Suryaa.co.in

Andhra Pradesh

మానవతా మూర్తి మదర్ థెరిస్సాకు టీడీపీ ఘన నివాళి..

– ప్రతి ఒక్కరూ పేదవారిపట్ల కరుణ కలిగి ఉండాలి
– నివాళి కార్యక్రమంలో అశోక్ బాబు, రామానాయుడు

పేదవారి పట్ల ప్రేమ, జాలి, కరుణ చూపి గొప్ప మానవతామూర్తిగా పేరొంది, నోబెల్ అవార్డు పొందిన మదర్ థెరిస్సా 112వ జయంతిని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ..ప్రపంచానికే ఆదర్శవంతురాలైన మదర్ థెరిస్సాని స్మరణకు తెచ్చుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. అటువంటి మహనీయురాలి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని భావించి పార్టీని స్థాపించారు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రజలకు సేవలందించారన్నారు.

పేదవాళ్లు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నవారు, మంచానికే పరిమితమైన రోగులకు మదర్ థెరిస్సా మానవతా దృక్పథంతో నిస్వార్థ సేవలందించారని తెలిపారు. నేటి సమాజంలో మానవత్వం కరువైందన్నారు. ఒకరంటే ఒకరికి పడడం లేదని, మనుషుల్లో విద్వేషం, కుళ్లు, కుతంత్రాలు గూడుకట్టుకుపోతున్నాయని తెలిపారు. ప్రేమ, జాలి, కరుణ అనేవి మచ్చుకైనా కనిపించని పరిస్థితులు రోజురోజుకూ పెరగిపోతున్నాయని వివరించారు. సమాజంలోని ప్రతిఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమాభిమానాలతో మెలిగినప్పుడే జీవితానికి ఒక పరమార్థం ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తికి మేలు చేయకపోయినా పర్వాలేదు కాని, హాని తలపెట్టకుండా ఉండడం చాలా ఉత్తమమైన గుణమని తెలిపారు. మదర్ థెరిస్సా మాదిరిగా పేదవారిపట్ల ప్రేమ, జాలి, దయ కలిగి నడుచుకోవడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. టీడీపీ పార్టీ పేదవారికి, ఆపదలో ఉన్నవారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. ఇటువంటి మరింతగా నిర్వహించేందుకు రానున్న కాలంలో పార్టీ విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మర్రెడ్డి శ్రీనివాస్రెనడ్డి, గోనుగుట్ల కోటేశ్వరరావు, టీఎన్టీరయూసీ రఘురామరాజు, హషన్ బాష, బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, పారా రామకృష్ణ, పర్చూరి కృష్ణ, తెలుగురైతు సాంబిరెడ్డి, పర్చూరి ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE