పల్నాడు జిల్లా చిలకలూరిపేట: రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. 40 ఏళ్లు పైబడిన పార్టీ ప్రస్థానంలో ఈ రోజుకూ బీసీలను, ముస్లీంలను ఎవరూ పార్టీ నుంచి విడదీయలేకపోయారంటే అదే కారణమన్నారు. చిలకలూరిపేట టీడీపీ 11వ క్లస్టర్ ఇన్‌చార్జి మద్దిబోయిన శివ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ బీసీ ఉపకులాల్లో ఎవరికీ కనీస న్యాయం చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటికి నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్, కూటమి ప్రభుత్వంలో తీసుకురానున్న బీసీ రక్షణ చట్టంతో ఈ వర్గాల వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా నాయకులు ఎంత దుష్ప్రచారం చేస్తున్నా ముస్లీం మైనార్టీల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పట్ల ఆదరణ ఉందన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని తీరుతామని, వారు ఏ లోటు లేకుండా జీవించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ నాయకుడు జయరామ్‌రెడ్డి, టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షు డు తన్నీరు పుల్లారావు, భీమవరపు సుబ్బారావు, తుపాకుల అప్పారావు, షేక్ సాయిబాబా, చింతకాయల కోటి, తదితరులు పాల్గొన్నారు.