బడి గుడిలో అక్షరం
నేర్పే దైవం
దన్నం పెడితే అన్నం కూడా
అవసరం లేని అల్పసంతోషి..
జీవితంలో మితభాషి..
స్కూల్లో మృదుభాషి..
నమస్కారానికే పొంగిపోయే
సగటు మనిషి..!
అలాంటి ఓ మాస్టారు..
బడిలో దైవమై..
బోధనే శైవమై..
పాఠాలు చెప్పే వృత్తే
తన ఇతివృత్తమై
బతికే అయ్యోరు..
సర్కారు ఇస్తున్న జీతానికి
తలవంచి అప్పుడప్పుడు
మామూలు ఉద్యోగిని తలపించి..
ప్రభుత్వమే బడి దొంగని చేసి
ఇంటింటా జనాభా లెక్కలు…
ఎన్నికల విధుల్లో
కాకి లెక్కలు..
తప్పని సరిగా తప్పులు..
రాజకీయ మెప్పులు..!
అంతేనా..
అయినపనికి కానిపనికి
టీచర్లే బ్రోచర్లు..
ఎగస్ట్రా విధుల్లో పచార్లు..
మొన్నామధ్య మద్యం దుకాణాల్లోనూ కాపలా..
గురుబ్రహ్మకు అవమానం
మద్యం సీసాల మధ్యన
సిగ్గుతో తల్లడిల్లిన
చదువులమ్మ అభిమానం
ఉపాధ్యాయ వృత్తికే పరిహాసం
“జగ”మొండి సర్కార్ల వికటాట్టహాసం!!!
అయ్యోర్లూ..
మీరూ కాస్త సోచాయించండి..
అప్పుడప్పుడు మీ స్టేటు
రియలెస్టేటా…
అదేమైనా మీ స్టేటస్సా?
మీకుగా రాసుకున్న సిలబస్సా?
గ్రామాల్లో రాజకీయాలు..
అనవసర పంచాయితీలు..
అప్పుడప్పుడు అకృత్యాలు
కొండొకచో నిత్యకృత్యాలు
చెరిపేస్తూ గురువే దైవమన్న
అక్షరసత్యాలు!
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు
గురుదేవో మహేశ్వర
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
ఈ ఆర్యోక్తి ఎప్పటికీ కావాలి
మీ విధం..మీ పథం..
అక్షరమే ఎప్పటికీ ఆయుధం..
అదే మీ శపథం..!
గురువులకు మన్ననతో..శిరస్సు వంచి నమస్సులతో..
– ఇ.సురేష్ కుమార్