నా గురువులకు ప్రణామాలు. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడైన అమరజీవి యం.సి. ఆంజనేయులుగారు నన్ను కమ్యూనిస్టు భావజాలం వైపు దారి మళ్ళించారు. నైతికతకు మించిన శక్తివంతమైన ఆయుధంకానీ, సంపదకానీ లేదన్న సత్యాన్ని నా చైతన్యం నిత్యం నా భుజం తట్టేలా కమ్యూనిస్టు ఉద్యమం చేసింది. నైతికత పునాదులపై నిర్మించబడే సమాజం శ్రేష్ఠమైనది, అత్యున్నతమైనది.
సార్వత్రిక నైతిక విలువలు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి, ఔన్నత్యాన్ని మరియు సమాజంలో గౌరవాన్ని పెంచుతాయి. కమ్యూనిస్టు నైతిక విలువల ఆధారంగా మనిషిని మనిషి దోపిడీచేయని సమసమాజ నిర్మాణం మానవాళి చరిత్రలో పతాక ఘట్టంగా నిలుస్తుంది.
నేటి తరం గురువులు, రాజ్యాంగం స్ఫూర్తిని తమ విద్యార్థుల్లో నింపుతూ, “నైతికత”కు ప్రప్రథమ ప్రాధాన్యతనిచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని అంకిత భావంతో నిర్వర్తించి, భావితరాలను నడిపించగలిగితేనే మన దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
మానవ నాగరికతకు నైతిక విలువలు మార్గనిర్దేశం చేశాయి, చేస్తున్నాయి. మానవులు ఎలా కలిసి జీవించారో, వివిధ దశల్లో సమాజాలు ఎలా వ్యవస్థీకృతమై ఉన్నాయో, మానవజాతి పరిణామ క్రమం ఎలా జరిగిందో, చరిత్ర అధ్యయనకారులు శాస్త్రీయ దృక్పథంతో నేటి సమాజం ముందుంచారు. నైతికత ఒక స్థిర నియమావళి కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆయా అభివృద్ధి దశల్లో నైతికత కూడా మార్పు చెందుతూ, సంస్కృతి, మతం, ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థల్లోని మార్పులను ప్రతిబింబిస్తుంది.
నైతికత యొక్క రెండు విస్తృత దృక్కోణాలు మన ముందున్నాయి. సార్వత్రిక నైతిక విలువలు, మానవాళి సమిష్టి పోరాటాలు – చారిత్రక పరిణామ క్రమంలో ఆవిష్కరించబడిన మార్క్సిజం – లెనినిజం భావజాలం నుండి పుట్టిన కమ్యూనిస్టు నైతిక విలువలు, ఈ రెండింటిలోని మంచిని స్వీకరించి, మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాలి.
నైతికత యొక్క మంచి చెడులకు మానవుల చైతన్యం – ఆచరణ కొలబద్దగా నిలుస్తాయి. సమాజ ప్రగతికి అవరోధంగా ఉన్నవి అంతరించిపోతాయి. అత్యుత్తమమైన నైతిక విలువలను పుణికిపుచ్చుకుని మెరుగైన మానవీయ సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా తీర్చిదిద్దగల శక్తి సామర్థ్యాలున్న ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థ ఆవశ్యకత దేశం అజెండాలో మొదటి అంశంగా ఉన్నది. ఇదే! నేటి తరం ముందున్న పెనుసవాలు.
ఒకనాడు నైతికమైనవిగా భావించబడిన కొన్ని విలువలు నేటి ఆధునిక సమాజంలో విమర్శకు గురికావడం సహజమే. అంటరానితనం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, వగైరా దురాచారాలు ఇప్పుడు అనైతికమైనవి, అమానుషమైనవి, చట్ట వ్యతిరేకమైనవి. పురాతనంగా ఆచరించబడిన కొన్ని విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని కొడిగట్టి క్షిణదశలో ఉన్నాయి. కొన్ని బలంగా వెళ్ళూనుకుని ఇంకా ఉనికిలో ఉన్నాయి.
