Suryaa.co.in

Andhra Pradesh

కుట్రల్లో టీడీపీ-జనసేన-ఎల్లోమీడియా కొత్త ట్రెండ్

– అప్పుడూ, ఇప్పుడూ టీడీపీ-ఎల్లో మీడియావి అదే మాయ..!
– అప్పుడు లేనిది ఉన్నట్టు.. ఇప్పుడు ఉన్నది లేనట్టు..!
– పెయిడ్ ఆర్టిస్టులు.. పెయిడ్ పార్టీలు.. పెయిడ్ గ్రూపులతో బాబు కుట్రలు
– ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చిన ఏ ఒక్కరి ప్రహరీ గోడలు కూల్చలేదు
– ఏ సమస్య లేకపోయినా.. పవన్ ఎందుకంత ఆవేశం, కోపంతో ఊగిపోయాడు..?
– ఇప్పటంలో లేని సమస్యను సృష్టించి.. చంద్రబాబు-పవన్ ల నాటకం
– ఆరోపణలు చేసేది పవన్ కల్యాణ్.. చేయించేది బాబు
– 3 ఏళ్ళలోనే 30 ఏళ్ల అభివృద్ధి-సంక్షేమం చేస్తున్న సీఎం జగన్
– ప్రజలతో సంబంధం లేకుండా.. ఎన్ని కుట్రలు చేసినా బాబు గెలవలేడు
– సోషల్ ఆడిట్ పేరుతో జగనన్న ఇళ్ళ పథకంపైనా పవన్ కల్యాణ్ కుట్రలు
– కట్టినవాటిని వదిలేసి, కట్టని ఇళ్ళు చూపించి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పవన్ ఎజెండా
– 3 సెంట్లలో పక్కా ఇళ్ళు ఎందుకు కట్టలేదని నాడు బాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
– బాబు పాలనలో ఏం జరిగింది.. జగన్ పాలనలో ఏం జరుగుతుందో ప్రజలే ఆలోచించండి
– నాడు మోసం చేసి, మళ్ళీ కుట్రలు చేయడానికి వచ్చే నాయకులను ప్రజలే నిలదీయాలి.
– విజయసాయిరెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఏమిటి సంబంధం..?
– అరబిందో సంస్థకు చెందిన వారికి తన కూతురిని ఇస్తే.. లింకు పెడతారా..?
– ఆయన కూతురుపైనగానీ, అల్లుడుపైనగానీ ఎక్కడా ఆరోపణలు లేవు
– ఆరోపణలు వచ్చింది విజయసాయిరెడ్డి అల్లుడి అన్నపైన..
– అలాఅయితే, ఒకప్పుడు చంద్రబాబు కూడా అరబిందో సంస్థలో పార్టనరే.. మరి బాబుకు కూడా లింకు ఉందా..?
– యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని ముఖద్వారం వద్ద పెట్టి ప్రాముఖ్యతనిస్తే వక్రీకరణలా..?
– మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలనూ ఎల్లో మీడియా వక్రీకరించింది
–  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి

కుట్రల్లో కొత్త ట్రెండ్..
టీడీపీ-జనసేన-ఎల్లో మీడియా కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అక్టోబర్ నెలలో విశాఖపట్నంలో విశాఖ గర్జన జరిగింది. అదేరోజు పవన్ కల్యాణ్ పరట్యన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద మంత్రులు, మా పార్టీ నాయకులపై దాడి జరిగింది. ఆ తర్వాత పరిణామాలు చూస్తే పవన్ కల్యాణ్ విశాఖలో చేసిన డ్రామా, ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ లో పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ జగన్ మోహన్ రెడ్డిని వెంటనే కుర్చీ నుంచి దించేయడానికి అన్ని శక్తులు ఏకం కావాలని వారు పిలుపు నివ్వడం, మళ్లీ వాళ్లు వెనక్కి వెళ్లడం చూశాం. తాజాగా వాయిదాల పద్దతిలో ఇప్పటం గ్రామానికి పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్, ఆ తర్వాత నారా లోకేష్ పర్యటనలు చూశాం. అంతకు ముందు రోజే చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం చూశాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, అందుకు పొత్తులకు సిద్ధమని పవన్ డిక్లరేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పొత్తులపై ఇంకా చర్చలే పూర్తి కాలేదని కొద్దిరోజులు, సమస్యలు ఉంటే కలిసి పనిచేస్తామని కొద్దిరోజులు చెప్పుకొచ్చారు.

మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కలుస్తున్నామని చెప్పడం చూశాం. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే, దానికి భంగం కలిగించే సంఘటనలు సృష్టించడం, ఎక్కడో క్షేత్రస్థాయిలోనో, వ్యక్తిగత తగాదాలనో తెరమీదకు తెచ్చి.. అన్యాయం జరిగిందంటూ చెప్పే ప్రయత్నం వీరంతా కలిసికట్టుగా చేస్తున్నారు. వీటన్నింటి ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలవక తప్పని పరిస్థితులను సృష్టించి ,ఊహాజనితమైన సన్నివేశాలను సృష్టించి తర్వాద తమ కలయిక చారిత్రక అవసరంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీరి దురాలోచన, దుష్టబుద్ధి, కుట్రపూరితమైన చర్యలే కనిపిస్తున్నాయి తప్ప అంతకు మించి మరొకటి లేదు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండించడమే కాక పూర్తి వాస్తవాలను ఎప్పటికప్పుడూ ప్రజలకు వివరిస్తున్నాం.

గతంలో కలిసి మోసం చేసి.. మళ్ళీ కలిసిపోయోందుకే ఈ డ్రామాలు
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి … గేర్ అప్ కావడానికి ప్రతిపక్షాలు ఏకం కావడానికి సన్నాహాలు చేసుకోవడంలో తప్పులేదు. నిజాయితీ, నిబద్ధత ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ … ఏ కారణాల వల్ల తాము కలిసి పోటీ చేయాలనుకుంటున్నారో ప్రకటిస్తే తప్పులేదు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటే వాటిని చెప్పడంలో తప్పులేదు. కానీ వాళ్లు ఇవేమీ చేయడం లేదు. ఏదో ఒక సంఘటన మీదనో, జరిగిన పరిణామాల మీదనో, టీడీపీ, జనసేన విడివిడిగా లోపాలను ఎత్తి చూపేలా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి మోసం చేశారని ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టెంపో క్రియేట్ చేసి, దాని ద్వారా న్యాయబద్ధంగా మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక అభిప్రాయం తెచ్చేందుకే వీరి డ్రామాలు.

ఇప్పటంలో పవన్ సభకు స్థలాలు ఇచ్చిన ఏ ఒక్కరి గోడలూ కూల్చలేదు
ఇప్పటం ఘటనే చూస్తే.. పవన్ కల్యాణ్ అంత ఆవేశంగా ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. పవన్ సభకు స్థలం ఇచ్చినవారిలో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు. పవన్ ఎందుకంత ఆవేశపడిపోయాడో, ఊగిపోయాడో ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకుని చూశాం. పవన్ కల్యాణ్ సభకు స్థలాలు ఇచ్చిన ఏ ఒక్కరూ ఆక్రమణల తొలగింపులో లేరు. ఆక్రమణలు తొలగించిన ఆరుగురు, ఎనిమిది మంది వివరాలు తెప్పించుకుని చూస్తే ఒక్కరు కూడా పవన్ సభకు భూములు ఇచ్చినవాళ్లు లేరు. ఇళ్లు కూల్చేశారన్నది శుద్ధ అబద్ధం అయితే… సభకు భూములు ఇచ్చిన వారెవరివీ గోడలు కూడా కూల్చలేదు. రోడ్డు విస్తరణ నేపథ్యంలో ప్రభావితం అయ్యే ఒకే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే … దాని జోలికి కూడా అధికారులు వెళ్లలేదు. మరి ఎందుకు పవన్ కల్యాణ్ కు అంత కోపం వచ్చింది. ఆయన మాటలు, చేష్టలు… వాహనం టాప్ మీద ఎక్కి ఊరేగడం కానీ.. ఆ రోజు జరిగిన డ్రామాను ప్రజలంతా గమనించారు.

