Suryaa.co.in

Telangana

తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు

-టీడీపీ-బీజేపీ నేతల భేటీ
-ఉమ్మడిగా ప్రెస్‌మీట్

హైదరాబాద్‌ : తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి తెలుగుదేశం మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఎనీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ఓట్ల బదిలీ, ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పనిచేస్తున్నారని అన్నారు. ఎలాంటి భేషజాలు పెట్టుకోకుండా టీడీపీ నేతలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు బీజేపీకి సహకరించాలని కోరారు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు.

టీడీపీ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్లకుండా చూడాలని అన్నారు. ఈ ఎన్నికల్లో వేరే పార్టీలకు ఓటు వేస్తే తమ రెండు పార్టీలకు కూడా నష్టమేనని చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి కిషన్ రెడ్డికి టీడీపీ నేతలు ఇస్తున్న మద్దతు శుభ పరిణామమని అన్నారు.

ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ కేడర్ కూడా భారీగా పాల్గొనాలని చింతల కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని టీడీపీని కోరినట్లు చింతల వెల్లడించారు.

LEAVE A RESPONSE