సాంకేతిక, ఆధునిక యుగంలో పుట్టి, పెరిగిన నేటి తరం తన ఆలోచనలకు పదునుపెట్టాలి. శాస్త్రీయ దృక్పథంతో సామాజికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సత్యం, నిజాయితీ, కరుణ, సహనం, మానవుల మధ్య పరస్పర గౌరవంతో కూడిన సంస్కృతి ఎన్నో ఆటుపోట్లకు గురై నిలిచాయి. అలాంటి సార్వత్రిక నైతిక విలువల పట్ల ఆదరణ, మక్కువ సమాజంలో చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్నాయి.
అవి సమాజంలో సామరస్యాన్ని కాపాడతాయన్న బలమైన విశ్వాసం ప్రజల్లో ఉన్నది. కానీ, సమకాలీన సామాజిక – ఆర్థిక పరిస్థితులు మరియు వ్యాపారమయమైన స్వార్థపూరిత – అవినీతి రాజకీయాలతో నైతిక విలువలు మంటకలిసిపోతున్నాయన్న తీవ్ర ఆవేదన సమాజంలో నెలకొన్నది.
మరొక వైపున దోపిడీరహిత, వర్గరహిత, సమానత్వ సమాజాన్ని నిర్మించాలనే భావజాలంతో 20వ శతాబ్దంలో ఉద్భవించిన కమ్యూనిస్టు నైతికత ఆచరణలో సంక్షోభంలోకి నెట్టబడింది. కమ్యూనిస్టు నైతిక విలువలు విప్లవాత్మకమైనవి. కానీ, ఆచరణలో పలచన చేయబడ్డాయన్న మనోవేదన ప్రగతిశీల శక్తుల్లో తరచూ చర్చనీయాంశంగా ముందుకొస్తున్నది.
సార్వత్రిక నైతిక విలువలుకానీ, కమ్యూనిస్టు నైతిక విలువలుకానీ, డబ్బుతో అంగడిలో కొనుక్కొనే సరుకులు కావు. కానీ, నేటి పెట్టుబడిదారీ ప్రపంచీకరణ ప్రపంచంలో, మార్కెట్ ఆర్థిక నీతి, “నైతికత”పై ముప్పేట దాడి చేస్తున్నది. డబ్బు, పదవులు, అధికారం ఉన్న వారు కీర్తి ప్రతిష్టలను అంగడిలో సరుకులుగా మార్చారు. ఈ పెడధోరణి ఒక అంటువ్యాధిగా విస్తరించింది. ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలను మాయ చేస్తున్నారు.
సమకాలీన ప్రపంచంలో పందిని నందిని చేసే శక్తి డబ్బుకున్నదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. అడ్డగోలు అవినీతి, అక్రమాలతో డబ్బు సంపాదించినా, అందులో కొంత దానధర్మాలు చేసి, దేవుళ్ళకు భారీ ముడుపులు సమర్పించుకొంటే కొనియాడబడుతున్నారు. సంపదను ఎలా పోగేసుకున్నా, డబ్బున్న వారిని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెడుతున్నాయి.
డబ్బు, మద్యం ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించాయి. పదవిని, అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నా సమర్థుడుగా, బలమైన నేతగా కొనియాడబడే చైతన్యరహితమైన సమాజంలో జీవిస్తున్నాం. పర్యవసానంగా సార్వత్రిక విలువలు కనుమరుగవుతున్నాయి.
సార్వత్రిక నైతిక విలువలు మరియు కమ్యూనిస్టు నైతికత, రెండింటిలోని ఉత్తమమైన, శ్రేష్ఠమైన వాటిని స్వీకరించి ఉత్తమమైన సమాజాన్ని నిర్మించే వైపు భావితరాల దృష్టని మళ్ళించాల్సిన కర్తవ్యాన్ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారే నిర్వర్తించగలరు. అత్యాధునికమైన, మానవీయమైన, సంపన్నమైన, న్యాయమైన, సమ సమాజాన్ని నిర్మించడంలో నైతికత పాత్ర అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. ప్రగతికి పునాది నైతిక సమాజ నిర్మాణం.
– టి. లక్ష్మీనారాయణ