అంతకు ముందు రోజు జరిగిన చంద్రబాబు కాన్వాయ్ పై రాయి ఘటన, ఆ తర్వాత రోజు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటన చూస్తే … వాళ్లకు వాళ్లు ఓ సంఘటనను సృష్టించుకున్నట్లు ఉంది.ఇక ఇప్పటంలో ఆక్రమణలకు సంబంధించి వారికి అధికారులు జనవరి నెలలోనే నోటీసులు ఇచ్చారు. డ్యూ ప్రోసెస్ ప్రకారం అధికారులు ప్రొసీడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడుకు మళ్లీ అధికారంలోకి వచ్చే కోరిక ఉంటే … ప్రభుత్వ యంత్రాంగం గానీ, అధికారులుగానీ ఆక్రమణలను గురైనవాటిని తొలగించాల్సిందే కదా? నష్టపరిహారం చెల్లించాల్సిన ప్రశ్న ఉత్పన్నం కాదు.

పవన్ సభకు స్థలానికి ఇచ్చినవారి ఇళ్లను కూల్చామంటే అందులో వాళ్లెవరూ లేరు. అయినా దీనిపై డ్రామా తిప్పుతూ పవన్.. ఆ తర్వాత లోకేష్ రావడం చూశాం. వాయిదాల పద్దతిలో చంద్రబాబు కూడా ఇప్పటం వస్తాడేమో. ఏమీ లేనిదానికి ఒక కుట్రను ఆపాదించి, వారి స్క్రిప్ట్ ప్రకారం ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, అరాచక పాలన జరుగుతోందని, వ్యవస్థలు భ్రష్టు పట్టాయనేలా కుట్రపూరితంగా వీరంతా కలిసి పని చేస్తున్నారు. పొలిటికల్ అజెండా తీర్చుకోవడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?. వాళ్ల మాట్లాడే భాష, వేషాల గురించి మాట్లాడటం లేదు. మాకు అనవసరం కూడా. మీరు అధికారంలోకి రావాలంటే వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా?.

అప్పుడూ, ఇప్పుడూ అదే మాయ, అవే కుట్రలు
2014-19 మధ్యలో కూడా లేని సమస్యలను, సంఘటనలు సృష్టించడం చూశాం. చంద్రబాబు నాయుడు ఆరోజు అయినా, ఈరోజు అయినా లేనిది ఉన్నట్లు చూపించడం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించాడు. అమరావతి మొదలుపెట్టి మొత్తం మాయాబజార్ సృష్టించారు. ఓవైపు వర్షాలు పడకపోవడం, మరోవైపు కరువు మండలాలు, అంతేకాకుండా వర్షాలు పడితే విత్తనాలు లేని పరిస్థితి బాబు హయాంలో చూశాం. విత్తనాలు, ఎరువుల కోసం, ఎప్పుడూ ధర్నాలు జరిగేవి. విత్తనాల కోసం రైతులు రోడ్లు ఎక్కాల్సి వచ్చేది. అయినా, ఎవరి థింగ్ ఈజ్ గ్రీన్.. అన్నట్లు తామేమనుకున్నారో దాన్ని వర్చువల్ రియాల్టీని చూపించేవాళ్లు.

కరోనా విపత్కర సమయం మినహాయిస్తే, మూడేళ్లలోనే ఇంత అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నా ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేస్తున్నాం. ఎన్నడూ లేనివిధంగా ఏదో పథకం ద్వారా 80శాతానికి పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని అయిదు లక్షల ఆదాయం వరకు పెంచాం, అందులో ప్రొసీజర్స్ 3,255కు పెంచాం. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఎక్కడైనా తప్పు జరిగితే ఫిర్యాదు చేసేందుకు నేరుగా పోలీస్ స్టేషన్లకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. దిశ చట్టం స్ఫూర్తితో ప్రభుత్వం, పోలీసులు పనిచేస్తూ సత్వరమే చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతకు సంబంధించి తక్షణమే స్పందిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తోంది. వాటని మాత్రం ఎల్లో మీడియా ప్రసారం, ప్రచారం కూడా చేయదు.

పెయిడ్ ఆర్టిస్టులు.. పెయిడ్ గ్రూప్స్..
ఏతావాతా 24 గంటల టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్లుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ కరపత్రాలు…ఫెయిడ్ ఆర్టిస్ట్స్ .. పెయిడ్ గ్రూప్స్ .. వారి ఏజెంట్లతో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనేలా లేనిది ఉన్నట్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రజలతో కనెక్షన్ లేకుండా చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలు ఫలించవు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆయనకు ఇదెందుకు అర్థం కావడం లేదో. సంక్షేమ పథకాల అమలుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చేసిన 80 శాతం మంచిని చెప్పకుండా, మిగిలిన 20 శాతం ఎందుకు చేయలేదంటూ ప్రశ్నిస్తూ, వందశాతం అమలు కాలేదనేలా కుట్రపూరితంగా టీడీపీ-ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది. ఎల్లో మీడియా పత్రికలు తెరిస్తే అసలు ప్రభుత్వం ఏమీ పనిచేయడం లేదనే అభిప్రాయం కలిగేలా కథనాలు రాస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు కళ్ళకు కట్టినట్టు పారదర్శకంగా కనిపిస్తోంది. మా ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ. 1.80 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేసింది. ఇవన్నీ మరచి, ప్రజలకు జరుగుతున్న లబ్ధిపై ఆరోపణలు చేసేది పవన్ కల్యాణ్ అయినా… చేయించేది ఎవరో అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అర్జెంట్ గా అధికారంలోకి రాకుంటే.. రాష్ట్రం నాశనం అయిపోతుందని పవన్ తీసుకున్న స్టాండ్ ఎంత మోసపూరితమైందో అతడే ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా గమనించాలి. చంద్రబాబును తక్షణమే ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకున్న రామోజీరావు, రాధాకృష్ణ ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. గతంలో లేనిది ఉన్నట్లు ఎలా చూపించారో … ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే లేనట్లు చూపించే యత్నం చేస్తున్నారు. అమరావతి విషయంలోనూ, రైతులను మోసం చేసి, మళ్లీ ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక, జగన్ మోహన్ రెడ్డిగారు ఏం చేయడం లేదంటూ మభ్యపెడుతూ ఓట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రంలోని ప్రజలంతా గుర్తించాలి. అంతేకాకుండా వారిని ప్రశ్నించాలి.

సోషల్ ఆడిట్ అంటూ పవన్ డ్రామాలు..
3 సెంట్లల్లో పక్కా ఇళ్ళు ఎందుకు కట్టించలేదని బాబును ప్రశ్నించావా..?
జగనన్న ఇళ్ల పథకం కింద నిర్మాణాలు 2021 జూన్ లో ప్రారంభించాం. ఇందులో వర్షాకాలం తీసేస్తే పదినెలలు పాటు పనులు జరిగాయి. ఇప్పటికే 3లక్షలు ఇళ్లు సీలింగ్ వరకూ వచ్చాయి. మిగతావి నిర్మాణాలు జరుగుతున్నాయి. సోషల్ ఆడిట్ చేస్తామని బయల్దేరారు కదా. మా ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా చెప్పాలి కదా. 31 లక్షల ఇంటి స్థలాలను అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. దాని కోసం వేల ఎకరాలు కొనుగోలు చేశామో ప్రజలకు తెలుసు. స్థలాలు ఇవ్వడంతో పాటు 21 లక్షల ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి. దానిలో 15 లక్షల ఇళ్లకు గత ఏడాది జూన్ లో శంకుస్థాపన చేశాం. ఈ ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ. 5వేల కోట్లు కన్ స్ట్రక్షన్ మీద ఖర్చు పెట్టారు. దాని మీద మీరు సోషల్ ఆడిట్ చేయడం ఏంటి?. పవన్ కల్యాణ్ వెళ్లి ఆడిట్ చేస్తారట?

