కోసం విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్ తాను వసతి దీవెన ఇచ్చాను, ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చాను అని బటన్ నొక్కితే సరిపోదు. నాలుగు విడతలుగా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తానని చెప్పి కేవలం రెండు విడతలు ఇచ్చి మిగతా రెండు విడతలు ఇవ్వకుండా మోసం చేశారు. గతంలో కాలేజీలకు డైరెక్టుగా నిధులు వెళ్లేవి. ఇవాళ తల్లిదండ్రుల ఖాతాల్లో కొంత వేస్తున్నావు, దాన్ని వారు కట్టడంలేదు. కాలేజీవారు టీసీలు, ఎగ్జామ్స్ కు హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ పంచతంత్రలోని నీతి కథలు చదువుకుని వుంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో?

రాష్ట్రంలోని భవిష్యత్ తరాల పరిస్థితి అగమ్య గోచరంలోకి నెట్టేశారు. సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్నారు. కుటుంబం పట్ల జాలి, దయ, కరుణ లేవు. సత్యనాదెండ్లను తయారు చేస్తానంటే ప్రజలు నమ్మరు. క్రిమినల్స్ ని, జేబు దొంగల్ని తయారు చేస్తావు. రాష్ట్రంలోని వైసీపీ నాయకుల్ని బందిపోటు దొంగల్లా మార్చారు. జగన్ లాంటి దుర్మార్గులు పోయి రాష్ట్రానికి మంచి రోజులు రావాలి. విద్యకు పెద్దపీట వేసింది టీడీపీనే.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబునాయుడే. సత్యానాదెండ్ల టాప్ సీఈవోగా ఉండటానికి కారణం చంద్రబాబే. రాష్ట్రానికి మళ్లీ మంచిరోజులు రావాలి. బటన్ లు నొక్కి రాష్ట్రాభివృద్ధిని దిగజార్చిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విద్యార్థుల తరపున పోరాడటానికి టీడీపీ సిద్ధంగా వుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

LEAVE A RESPONSE