* ఎందరో నాయకులు ఓనమాలు నేర్చుకున్నది టీడీపీలోనే…
* తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసేలా చంద్రన్న పాలన
* ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం…
* సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం
* కార్యకర్తల సూచనల మేరకే పదవుల కేటాయింపు
* టీడీపీ తిరుపతి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
తిరుపతి : రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని, టీడీపీ రాజకీయ యూనివర్శిటీ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని స్పష్టంచేశారు.
తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ టీడీపీ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. పనిచేసిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఇందుకు ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవులే నిదర్శమని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన తనతో పాటు మరెందరికో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రోత్సాహించారన్నారు. టీడీపీ మాదిరిగా మరే పార్టీలోనూ కార్యకర్తలకు గుర్తింపు ఉండదన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆదరిస్తున్నారన్నారు.
కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చుతున్నారని మంత్రి సవిత తెలిపారు. గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే నాయకులు చాలా మంది టీడీపీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని, రాజకీయాలకు టీడీపీ యూనివర్శిటీ అని అన్నారు.
సమిష్టిగా పనిచేసి స్థానిక సంస్థల్లో విజయం మనదే
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్కడి నాయకులు సమిష్టిగా పనిచేసి, జగన్ కోటను బద్ధలు కొట్టారని, వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి సవిత తెలిపారు. అదే సమిష్టి స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేసి, విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథం వ్యక్తమవుతోందని, టీడీపీ కార్యకర్తలంతా ఐక్యంగా, సమిష్టిగా పనిచేస్తే, రాష్ట్రంలో ఏ ఎన్నికల జరిగినా పులివెందుల జెడ్పీటసీ ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందన్నారు.
కార్యకర్తల సూచన మేరకే పదవుల కేటాయింపు
అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మరింత బలోపేతం చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. నామినేటెడ్, పార్టీ పదవుల కేటాయింపులో కార్యకర్తల అభీష్టానానికి అనుగుణంగా పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తోందన్నారు. తిరుపతి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుని నియామకం కూడా కార్యకర్తలు, నాయకుల సూచనల మేరకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసిం సునీల్, కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, తొడ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.