Suryaa.co.in

Telangana

తెలంగాణ బడ్జెట్‌ హరీష్‌ అంత పొడుగుంది!

-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యంగ్యాస్త్రాలు
-అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం

ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎంత పొడుగ్గా ఉన్నారో 2023-24 బడ్జెట్ ను కూడ అంతే పొడుగ్గా పెట్టారు.2014-15 సంవత్సరంలో లక్షా కోట్లతో మొదలైన బడ్జెట్ 2023-24 నాటికి 2,90,396 కోట్లకు పెంచారు. చాలా సంతోషం కానీ బడ్జెట్ లెక్కలు వాస్తవాలకు దగ్గరగా లేవు. 2.90 లక్షలకు పెంచినటువంటి బడ్జెట్ తో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆశీంచారు. రాష్ట్ర ప్రజలు ఆశీంచిన వెసలుబాటు కనిపించడం లేదు.బడ్జెట్ అంకెలు సైతం అనుమానస్పదంగా ఉన్నాయి. రెవెన్యూ వసూళ్లు 2,16, 506 కోట్లు కేటాయించారు. స్వీయ పన్నుల రాబడి ద్వారా 1.31లక్షల కోట్లు వెచ్చించారు. గత బడ్జెట్ కేటాయింపుల కంటే సుమారు 40వేల కోట్లు అధనంగా పన్నుల రాబడి పెరుగుతుందని అంచనా చూపించారు. పన్నలు రాబడి ఆదాయం పెరగడానికి ఏమైన పన్నులు వేస్తారా? వేయబోతున్నారా? పన్నుల రాబడి ఆదాయం ఎట్లా పెరుగుతుంది.

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపించారు. కానీ కేంద్రం ప్రతి ఏడాది కూడ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.8 నుంచి 10వేలు మాత్రమే ఇస్తున్నది. అంటే ఇందులో 30వేలు రావన్నమాటే కదా? పన్నుల రాబడిలో 40వేల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల్లో 30వేల కోట్లు మొత్తం దాదాపు 70వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా చూపించడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు.

ఈ బడ్జెట్ లో కూడా అప్పలు 46,317 కోట్లు తెస్తామని చూపించారు. ఈ అప్పుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు రూ.3.57లక్షల కోట్లకు చేరుకుంటుండగా గ్యారంటీలు, కార్పేరేషన్ల పేరిట తీసుకువచ్చిన అప్పులు 1.29కోట్లు మొత్తం 4.86 కోట్ల అప్పు ల భారం ప్రజలపై మోపడం సరికాదు. దాదాపుగా రూ.5లక్షల కోట్లు మేర చేసిన అప్పులు ఎవరు కట్టాలి. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తలసరి ఆదాయం 1,40,840 కోట్ల నుంచి 2023-24 నాటికి 3.17.115 లక్షల రూపాయల తలసరి ఆదాయం పెరిగిందని గొప్పగా చెబుతున్నారు.
కానీ ఆదాయం పెరిగింది ఎవరిది? పేద ప్రజలది పెరిగిందా? సామాన్యులది పెరిగిందా? అంటే సంపన్నులది పెరిగింది. టాప్ 10లో దివిస్ ల్యాబ్స్ అధినేత మురళి దివి 56,200 కోట్లు, హెట్రో ల్యాబ్స్ అధినేత బి. పార్థసారధిరెడ్డి 39,200 కోట్లు, ఎం ఎస్ ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత16000 కోట్లు, జీఏఆర్ అధినేత ఆమరేందర్ రెడ్డి 15000 కోట్లు, మై హోం ఇండస్ర్టీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు 13,300 కోట్లు, మెఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ర్టక్చర్ అధినేతలు పిచ్చిరెడ్డి 12,600 కోట్లు, పి.వి కృష్ణారెడ్డి 12,100 కోట్లు ఇలా వీరి ఆస్తులు పెరుగుతున్నాయి. ఇండ్లు లేని వారికి ఇండ్లు, ఇంటి స్థలాలు, బానిసల్లా బతుకుతున్న వారు తలెత్తుకొని జీవించే ఆత్మగౌరవం ఇలా తెలంగాణ ఏర్పడిన ఉద్దేశ్యాలు చాలా గొప్పగా ఉన్నాయి.

గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో పీపుల్ మార్చ్ పేరిట ముదిగొండ మండలం గందసిరి గ్రామంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఒక ప్రియాంక అనే మహిళ వచ్చి నా చెయ్యి పట్టుకొని ఆపింది. కండ్లల్లో ఉబికివస్తున్న కనీళ్లను ఆపుకుంటూ సార్ మాకు ఇంటి స్థలం ఇప్పించమంటూ ప్రాదేయపడింది. నేను నాభర్త, మా అత్త మామ, వాళ్ల అత్త మామాలు మూడు కుటుంబాలు ఈ చిన్న గదిలో కాపురం చేస్తున్నామని ఆమె చెప్పింది. మీరు చూపిస్తున్న తలసరి ఆదాయం ఆమెకు ఎందుకు పెరగలేదు అని అడుగుతున్నాను. ఇలాంటి వారు రాష్ర్టంలో ఎంతో మంది ఉన్నారు. వీరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండ ఆదాయం పెరిగిందనడం సరికాదు. పాలకులు ఎప్పుడూ విశాల దృక్పదంతో ఉండాలి.

కేంద్ర సర్కార్ పై భట్టి ఫైర్
కేంద్రం ప్రవేశ పెట్టిన 45లక్షల కోట్ల బడ్జెట్ లో 15లక్షల కోట్లు అప్పులు చూపింది.రాష్ట్ర విభజన హక్కుల చట్టం ప్రకారం ఖాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్శిటీ, ఐటిఐఆర్ ఇలా ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇద్దామన్న ఆలోచన చేయలే. తెలంగాణకు ఇచ్చింది గుండు సున్న. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యకలపాలకు నిధులు ఇవ్వకపోగా అడిగితే కేసులు, మాట్లాడితే ఐటీ, ఈడీ, సిబి ఐ వస్తయి. ప్రభుత్వాలకు ప్రభుత్వాలనే కూల్చివేస్తది. ప్రశ్నిస్తే మనుషులకు మనుషులనే లోపలేస్తది.. ప్రజస్వామ్యమే లేకుండా మోడీ నియంతృత్వ పాలన చేస్తున్నడు.దేశంలో పేదలు నిరుపేదలుగా మారుతుంటే ధనవంతులు సంపన్నులుగా ఎదుగుతున్నారు. ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి. మతం పేరిట దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి విచ్చిన్నకర శక్తులు చేస్తున్న కుట్రల నుంచి దేశాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి కన్యకూమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.

రాహుల్ పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. పేదలు, కూలీలు, రైతులు, యువత పెద్ద ఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలికి హక్కున చేర్చుకున్నారు.దేశం దోపిడి పాలవుతుందని, సంపదను ప్రధాని మోడీ ఆదానికి దోచి పెడుతున్నారని పాదయాత్రలో ప్రజలు రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు.ప్రపంచమే ఆశ్చర్యం పోయేట్టుగా హిండెన్ బర్గ్ ఆధాని ఆర్ధిక నేరాన్ని బట్టబయలు చేసింది.దేశాన్నే కాదు. ప్రపంచాన్నే మోసం చేసిండు. దేశాన్ని లూఠి చేసిండు. ఆదానిపై దాడి దేశం మీద దాడి అనడం సరికాదు. ఇండియా అంటే ఆదాని? ఆదాని అంటే ఇండియా మాత్రమేనా? ఇండియా అంటే ఆదాని, అంభాని, మోడీ, అమిత్ షా మాత్రమే కాదు. తమ రక్తాన్ని చెమటగా చిందించి ఉత్పత్తి సృష్టించిన కోట్లాది ప్రజలది ఈ దేశం. ఈ విషయాన్ని విమర్శకులు గ్రహించాలి.

