– తొందరపడి ముందే కూస్తున్న రాజకీయ కోయిలలు
– కమలంలో బండి -ఈటల కుమ్ములాటలు
– సంజయ్‌పై ఈటల పరోక్ష విమర్శనాస్త్రాలు
– పేరు పెట్టకుండానే పరుష పదజాలంతో మాటల దాడి
– అధ్యక్షుడు రోడెడ్డక్కవద్దన్నా ఈటల బేఖాతర్
– కాంగ్రెస్‌లో రేవంత్‌కు మొదలైన ఇంటి సెగ
– రేవంత్ సొంత ప్రచారం బూమెరాంగ్
– ‘మళ్లీ నేనే సీఎం’ అని ఎలా అంటారని నిలదీసిన కోమటిరెడ్డి
– గులాబీ దళంలో అన్నాచెల్లెళ్ల ‘కారు’ చిచ్చు
– అన్న నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న చెల్లెమ్మ
– బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై కవిత-కేటీఆర్ తలోదారి
– సమర్ధించిన కవిత.. వ్యతిరేకించిన కేటీఆర్
– సింగరేణిలో పార్టీని కాదని కవిత సొంత కమిటీ
– తీన్మార్ మల్లన్న మాటల దాడిపై గులాబీ దళాల మౌనరాగం
– చంద్రబాబు భుజం నుంచి రేవంత్‌పై తుపాకీ
– భయపెట్టేందుకు చంద్రబాబుపై మళ్లీ విమర్శల వర్షం
– టీడీపీ తెలంగాణలోకి రాకుండా ముందస్తు ఎత్తుగడ
– మళ్లీ ఆంధ్రా ‘సెంటిమెంట’కు బీఆర్ఎస్ వ్యూహం
– ఎదురుదాడి చేయని తెలంగాణ టీడీపీ
– చేతులు కట్టేయడంతో చేష్టలుడిగిన తెలంగాణ తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ రాజకీయ కోయిలలు తొందరపడి నాలుగేళ్లకు ముందే కూస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకుని.. గులాబీ పార్టీని భూస్థాపితం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. జనంలో ఇమేజ్ ఉన్న ఏకైక నేత రేవంత్ కాంగ్రెస్ సీఎంగా ఉన్నంతవరకూ తనకు రాజకీయ మనుగడ ఉండదు కాబట్టి, ఆయనకు పొగపెడితే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్న వ్యూహంతో బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ వైఫల్యాలతో ఈసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారుకు ఊపిరి పోద్దామన్న బీజేపీ.. ఇలా ఎవరి వ్యూహాలకు వారు పదును పెట్టుకుంటున్నారు. అయితే రామాయణంలో పిడకల వేటలా.. ఈ మూడు ప్రధాన పార్టీల్లోనే అంతర్గత కుమ్ములాటలు, కోవర్టు- కుట్ర రాజకీయాలకు తెరలేవడం సహజంగా ఆసక్తి కలిగించే పరిణామమే. మరి వీటిని అధిగమించి, అవి తమ గమ్యస్థానానికి చేరతాయా? లేవా? అన్నదే కీలకం. ఆ ముచ్చటేదో చూద్దాం.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. సహజంగా ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయ పార్టీలు సరుకు- సరంజామాతో తమ రాజకీయ ప్రత్యర్ధులపై దాడి-ఎదురుదాడి చేసుకుంటాయి. కొత్త కొత్త అస్త్రాలు బయటకు తీస్తుంటాయి. కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, ‘వచ్చే ఏడాదే ఎన్నికల’న్నంత రంజుగా రాజకీయాలు తయారవడమే వింత. ఆ క్రమంలో ఒకరికొకరు వ్యక్తిగత నిందలు-బూతులతో తిట్టుకోవడం రోత.
వాడు.. వీడు.. హౌలేగాడు.. చూసుకుందాం రారా.. కొడకా.. వంటి ‘సంస్కార భాష’ వాడుతున్న వైనాన్ని, తటస్థులైన విద్యావంతులు, మేధావి వర్గం అసహ్యించుకుంటుందన్న సోయి ఏ పార్టీకీ లేకపోవడమే విచారకరం. అసలు ఈ ‘తిట్ల పురాణాల జాతిపిత’ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ సమయం.. ఆ తర్వాత పదేళ్లపాటు, తన రాజకీయ ప్రత్యుర్ధులు-మీడియాపై ప్రయోగించిన ఆ తిట్లను.. శ్రవణానందంగా విన్న తెలంగాణ ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు ఆయన తిట్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్న రేవంత్‌రెడ్డిని.. అదే ‘పదేళ్ల అధికార పార్టీ’, అనాగరిక భాష మాట్లాడుతున్నారని విమర్శించడమే వింత.