ఫోటోలు అప్ లోడ్ చేయాలని చెప్పడం చూస్తుంటే.. మీ దిగజారుడు ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ప్రజలను ఏరకంగా మోసం చేయాలనుకున్నారో ఇప్పటం సంఘటన ఒకటి అయితే, నిజమైన అభివృద్ధి జరుగుతుంటే, అసలు ఏమీ జరగడం లేదంటూ చెప్పేందుకు ప్రయత్నం చేయడం మరొకటి. మీకు మద్దతు ఇస్తున్న టీడీపీ కూడా నీకు అండగా నిలబడి జగనన్న ఇళ్ల ఆడిటింగ్ కు వస్తోంది. 2014 ఎన్నికల్లో కలిసే కదా మీరు ప్రచారం చేసింది. అప్పట్లో మీరు ఇచ్చిన హామీ ఏంటి?. చంద్రబాబును అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి జనసేన, బీజేపీ కలిసి పనిచేశాయి కదా?.

600లకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేశారు?. “అర్హులైన అందరికీ 3 సెంట్ల స్థలంలో పక్కా గృహాలు కట్టిస్తాం” అని టీడీపీ, బీజేపీ- జనసేన జాయింట్ ప్రకటన చేసింది వాస్తవం కాదా?. 2018లో టీడీపీతో పొలిటికల్ డైవర్స్ తీసుకుని బయటకు వచ్చామని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా చంద్రబాబును ప్రశ్నించాడా?. 3 సెంట్లల్లో పక్కా ఇళ్ళు ఎందుకు కట్టలేదని.. పవన్ ప్రశ్నించి ఉంటే పవన్ బలం రాజకీయపార్టీ నేతగా కాకపోయినా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా విలువ ఉండేది. పవన్ కల్యాణ్ జగనన్న కాలనీలు చూడాలంటే.. నిర్మించిన ఇళ్ళ దగ్గరకు వెళ్ళండి. లేదంటే, గడప గడపకు వెళుతున్న మా ఎమ్మెల్యేలతో వచ్చి, ప్రతి ఇంటికీ ఏమేమి పథకాలు అందుతున్నాయో చూడండి. టీడీపీ హయాంలో 5 ఏళ్ళపాటు ఏమీ చేయకుండా, లక్షల కోట్లు మళ్ళించి, మీరు చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలను అన్నింటినీ సరిదిద్దుతూ.. మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే జగన్ గారి సక్సెస్ కు కారణం. మీకు, మీరే ఆలోచించండి, ప్రభుత్వంపై పనిగట్టుకుని బురదచల్లే వారిని ఎక్కడికక్కడ నిలదీయండి.

జగనన్న ఇళ్ళ నిర్మాణాల ద్వారా రూ. 3-4 లక్షల కోట్ల సంపద
ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల సంపద క్రియేట్ అవుతుంది. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఒక ఆస్థి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అమ్ముకుంటున్నారని ఓవైపు మీరే రాతలు రాస్తారు. మరి విలువ ఉండటం వల్లే కదా వాళ్లు అమ్ముకుంటున్నారు. వాటిని జగన్ మోహన్ రెడ్డిగారు కాకుండా ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కుటుంబానికి ఆత్మస్థైర్యం కలిగేలా వారికి స్థలాలు మంజూరు చేసి, ఇళ్లు కట్టి ఇస్తుంటే వాటిపై బండలు వేస్తారా?. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ప్రపంచంలోనే అరుదైన విషయం.