దేశంలో తెలంగాణ కూడ అంతర్భాగమే. ఆదాని చేసిన ఆర్ధిక నేరం వల్ల ఎల్ఐసి, ఎస్ బి ఐ సంస్థల్లో తెలంగాణ ప్రజలు దాచుకున్న డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది.మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఆధానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. దేశ సంపదను మోడీ ప్రభుత్వం క్రోని క్యాప్టలిస్టులకు దోచి పెడుతుంది. కట్టడి చేయకుంటే ఇది దేశానికి ప్రమాదం.దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, ఆసుపత్రలు కట్టింది. రోడ్లు వేయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. యూజీసి తీసుకొచ్చింది. ప్లానింగ్ కమిషన్ వేసింది. అందరికి సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించింది.

మిశ్రమ ఆర్ధిక విధానాల ద్వారా ఆస్తులను సృష్టిస్తే… అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఆస్తులను అమ్ముతున్నారని మండిపడ్డారు.ఎయిర్ పోర్టు సంస్థలను అనుభవం లేని సంస్థలకు, రెండుకు మించి ఎవ్వరికి ఇవ్వోద్దనే నిబంధన ఉన్న ఆదానికి 6 ఎయిర్ పోర్టులను ప్రధాని మోడీ కట్టబెట్టారు. ఇప్పటికే సర్వీస్ సెక్టర్, ఇన్ ఫ్రా సెక్టర్, కోల్ బ్లాక్ లను అమ్మేశారు.వ్యవసాయ రంగాన్ని కూడ కార్పోరేట్ అగ్రికల్చర్ గా తీసుకొచ్చి అమ్మాలనే కుట్ర జరుగుతున్నది. ఇదే జరిగితే దేశం ప్రజస్వామ్యం, రాజ్యంగం చేతుల్లో ఉండదు.కార్పోరేట్ చేతుల్లో పెట్టి వారి దయ దాక్షిణ్యాలపై బ్రతికే విధంగా బిజెపి చేస్తున్నది.

నల్లరైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడే కేంద్రం ధరల నియంత్రణ చట్టాన్ని ఎత్తివేయడం వల్ల కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చింది. దేశంలో ఎక్కడనైన కొనుక్కో… గోదాముల్లో దాచుకో.. వస్తువుల కొరత పెంచి అధిక ధరలకు అమ్ముకో అని కార్పోరేట్లకు అనుకూలంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నది.మతం మత్తు లాంటిది. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.మతం మత్తు దేశానికి అత్యంత ప్రమాదకరం, మతం మత్తు మందు అన్నందుకే సోక్రటీస్ కు విషమిచ్చి చంపారు.

సభ దృష్టికి ప్రజల సమస్యలు
భూమి లేని నిరుపేదల కోసం ఈ బడ్జెట్ లో ఆలోచన చేయాలి. ఇంటి స్థలాలు, భూ పంపిణీ జరుగాలి.
ధరణిలో కాస్తు కాలం లేకుండ చేయడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు
గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమిని గుంజుకుంటే ఎట్లా? ఇబ్రహీంపట్నంలో 7,8 వేల ఎకరాల ఆసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడం సరికాదు. హైదరాబాద్ చుట్టు దలితులు, బడుగులకు ఇచ్చిన ఆసైన్డ్ భూములను బలవంతంగా తిరిగి తీసుకొని హెచ్ఎండిఏతో రియల్ వ్యాపారం చేయడం ఏంటీ? ఒక పేదవాడి నుంచి కూడ బలవంతంగా భూములు గుంజుకోవద్దు. యువత లక్షల సంఖ్యల్లో ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉద్యోగాలు రాకపోవడంతో పెండ్లీలల్లో సప్లయర్స్ గా పని చేస్తున్నారు.యువతకు ఉద్యోగాలైన ఇవ్వండి. లేకుంటే స్వయం ఉపాధి చేసుకోవడానికి బడ్జెట్లో నిధులు కేటాయించండి.