అసలు మళ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో గజ్జె కట్టేందుకు.. ఇప్పటికే బోనాల జాతరలో పోతురాజు లెక్క వీరంగమేస్తున్న మూడు ప్రధాన పార్టీలు, అంతర్గత కుమ్ములాటలతో జనం ముందు పలచనవుతున్నా లెక్కచేయకుండా, తమ సొంత అజెండాలు అమలు చేయడం వల్ల, వారి లక్ష్యసాధన ఎంతవరకూ నెరవేరుతుందన్నది ఆయా పార్టీ కార్యకర్తల ఆందోళన.
ముందు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు పరిశీలిద్దాం. గత ఎన్నికలకు ముందు ఐసియులో ఉన్న కాంగ్రెస్‌కు జవసత్వాలు తెచ్చి, ఎన్నికల రణరంగంలో పార్టీని పరుగులు తీయించి అధికారంలోకి తెచ్చిన ఘనత నిస్సందేహంగా రేవంత్‌రెడ్డిదే. తెలంగాణ జాతిపితగా ప్రచారం చేసుకుని, ఆయన పార్టీ వైపే చూసేందుకు భయపడిన రోజుల్లో.. బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టి, ఆ పార్టీ పాలనలోని ప్రజావ్యతిరేత అనే పల్సు పట్టుకుని, కుటుంబపాలన అనే అస్త్రాన్ని సంధించి.. ‘కారు’ను షెడ్డుకు పట్టించిన వ్యూహకర్త రేవంత్ అనడంలో సందేహం లేదు. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నిష్ఠుర నిజం.
ఇప్పటికీ కాంగ్రెస్‌లో చాలామంది అగ్రనేతలు స్వయంభువులే తప్ప, జననేతలు కాదు. అందులో కులం-ప్రాంతం-ఢిల్లీలో లాబీయింగులతో మనుగడ సాగిస్తున్నవారే ఎక్కువ. కాంగ్రెస్ గాలి వీస్తేనే మెరిసే నేతలు బోలెడుమంది. ఈ బాపతు నాయకులకు స్థానికంగా పలుకుబడి పలచన. అయితే ఢిల్లీలో మాత్రం వీరు వెలిగిపోతుంటారు. అక్కడి నుంచే కథ నడిపిస్తుంటారు.
రేవంత్ అందుకు భిన్నమైన నేత. ఆయన స్ట్రైట్ ఫైటర్. కసి-పట్టుదల-టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిన రాజకీయ ఆసామి. టీడీపీ స్కూల్లో అన్నీ నేర్చుకుని పీహెచ్డీ పట్టా తీసుకుని, కాంగ్రెస్ యూనివర్శిటీలో వైస్ చాన్సలర్ అయిన చిచ్చరపిడుగు. ఉమ్మడి ఆంధ్రలోగానీ- ఇప్పటి తెలంగాణలో గానీ.. కాంగ్రెస్‌లో వైఎస్ తర్వాత, రేవంత్‌ను మించిన క్రౌడ్‌పుల్లర్ మరొకరు లేరన్నది మనం మనుషులం అన్నంత నిజం.
కాకపోతే ప్రతి మనిషికి తన ప్రతిభ మీద తనకు అతి అంచనాలున్నట్లే, రేవంత్‌కూ తనపై తనకు మితిమీరిన అంచనాలున్నాయన్నదీ అంతే నిజం. స్వతంత్ర అభ్యర్ధిగా జడ్పీటీసీ గెలిచిన నాటి నుంచి.. సీఎం వరకూ ఆయన పరిణామ క్రమం, దగ్గరనుంచి పరిశీలించిన వారికెవరికయినా ఇది ఇట్టే అర్ధమవుతుంది. కానీ సీనియర్లను కాదని తాను సీఎం పదవి సాధించినప్పటికీ, తనపై ప్రత్యర్ధులు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసే సన్నిహితులు, సీనియర్లే కరవు. అందుకే రేవంత్ కాంగ్రెస్‌లో ఒంటరిగా మిగిలారన్నది సీనియర్ల ఉవాచ.