17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి. వీటికి మౌలిక సదుపాయాల కోసం రూ. 56 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగనన్న ఇళ్ల నిర్మాణాలను సుమారు 300మంది కాంట్రాక్టులు చేస్తున్నారు. వాటిలో వారికేమీ లాభాలు రావు. ఇళ్లు పూర్తి చేయడానికి ప్లాన్డ్ గా పని చేస్తున్నారు. ఆ రేటుకు ఇళ్లు కట్టడం కష్టమని అంటూనే.. మరోవైపు దోచిపెడుతున్నామంటూ మీరే రాతలు రాస్తున్నారు కదా? మరి ఇళ్లు అయితే పూర్తవుతున్నాయి కదా? . దీనికి మాత్రం ఎల్లో మీడియా దగ్గర సమాధానాలు లేవు. చంద్రబాబును అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆత్రంతో కొట్టుకునే వారిని ప్రశ్నిస్తున్నాను. వారసుడిని డిక్లేర్ చేసేందుకు కొడుకు మీద నమ్మకం లేక చివరకు పవన్ కల్యాణ్ పై చంద్రబాబు ఆధారపడుతూ అధికారంలోకి రావాలనుకునే దీనస్థితిలో ఉన్నాడు.

ప్రజలతో సంబంధం ఉంటే చంద్రబాబు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉండేవాడు కాదు. ఈస్ట్ మన్ సినిమాలా కుట్ర పన్నితే జనం నమ్మేసి ఓట్లు వేస్తారనే భ్రమలో చంద్రబాబు ఇంకా ఉన్నాడు. మామను వెన్నుపోటు పొడిచి ఒకసారి, రెండోసారి మభ్యపెట్టి, బీజేపీ ఊపును ఎన్ క్యాష్ చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చాడు.

చంద్రబాబు అధికారంలో ఉంటే వారికి ఓటు చీలడం కావాలి. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలంటే జగన్ గారి వ్యతిరేక ఓటు చీలకూడదనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంత పూర్తిస్థాయిలో ప్రజల అభిమానం, ఆశీస్సులు గతంలో ఏ ప్రభుత్వానికి లేదు. జగన్ గారి ప్రజా బలాన్ని ఏమాత్రం తగ్గించలేదు.
రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు మా ప్రభుత్వంలో ఏదోవిధంగా లబ్ధి చేకూరుతోంది. విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. విద్య హక్కుగా చేస్తున్నారు. కళ్ల ముందే గ్రామల స్వరూపాలే మారిపోతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ అనేది విప్లవాత్మకమైనది.

కోవిడ్ సమయంలోనూ ఆర్థిక వెసులుబాటు లేకున్నా అప్పుడు ఎలా ఉంది?. 2014-19 కాలంలో ఏం విధంగా పరిస్థితులు ఉన్నాయనే దానిపై ఆలోచన చేయాలి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంపై బురద చల్లుతున్న వీరి ఉద్దేశం ఏంటనేది ప్రజలు గ్రహించాలి. బెనిఫిట్స్ పొందని ఉన్నత వర్గాల వారు… మీ ఇళ్లలో పనిచేసేవారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. టీడీపీ అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలను ముఖ్యమంత్రి సరిచేసుకుంటూ రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని కలిగిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షం, ఎల్లోమీడియా దాడులను తిప్పికొట్టాల్సింది ప్రజలే. ఇళ్ల స్థలాల సోషల్ ఆడిట్ అయినా సరే.. మేము సిద్ధం. లబ్ధిదారులను అడిగితే వాళ్లే చెబుతారు. సామాజిక స్పృహ కలిగిన వారు గట్టిగా నిలదీయాల్సిన ఆవశ్యకత ఉంది. వీళ్ల నాటకాలకు అడ్డుకట్ట వేయాలంటే వాస్తవాలను గ్రహించాలని ప్రజలను కోరుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..లిక్క
ర్ స్కాంలో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులెవరూ లేరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఆయనకు ఒకరే కూతురు. ఆమెకు సంబంధించి ఎక్కడా స్కాంలో లేరు. సాయిరెడ్డి అల్లుడు అన్న పేరు వచ్చింది. అరబిందో ఫార్మా చాలా పెద్ద కంపెనీ. అది ఒక పెద్ద వ్యాపార సంస్థ. తన కూతురును ఆ ఇంటికి ఇవ్వడం ద్వారా విజయసాయిరెడ్డిగారికి సంబంధం ఏర్పడింది తప్ప, అది విజయసాయిరెడ్డి కుటుంబం కాదు. తన కూతుర్ని ఇచ్చేటప్పటికే అరబిందో వాళ్ళు బాగా సంపద ఉన్నవారు. కూతుర్ని ఇచ్చాక వారి సంపద పెరగలేదు. వ్యాపారానికి సంబంధించి ఏమైనా జరిగితే వాళ్ళను అడగాలి. దానికీ, విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం?.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్, తెలంగాణలో అధికారంలో ఉన్న కేసిఆర్, కేంద్రంలో బీజేపీ.. ఇటీవలకాలంలో ఆ పార్టీ నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలను బట్టి చూస్తే.. వాళ్ళ మధ్య సంబంధించిన పొలిటికల్ అంశం అయినా అయి ఉండాలి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో, మాకుగానీ, ప్రభుత్వానికిగానీ, మా పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డికిగానీ ఏం సంబంధం..?. తన అల్లుడుకు అన్న అయినంతమాత్రాన మోకాలికి, బోడి గుండుకు ముడి పెట్టడం సమంజసం కాదు. లేనిది ఉన్నట్టుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసి, విత్తనం నుంచి వీళ్ళే లీకులు ఇస్తూ.. మళ్ళీ మేం ముందు చెప్పినట్టే జరుగుతుందని వీళ్ళే మాట్లాడటం.. రాతలు రాయడం వాళ్ళ నైజం.

