మానవ మనుగడకు చెట్లు జీవనాడులన్నారు రాజ్యసభపక్షనేత కె. కేశవరావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కె. తారకరామారావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆధ్వర్యంలో ఇవ్వాల ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ ఎంపీలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం లోక్ సభ పక్షనేత నామానాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఇవ్వాల కాలుష్య ఖార్ఖానాగా మారిపోయింది. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉందన్నారు.
మరో ఎంపీ దామోదర్ రావు మాట్లాడుతూ మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఇవ్వాల జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. మనిషి శాశ్వతం కాదు.. కానీ భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సహచర సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి మా ఎంపీలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మాట్లాడిన రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి.. కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని, జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న హరిత యజ్ఞంలో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో.. రాజ్యసభ సభ్యులు, కె. కేశవరావు, సంతోష్ కుమార్, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఫౌండర్ మెంబర్ రాఘవ n కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.