ఇప్పుడు రేవంత్ చుట్టూ ఉన్న వారిలో ప్రతిభ కంటే, ఆయన వ్యక్తిగత మిత్రులే ఎక్కువ. వారికి రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదు. వారికి స్థానికంగా ఉన్న పలుకుబడీ తక్కువే. ఒక జిల్లా కాదు కదా, కనీసం ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేయలేని వారినే ఆయన అందలమెక్కించారన్నది నిష్ఠుర నిజం. అందులో కాంగ్రెస్ గాలికి గెలిచినవారే ఎక్కువన్నదీ అంతే నిజం. రేవంత్‌కు కులాభిమానం ఎక్కువన్నది మరో ఆరోపణ. గతఏడాది నుంచి జరుగుతున్న నియామకాలు కూడా వాటినే నిరూపించడం ఒక మైనస్ పాయింట్. పార్టీకి దమ్మడీ పనిచేయని వారికి ఢిల్లీ స్థాయి పదవులివ్వడం బట్టి, రేవంత్ ఆలోచనా స్థాయి ఏమిటన్నది అర్ధమవుతుంది.
రేవంత్ ఇప్పుడున్న సీనియర్లలో సబ్ జూనియర్. ఆయన సమకాలీకులు కూడా ఎవరూ లేరు. అందువల్లే రేవంత్‌పై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ముప్పేటదాడి చేస్తున్నా, ఎదురుదాడి కనిపించడం లేదు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన వారు తప్ప, తొలి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు రేవంత్‌కు దన్నుగా రావడం లేదు. పైగా కాంగ్రెస్ నాయకత్వం కూడా పాత పద్ధతిలోనే, అందరినీ ప్రోత్సహించే వ్యూహాన్ని అమలుచేస్తూనే ఉంది. అంటే రేవంత్ ఎంపిక వైఫల్యం ఏమిటన్నది కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడు రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయాలనే సవాల్ చేస్తూ.. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కోర్టుకు వెళుతున్న పరిస్థితి. కాంగ్రెస్‌లో టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించే ధిక్కార పరిస్థితి. ఆంధ్రా వాళ్లకే కాంట్రాక్టులిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్న వైనం. ఇవన్నీ రేవంత్ సీఎం అయినప్పటికీ, పార్టీపై పట్టులేదన్న నిదర్శనాలే.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ప్రశ్నించిన పరిస్థితి. మళ్లీ తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను, చూపుడువేలితో ప్రశ్నించిన కోమటిరెడ్డి వ్యాఖ్యలకు జవాబు ఇవ్వలేని ఇరకాటం. డబ్బులిచ్చి సీఎం పదవి కొనుకున్నారంటూ గతంలో ఇదే రేవంత్‌పై ఆరోపణలు చేసిన కోమటిరెడ్డిపై నాయకత్వం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్‌కు ఢిల్లీలో ఎంత పలుకుబడి ఉందన్నది చెప్పకనే చెప్పింది.
ముందుగా చెప్పుకున్నట్లు.. ఒక స్థాయికి వెళ్లిన వారికి, త మపై తమకు అతి అంచనాలుంటాయి. అందుకు రేవంత్ మినహాయింపు కాదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, ప్రత్యర్ధులపై చులకల భావం, కాలం తనకు కలసి వస్తున్నందున తాను ఏం చేసినా చెల్లుతుందన్న అతి విశ్వాసం ఉన్న నేతలంతా ఎక్కడో ఒక చోట తప్పులో కాలేస్తారు. రేవంత్ చేసిందీ అదే. నిజానికి కాంగ్రెస్‌లో వచ్చేసారి కూడా తానే సీఎంగా ఉంటానని చెప్పిన మొనగాడు ఎవరూ లేరు. ఆ ఏడాది గడిస్తే గొప్ప.
ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి ఇద్దరు సీఎంలను మార్చిన ఘటన కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసిన వైఎస్, అంతకుముందు చెన్నారె డ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గానీ ఇంత గర్వం ప్రదర్శించిన దాఖలాలు లేవు. అయినా చెన్నారెడ్డి, కోట్ల లాంటి వారికి పదవీచ్యుతి తప్పలేదు. కాలం తనకు కలసి వస్తున్నందున, తన కత్తికి ఎదురులేదనుకుని వ్యవహరించడం అమాయకత్వమే కాదు. అహంకారం కూడా! ఇప్పుడు రేవంత్ అలాంటి అహంకారం ప్రదర్శించారన్నదే కోమటిరెడ్డి ఆగ్రహంతో కూడిన అభ్యంతరం.