మరి బాబుకూ ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకు ఉందా..!?
అయితే, 2000 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరబిందో సంస్థకు చెందిన ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్ లో.. చంద్రబాబు కూడా పార్టనర్. మరి చంద్రబాబుకు కూడా లిక్కర్ స్కాం తో లింకు ఉందా.. ?. ఆ బంధం కంటే, ఈ బంధమే ఎక్కువ కదా..! విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియాలో, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నవి కేవలం కుట్ర బుద్ధితో చేస్తున్నవే. ఆయనకు సంబంధం ఉందని మీరు ఆరోపిస్తే.. అరబిందోకు చెందిన ఆంధ్రా ఆర్గానిక్ లో ఒకప్పుడు చంద్రబాబు పార్టనర్ కాబట్టి.. ఆయనకే ఎక్కువ సంబంధం ఉందని అనుకోవాలి.

ధర్మాన వ్యాఖ్యలను వక్రీకరించారు..
యోగి వేమన విగ్రహానికి ప్రాముఖ్యతనిస్తే.. దానిపైనా కుట్రలే. ధర్మాన ప్రసాదరావు వికేంద్రీకరణ గురించి మాట్లాడితే.. ఆయన మాటలనూ ఎల్లో మీడియా వక్రీకరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలాలు రావడానికి సమయం పడుతుంది. విత్తనం వేయగానే ఫలితం రాదు.. అని ఆయన చెబితే.. దానిని ఎల్లో మీడియాలో తప్పుడు ఉద్దేశాలు ఆపాదించి విషం చిమ్మారు. ధర్మాన మాట్లాడిన ఉద్దేశం అందరికీ అర్థమైంది. పాజిటివ్ సెన్స్ లోనే ఆయన చెప్పారు. దానికి అన్యాయమైన రాతలు రాశారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో లోపల ఉన్న వేమన గారి విగ్రహాన్ని, బయటకు తెచ్చి, అందంగా తీర్చిదిద్దిన ముఖద్వారం వద్ద పెట్టి, ఆ విగ్రహానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో అడ్డగోలు కథనాలు రాశారు. ఎందుకంటే, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలకు చేరకుండా, అసలు విషయాలను పక్కదారి పట్టించాలన్నదే వీళ్ళ కుట్ర.. అని సజ్జల వివరించారు.

LEAVE A RESPONSE