కేసీఆర్ ఎందుకు ఇంత నాటకమాడారు…???

ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో అంటే ఆయనకు స్వాగతం చెప్పే విషయంలో కేసీఆర్ చాలా నాటకమాడారు.మోడీకి స్వాగతం చెప్పాలని లేకపోతే ఒక స్టాండ్ తీసుకొని దాని మీదనే ఉండాలి. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు. ప్రధాని రెండు కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చారు.

ఒకటి ప్రభుత్వ కార్యక్రమం.అంటే అధికారిక కార్యక్రమం. రెండోది ప్రయివేటు కార్యాక్రమం.అది ముచ్చింతల్ లో రామానుజుల విగ్రహావిష్కరణ.అది వ్యక్తిగతం.ఎందుకు వ్యక్తిగతమంటే అది అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.

ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని హాజరయ్యే అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలి. స్వాగతం పలకాలి. రెండోదానికి ఆయన వెళ్లకపోయినా ఏమీ కాదు.హైదరాబాదుకు వచ్చింది మోడీ అనే వ్యక్తి కాదు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి.అది మోడీ కావొచ్చు.మరొకరు కావొచ్చు…స్వాగతం పలకాల్సింది లేదా గౌరవిచాల్సింది మోడీని కాదు “ప్రధాని”ని…

కానీ కేసీఆర్ ఆ పని చేయకుండా తప్పు చేశారు.ఒక రాజకీయ వివాదానికి తెర తీశారు.మోడీకి స్వాగతం పలికే విషయంలో తర్జనభర్జనలు పడ్డారు.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ మోడీని,ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను దుమ్ము దులిపేశారు.తీవ్ర విమర్శలు చేశారు.అదే సందర్భంలో మోడీ రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా హైదరాబాద్ వస్తున్న ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతానన్నారు.

అంతకుముందు ముచ్చింతల్ వెళ్లి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.కానీ తీరా ప్రధాని వచ్చిన రోజు మాత్రం వెళ్ళలేదు.ప్రధాని పర్యటనకు ముందు నుంచే కేసీఆర్ నరేంద్ర మోడీని ఆహ్వానించడం లేదు వేరొకరిని పంపిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.కాని ఆ తర్వాత సీఎం కార్యాలయం స్పందించి కేసీఆర్ స్వయంగా వెళ్తున్నారంటు చెప్పింది…

కానీ చివరి నిమిషంలో అస్వస్థతతో (జ్వరం) కేసీఆర్ వెళ్లడం లేదు అంటూ మరోసారి ప్రకటించింది.కేసీఆర్ అస్వస్థత కారణంగా కాదు ఉద్దేశపూర్వకంగానే మోడీని ఆహ్వానించడానికి వెళ్లకుండా అవమానించారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు నిజంగానే కేసీఆర్ కు జ్వరం వచ్చిందంటూ టీఆర్ఎస్ నేతలు చెప్పారు.ఇక కేసీఆర్ గైర్హాజరు మాత్రం బీజేపీ – టీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ వేడిని మరింత పెంచింది…

ముఖ్యమంత్రి గతంలోనూ కేంద్రంపై విమర్శలు చేయడం చూశాం. ఎన్ని విమర్శలు చేసినా దేశ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో పార్టీలకు అతీతంగా కేసీఆర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు.కేసీఆర్ కు జ్వరం వచ్చిందనే వార్తలను ఎవరూ నమ్మడంలేదు. అయితే కేసీఆర్ ఎందుకిలా ప్రవర్తించారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది…

ఇది కేసీఆర్ కు వచ్చిన సొంత ఆలోచనా?లేదా ఎవరైనా ఇలా చేయండని సలహా ఇచ్చారా ? అనేది కూడా చర్చించుకుంటున్నారు.వాస్తవానికి ప్రధాని టూర్‌కి వెళ్లకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకుని ఉంటే…కనీసం కేటీఆర్‌ నైనా పంపి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించారు.సరిగ్గా ఇదే సమయంలో ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ పేరుతో సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడం ఆసక్తిగా మారింది. స్వయంగా మంత్రులే ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ పేరుతో ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది…మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నలు సంధించారు.ఇదంతా ముందుగా ప్లాన్ చేశారని అంటున్నారు.

కేసీఆర్‌ గైర్హాజరీకి మరో కారణమూ కనిపిస్తోంది. హైదరాబాద్‌లో మోడీని విమర్శిస్తారు. ఢిల్లీకి వెళ్లి దోస్తీ చేస్తారని విమర్శలు చేసే వారికి చెక్‌ పెట్టే ఎత్తుగడ అన్నది కొందరి అంచనా…ఇదొక్కటే కాదు బీజేపీ రాష్ట్ర టీమ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మోడీతోనే యుద్ధం చేస్తున్నాను, మీరెంత? అనే సంకేతాలను బీజేపీ శ్రేణులకు ఇచ్చినట్లయిందన్న భావన గులాబీ పార్టీలో కనిపిస్తోంది…

ఇదిలావుంటే, బయటకి జ్వరమని చెప్పినా అది సాకే అన్న విమర్శలు బీజేపీ వైపు నుంచి పెద్దయెత్తున వస్తున్నాయి. రాజ్యాంగాన్ని అవమానించారని, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ బీజేపీ ఘాటు విమర్శలు చేస్తోంది…

తాజాగా ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌తో టీఆర్ఎస్ ఓ ఒప్పందాన్ని కుదర్చుకుందని తెలుస్తోంది. 2023 చివరన జరిగే అసెంబ్లీ, 2024లో ఎదుర్కొనబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి అవసరమైన సూచనలు, సలహాలు, వ్యూహాలను రూపొందించాల్సిన బాధ్యతను టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ప్రశాంత్ కిశోర్ చేతికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండటానికి కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు తలెత్తుతున్నాయి..మోడీ వ్యక్తిగత పర్యటన కావడం వల్ల ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదని, దీనికి ప్రొటోకాల్ వర్తించబోదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి…మోడీ పర్యటనకు దూరంగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఓ బలమైన సందేశాన్ని పంపించినట్టవుతుందని టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.కేసీఆర్ రాజకీయ వ్యూహం బాగానే ఉండొచ్చుగానీ, గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్, ఈ వ్యూహంతో ఏమైనా సాధించగలరా?

-రవీంద్ర

Leave a Reply