Suryaa.co.in

Andhra Pradesh

ఉపాధ్యాయల ఉద్యమ బాట..

నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు:APTF

అమరావతి : సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు .పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఫిట్‌మెంట్‌ 27శాతం ఇవ్వాలని, ఇంటి అద్దె భత్యం కనీసం 12 శాతానికిపైగా ఉండాలని, సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) దశలవారీ పోరాటాలకు పిలుపునిచ్చింది. మంత్రుల కమిటీతో శనివారం రాత్రి జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్‌పై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చర్చల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా ఉండకూడదని, ఇంటి అద్దె భత్యం కనీస శ్లాబు 12శాతం ఉండాలని మంత్రుల కమిటీ ముందు ప్రతిపాదన ఉంచినా పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.ఫిట్‌మెంట్‌ 27శాతం ఉండాలని మంత్రుల కమిటీని కోరినా అది ముగిసిన అధ్యాయమని, దీనిపై సీఎంతోనూ మాట్లాడే అవకాశం లేదని చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలోనే దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశామని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె భత్యం శ్లాబులు, సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన హామీ లభించకపోవడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలిసొచ్చే సంఘాలతో ఉద్యమంలోకి వెళ్లాలని ఫ్యాప్టో నిర్ణయించింది. ఫ్యాప్టో ఛైర్మన్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు అధ్యక్షతన ఆదివారం వర్చువల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధీర్‌బాబు, శరత్‌చంద్ర తెలిపారు. మంత్రుల కమిటీ చర్చలలో ఉపాధ్యాయులు, సీపీఎస్‌ సమస్యలు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా..
సోమవారం నుంచి వారం రోజులపాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
11న జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రాల సమర్పణ
12న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం.

LEAVE A RESPONSE