దావోస్: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, నెట్వర్క్ సమన్వయ విభాగం అధిపతి మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. జనవరిలో దావోస్‌లో జరిగే సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. ఫోరం భాగస్వామ్యంతో సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగానికి అనుకూల విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచనను సీఎం వివరించారు. అందుకే హైదరాబాద్‌లో ఫాలోఅప్ ఫోరం నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ తెలిపారు. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను సీఎం వివరించారు. తెలంగాణ విజన్‌లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. ఈ విజన్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సీఎం వివరించారు. నైపుణ్యాభివృద్ధి, క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన నాల్గవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పురోగతిపై చర్చలు జరిగాయి. ఆరోగ్యం, జీవ విజ్ఞాన రంగాలకు సంబంధించి దేశంలో తొలి థీమాటిక్ కేంద్రంగా ఇది గుర్తింపు పొందిందని ఫోరం ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రభుత్వంతో పంచుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో అమలవుతున్న మూడు జోన్ల అభివృద్ధి వ్యూహాన్ని వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీని సుస్థిర అభివృద్ధికి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి అవకాశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ, బయో డిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.