Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం – నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, జ్యుడీషియల్‌ విచారణ జరిగేలా ఒత్తిడి తేవాలని, దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే 93% కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలవడం జగన్‌రెడ్డి రైతు వ్యతిరేక చర్యలకు అద్దం పడుతుందని, ఈ అంశాలను పార్లమెంటులో పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు సూచించారు. శనివారంనాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలు పార్లమెంటులో ప్రస్తావించాలని తీర్మానించారు.
1. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వ పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రత్యేకహోదా, 3 రాజధానుల బిల్లు.
2. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ సరఫరా
3. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
4. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడడం
5. దేశానికి అన్నపూర్ణగా పిలవబడిన ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.
6. వైయస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల సుఫారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.
7. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు, ఉపాధి హామీ నిధులు మళ్లింపు, ఈఏపీ నిధులు దారిమళ్లింపు, కోవిడ్‌ నియంత్రణ, విపత్తు సాయం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. దోపిడీ, దుబారాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ఖర్చులు చేస్తున్నారు.
8. 2014లోనే బీసీ జనగణనతోపాటు బీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలి. రాజ్యాంగబద్ధంగా బలహీనవర్గాలకు కేటాయించిన నిధులు, విధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ కంటితుడుపు చర్యగా అసెంబ్లీలో జగన్‌రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. జగన్‌రెడ్డి చర్యలతో బీసీలకు స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా వచ్చే 16,800 పదవులు కోల్పోవడంతోపాటు రాజకీయంగా వెనుకబడేలా చేశారన్నారు. యూనివర్సీటీ వీసీలు, ఈసీ మెంబర్లు, సెర్చ్‌ కమిటీల నియామకంలో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని ఆ అంశాలను లేవనెత్తాలన్నారు.
9. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీశారు. ఏకపక్షంగా నామినేషన్లు తిరస్కరించడం, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వంటి అరాచకాలకు వైసీపీ నేతలు తెరలేపారన్నారు.
10. అమరావతి ప్రజా రాజధాని కేంద్ర చట్టం ద్వారా ఏర్పడ్డ శివరామకృష్ణ కమిషన్‌ సిఫారసుల మేరకు ఏర్పడినందున 3 ముక్కల రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్రం 3 సాగు చట్టాలను ఉపసంహరించుకున్న విధంగా
3 రాజధానుల నిర్ణయం జగన్‌రెడ్డి ఉపసంహరించుకుని ‘ఒకే రాష్ట్రం`ఒకే రాజధాని’ ఉండే విధంగా గౌరవ ప్రధాని ప్రారంభోత్సవం చేసిన అమరావతి రాజధానిగా స్థిరపరచాలి.
11. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, పండిరచిన పంటలకు మద్దతు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందక రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని చంద్రబాబు తెలిపారు.
ఈ సమావేశంలో తెలుగుదేశంపార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కింజారపు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, జాతీయ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE