– సమన్వయ శాఖల అధికారులతో
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ డా. కె.అప్పారావు
– బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ బాల్య వివాహ నిషేధ చట్టం-2006ను పటిష్టంగా అమలుచేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో, బృంద స్ఫూర్తితో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీఎస్‌సీపీసీఆర్) ఛైర్‌పర్సన్ డా. కె.అప్పారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వివేకానందహాల్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఛైల్డ్‌ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో డా. కె.అప్పారావు అధ్యక్షతన బాల్య వివాహాల నివారణపై 18 సమన్వయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. కమిషన్ సభ్యులు జి.సీతారాం, టి.ఆదిలక్ష్మి, జె.రాజేంద్రప్రసాద్ హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో బాల్య వివాహాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపై డా. కె.అప్పారావు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ మూడు నెలల కిందట కొత్త కమిషన్ ఏర్పాటైందని.. బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో 26 జిల్లాల్లోనూ విస్తృత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని.. ఇందులో భాగంగా తొలిసారిగా కాకినాడ జిల్లా నుంచి కార్యక్రమం ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయకూడదన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
చట్టం పటిష్ట అమలుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది.. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ప్రధానంగా గ్రామీణ, గిరిజన, అర్బన్ స్లమ్స్‌పై దృష్టిసారించాలన్నారు. బాల్య వివాహాలపై 1098 (ఛైల్డ్ హెల్ప్‌లైన్), 100 (పోలీస్)కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని తెలిపారు. మండలస్థాయిలో తహసీల్దార్లు ఎప్పటికప్పుడు బాల్య వివాహాల నివారణపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ఉపయోగించుకొని, జన జాగృతి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బాల్య వివాహాలు జరక్కుండా చూడాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ డా. కె.అప్పారావు సూచించారు. కార్యక్రమం సందర్భంగా కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యులు.. అధికారులతో కలిసి బాల్య వివాహాల్ని అరికడదాం.. శీర్షికతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
సరైన కార్యాచరణ ముఖ్యం:
పాఠశాలల్లో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, దిశ యాప్‌పై అవగాహన కల్పించేలా విద్యా శాఖ అధికారులు చొరవచూపాలని కమిషన్ సభ్యులు జి.సీతారాం, టి.ఆదిలక్ష్మి, జె.రాజేంద్రప్రసాద్‌లు సూచించారు. మధ్యలోనే విద్యార్థులు బడి మానేయకుండా చూడటం ద్వారా చాలా సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. బాలలు అమ్మ ఒడి, విద్యా కానుక వంటి పథకాలను ఉపయోగించుకుంటూ సరైన అవగాహనతో ముందుకు నడుస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు.
ఇందుకు సరైన ప్రణాళికల రూపకల్పన, ఆచరణ ముఖ్యమని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో కాకినాడ జిల్లా ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, డీసీపీవో సీహెచ్.వెంకటరావు, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ సూర్య ప్రభావతి, ఛైల్డ్ ఫండ్ ఇండియా ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీపతిరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, మతాల పెద్దలు తదితరులు హాజరయ్యారు.