నిజానికి కాంగ్రెస్‌లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాక ర్ వంటి సీనియర్లంతా సీఎం పదవికి అర్హులే. వీళ్లంతా రేవంత్‌కు సూపర్ సీనియర్లు. వీళ్లెవరూ కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీని వీడిన వారు కాదు. అయితే కొందరు అప్పట్లో కేసీఆర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేశారన్న ఆరోపణలుండేవి. అది వేరే విషయం. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు ఖండించిన రాజగోపాల్‌రెడ్డి కూడా, కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారి, మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినవారే. అది వేరే విషయం.
అలాంటి నేపథ్యం ఉన్న కాంగ్రెస్ సంస్కృతిని తెలుసుకోకుండా.. మళ్లీ తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ ప్రకటన అత్యుత్సాహం.. మితిమీరిన తెలివితేటలకు నిదర్శనమన్నది సీనియర్ల ఉవాచ. విచిత్రంగా.. సీఎం రేవంత్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకూ ఏ ఒక్క మంత్రి గానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే గానీ ఖండించలేదు.
సోదరుడు వెంకటరెడ్డి కూడా ఖండించకపోగా.. రోజూ రేవంత్ వెంట ఉండే ఉమ్మడి నల్లగొండ నేతలు కూడా నోటికి తాళాలు వేసుకోవడమే విచిత్రం. చివరకు రేవంత్ భిక్షతో పదవులు పొందిన వారు కూడా, ఈ పంచాయతీ తమకెందుకన్నట్లు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో పరిస్థితి అలాగే ఉంటుంది. అది తెలుసుకోకపోవడమే రేవంత్ అమాయకత్వం.
కానీ కాంగ్రెస్‌ను శాసించిన వైఎస్ హయాంలో, ఇలాంటి తిరుగుబాట్లు భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. విపక్షాలపై ఎదురుదాడి చేసి, ప్రాంతాలతో సంబంధం లేకుండా వైఎస్‌కు రక్షణ కవచంలా నిలిచిన మంత్రులు బోలెడు. కన్నా, ధర్మాన, రఘువీరా, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నాల, నాగేందర్, సబితా వంటి విధేయులు జిల్లాకు డజను మంది ఉండేవారు. కానీ రేవంత్‌కు అలాంటివారెవరూ లేరంటే, అది ఆయన ఎంపిక లోపమేనన్నది నిష్ఠుర నిజం.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం- గత ఆరేడునెలల క్రితం వరకూ జనసామాన్యంలో జరిగిన చర్చ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు లోపాలు, వరసగా కళ్లెదుట జరుగుతున్న దారుణాలే దానికి కారణం. కేసీఆర్ కుటుంబపాలన, అహంకార వైఖరి కారణంగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపించిన జనాలు, గత ఆరేడునెలల క్రితం వరకూ మళ్లీ బీఆర్ఎస్ వైపు చూశారన్నది నిఖార్సయిన నిజం.
కానీ అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు.. శత్రువులు ఎక్కడో ఉండరు. మన ఇంట్లోనే మన చుట్టూ ఉంటారన్నట్లు, బీఆర్ఎస్ ఆ సానుకూల పరిస్థితిని కొనసాగించుకోవడంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఆ స్థానం కోసం బీజేపీ పెనుగులాడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ఉత్తరాధికారిగా అన్న కేటీఆర్‌ను ఒప్పుకునేది లేదని, తెలంగాణ జాగృతి చెల్లెమ్మ బాపూకే లేఖ రాసిన పరిస్థితి.
ఒకవైపు బీసీలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను చెలెమ్మ కవిత సమర్థిస్తే, కేటీఆర్ అన్నియ్య వ్యతిరేకిస్తున్న వైచిత్రి. సింగరేణిలో ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘం ఉంటే, చెల్లెమ్మ సొంతగా జాగృతి చేసిన మరో వైచిత్రి. బీఆర్ఎస్ జెండా లేకుండా తన సొంత బ్యానర్‌పై కార్యకలాపాలు సాగిస్తున్న కవిత స్పీడుకు బ్రేకులు వేయలేని తెలంగాణ జాతిపిత పరిస్థితి తలచుకుంటే జాలి వేయకతప్పదు. తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సొంత పార్టీ వారెవరూ గళమెత్తకపోవడం మరో వింత.