రాష్ట్రంలో మధ్యం అత్యంత సమస్యగా మారింది. గల్లీ గల్లీకో బెల్ట్ షాపు లు పెట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచారు. విచ్చలవిడి మధ్యం అమ్మకాలను అరికట్టాలి. హైదారాబాద్ చుట్టూ ఇండ్ల స్థలాల ధరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో లేవు. హౌజింగ్ బోర్డు లాంటి సంస్థను ఏర్పాటు చేసి పేద, సామాన్యులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాట్ లైట్ టౌన్ షిప్ గురించి ఆలోచన చేయాలి. యూనివర్శీటీల్లో పిహెచ్ డి, ఎం ఫిల్, మాస్టర్ చేస్తున్న పేదలు ఆర్ధికంగా వెనుకబడి ఉన్న మేదో పరంగా ముందున్నారు. వీరిని భవిష్యత్తు మానవ వనరులుగా గుర్తించి మెస్ బిల్లులు పెంచండి. రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్న బిసిలకు కేవలం రూ.6వేల కోట్లు కేటాయించడం సహేతుకం కాదు. రాష్ట్ర జిడిపి పెరగడానికి కారణమైన బడగుల బడ్జెట్ పెంచండి.

తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా తరగతి గదులను పెంచకపోవడం వల్ల విధ్యార్థులు చదవడం, పడుకోవడం ఒకే తరగతి గదిలో జరుగుతున్నది. రెసిడెన్షియల్ స్కూళ్లను భవిష్య త్తులో ఐటిఐ. పాలిటెక్నిక్ , ఇంజనీరింగ్ కళశాలలుగా అప్ గ్రేడ్ చేయండి. వాల్మీకి కులస్తులు కూడ గిరిజనులే. వారిని బిసిల జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి మార్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించిన రంగారెడ్డి- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టేకప్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటీ? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? కృష్ణా ప్రాజెక్టులపై ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని డిపిఆర్ లు సబ్మిట్ చేశారు? ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి? ఎన్ని టిఎంసి నీళ్లకు క్లియరెన్స్ వచ్చింది? ఈ వివరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేసి 10 టిఎంసి నీళ్లను డైవర్ట్ చేసుకొని వెళ్లితే నాగార్జున్ సాగర్ ఎడమ కాలువపై ఆదారపడి సేద్యం చేస్తున్న ఖమ్మం జిల్లాలోని మధిర, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాలు ఏడారిగా మారే ప్రమాదం ఉంది. నీళ్ల దోపిడీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు? నిధులు ఎన్ని ఇచ్చారు? మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎన్ని? వీటికి మెయింటేనెన్స్ ఎంత? విద్యుత్ చార్జీలు ఎంత? అన్న విషయాలను చెప్పాలని కోరారు. ఈమూ బర్డ్స్ పెంచిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారి అయిన అప్పుల్లో సగం ప్రభుత్వం భరించాలి. చెరువులపై ఆదారపడి జీవిస్తూ మత్స్య సంపదను పెంచడం కోసం పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మత్య సోసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలి.

ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. చాలా ఆసుపత్రులు డెస్క్ లను సైతం తీసివేశారు. ఇటీవల తన నియోజకవర్గానికి చెందిన పద్మ అనే మహిళ ప్రయివేటు ఆసుపత్రిలో క్యాన్సర్ కొరకు ట్రీట్ మెంట్ తీసుకుంటే 9లక్షల రూపాయల బిల్లు వేశారు. పేద వాళ్లు ఎక్కడి నుంచి లక్షలకు లక్షల రూపాయాలు కడుతారు. వాళ్లకు ఉన్న ఇండ్లు, భూములు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలి. ధరలను నిర్ణయించి వాటిని అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
చైతన్య, నారయణ విద్య సంస్థలు కూడ దోపిడి చేస్తున్నాయి. వాటిల్లో ఏలాంటి వసతులు లేకున్న వేలకు వేలు ఫీజుల భారం మోపి ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పకడ్భందీగా అమలు చేయాలి. కార్పేరేట్ సంస్థలను కట్టడి చేయకుంటే రాష్ట్రానికి ప్రమాదమని ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలో 90శాతం పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు పెద్ద పీట వేసే విధంగా బడ్జెట్ ఉండాలి. భ్రమల్లో ఉండే విధంగా బడ్జెట్ ఉండకూడదు.తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలు, లక్ష్యాలు, ఆశలు ,ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించాలని మనవి చేస్తున్నాను.

LEAVE A RESPONSE