ఇంత ఇంటిపోరును పక్కనపెట్టి.. మళ్లీ ‘సెంటిమంట’ రగిల్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగించేవే. ముందు కవిత ఆంధ్రా బిర్యానీపై వ్యాఖ్యలు చేస్తే, తర్వాత ఆంధ్రా కాంట్రాక్టర్లపై విరుచుకుపడ్డారు. అయితే విచిత్రంగా పదేళ్ల తెలంగాణ జాతిపిత పాలనలో కూడా, అదే ఆంధ్రా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దక్కిన వైనాన్ని కవితక్క విస్మరించడమే వింత. బనకచర్ల అంశంపై సీఎం రేవంత్‌ను లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్, ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది.
ఒకటి నేరుగా రేవంత్ వైఫల్యాన్ని ఎండగట్టడం. రెండు ఏపీ సీఎం చంద్రబాబు భుజంపై నుంచి, రేవంత్‌పై తుపాకీ ఎక్కుపెట్టడం. తెలంగాణకు రావలసిన జలాలను రేవంత్ తన గురువైన చంద్రబాబుకు ధారాదత్తం చేసి, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్న ప్రచారం హోరెత్తిస్తోంది. అయితే రేవంత్ కూడా కేసీఆర్ కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన అఘటనాఘట సమర్ధుడు కావడంతో, గులాబీదళాల వ్యూహాలు పారడం లేదు.
అందుకే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాటి ఏపీ సీఎం జగన్‌కు గోరుముద్దలు తినిపించి, సీమకు జలాలు ధారాదత్తం చేశారంటూ రేవంత్ విరుచుకుపడుతుంటే, బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి. నాటి మంత్రి రోజా ఇంటికి వెళ్లి నాన్ వెజ్ తిన్న తర్వాత.. రాయలసీమను రత్నాలసీమ మారేందుకు సహకరిస్తామన్న తెలంగాణ జాతిపిత హామీ.. జగన్‌తో లంచ్ బ్రేక్ తర్వాత బేసిన్లు లేవు భేషజాలు లేవన్న కేసీఆర్ విశాల హృదయాన్ని, రేవంత్ ఇప్పటికి డజనుసార్లు ఆవిష్కరించడం. అసలు పార్టీలో తెలంగాణ పేరు తొలగించిన కేసీఆర్‌కు తెలంగాణతో పేరు బంధం-పేగు బంధం ఏమిటని ప్రశ్నించడంతో గులాబీదళం ఆత్మరక్షణలో పడటం సహజం.
తన మీడియా ద్వారా బీఆర్ఎస్ను బలహీనం చేయాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న ‘రాజగురువు’ రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఆంధ్రజ్యోతి పేరులోని ఆంధ్రను తొలగించి, తెలంగాణ జ్యోతిగా మార్చాలన్నది తాజాగా బీఆర్ఎస్ లేవెనెత్తిన మరో సెంటిమంట. ఆంధ్రా మీడియా ఎవరి తిండి తింటున్నారన్నది జగదీష్‌రెడ్డి వేసిన మరో ప్రశ్న. రైటే. రాజగురువు గారి ఆవేదన ప్రపంచం ఆవేదన కాబట్టి.. ఆయన ఎవరిని అనుగ్రహిస్తే వారిని, ఎవరిపై ఆగ్రహిస్తే వారిని వెంటాల్సిందే.
మరి తెలంగాణ జాతిపిత సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభ సహా, ఆంధ్రా నేపథ్యం ఉన్న చానెళ్లు, పేపర్లకు ఎందుకు ప్రకటనలు ఇచ్చారు? ఆంధ్రా ఎడిషన్లకూ ప్రకటనలు ఎందుకు ఇచ్చారు? మేఘా కృష్ణారెడ్డి, పీఎల్ఆర్ సహా రాయలసీమ వైసీపీ నేతలకు ఎలా కాంట్రాక్టులిచ్చారు? అసలు మీ పార్టీలోని తెలంగాణ పదాన్ని తీసేసిన మీరు, ఏ హక్కుతో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు? మీ పార్టీలోని తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించారో చెప్పాలన్న డిమాండ్‌కు జవాబు చెప్పేవారెవరు?
ఇక బీఆర్ ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్ కొడుకు- మేనల్లుడు సహా విదేశాల్లో చదువుతున్న బీఆర్ఎస్ నాయకుల వారసులు ఎవరి తిండి తింటున్నారు? వారికి రోజూ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బిర్యానీలు పార్శిల్స్ పంపిస్తున్నారా? లేక ఆ దేశంలో దొరికే ఫుడ్డే తిని బతుకుతున్నారా? అన్న ప్రశ్నలు, ఇటీవలి కాలంలో సోషల్‌మీడియా వేదికగా సంధిస్తున్న వారికీ సమాధానం చెప్పేవారులేరు.
ఇలా గత కొద్దినెలల నుంచి చంద్రబాబునాయుడు లక్ష్యంగా కేటీఆర్, హరీష్‌రావు, కవిత, జగదీష్‌రెడ్డి వంటి అగ్రనేతలు చేస్తున్న దాడులు పరిశీలిస్తే.. టీడీపీ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టకూడదన్న వ్యూహమే కనిపిస్తోందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. గ్రేటర్ ఎన్నికల నుంచి టీడీపీ ఎన్డీఏ కూటమితో కలసి పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతున్నదే. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలసి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా టీడీపీ మద్దతుకోరినట్లు ప్రచారం జరిగింది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ-టీడీపీ-జనసేన కలసి పోటీచేస్తే.. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ప్రభావం ఉంటుందన్న ముందుచూపుతో, ఇప్పటినుంచే టీడీపీని మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌తో భయపెట్టాలన్న మైండ్‌గేమ్, బీఆర్ఎస్ నేతల ప్రకటనలతో స్పష్టమవుతోంది. టీడీపీ విడిగా పోటీ చేస్తేనే బీఆర్ఎస్కు లాభమన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
భయపెడితే గతంలో మాదిరిగానే చంద్రబాబు భయపడి ఎన్నికలకు దూరంగా ఉంటారన్న వ్యూహంతోనే.. టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ. అందుకే చంద్రబాబుపై ఇంత దాడి జరుగుతున్నా తెలంగాణ తమ్ముళ్లు మౌనంగా ఉన్నారు. తెలంగాణలో అసలు పార్టీ ఉందో లేదో.. బీఆర్ఎస్ను విమర్శించాలో లేదో.. కాంగ్రెస్‌ను వ్యతిరేకించాలో లే దో కూడా తెలియని విచిత్ర పరిస్థితి వారిది.
పోనీ అంతర్గతంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ కంటే బీజేపీ పరిస్థితి ఏమన్నా మెరుగ్గా ఉందా అంటే అదీ లేదు. క్రమశిక్షణకు ఆరోప్రాణంగా చెప్పుకునే బీజేపీలో తాజాగా ఎంపి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, బీజేపీ కూడా ఆ తానులో ముక్కగానే అర్ధమవుతుంది. తన పాత నియోజకవర్గంలో కేంద్రమంత్రి బండి సంజయ్ తనకు పొగపెడుతున్న వైనాన్ని గ్రహించిన ఈటల, తాజాగా ఆయనపై పరుష పదజాలంతో ధ్వజమెత్తడం కమలదళాలను కలవరపరిచింది. పేరు పెట్టి విమర్శించకపోయినా, ఆయన సంజయ్‌నే లక్ష్యంగా చేసుకుని, దూషించినట్లు మెడపై తల ఉన్న ఎవరికయనా అర్ధమవుతుంది.
నిజానికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి వేగంగా మెరుగవుతోంది. బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలన చూసి తటస్థులు-విద్యావంతులు-యువకులు బీజేపీ వైపు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. పోరాటాలకు మారుపేరైన ఏబీవీపీ నుంచి వచ్చిన న్యాయవాది రామచందర్‌రావుకు రాష్ట్ర పగ్గాలు వచ్చిన తర్వాత, పార్టీకి ఆక్సిజన్ అయిన హిందుత్వ నినాదం మళ్లీ మొదలయింది.
ఈ క్రమంలో ఈటల చేసిన వ్యాఖ్యలు, బీజేపీ ఇమేజీకి డ్యామేజీనేనన్నది కమలదళాల ఆందోళన. ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చిన ఈటల, తాను జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న స్పృహ మరిచి.. మీడియాలో సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రిపైనే పరుషపదజాలం వాడటాన్ని సంప్రదాయ బీజేపీవాదులు జీర్ణించుకోలేపోతున్నారు.